స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

జోకర్.. వ్యవస్థ!

రచన: Swechaanews Chairman••32 నిమిషాల పఠనం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు. ఇన్నేళ్లలో భారత రాజకీయ వ్యవస్థ ఎన్నో మలుపులు చూసింది. ప్రభుత్వాలు మారాయి. ప్రధానమంత్రులు మారారు. ముఖ్యమంత్రులు మారారు. పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ప్రతిపక్షంలోకి వెళ్లాయి. కానీ ఒక విషయం మాత్రం రాజకీయాలను పదేపదే వెంటాడుతూనే ఉంది.

  • ఉద్దర మాటలు.. సోషల్ మీడియా వార్‌లు

  • ఆస్తులు, కేసులంటూ ఉత్తుత్తి కబుర్లు

  • అప్పుడు ఆయన.. ఇప్పుడు ఈయన

  • జనానికి ప్రయోజనం ఉందా?

  • కేసులంటారు.. విచారణలు చేస్తారు

  • నివేదికల పేరుతో కాలయాపన తప్ప ఉపయోగం ఉందా?

  • మూడేండ్లలో ఏం చేశారు?

  • ఇప్పుడెందుకు ఈ పిల్లి గాండ్రింపులు?

  • ఇన్‌స్టా పులిలా రేవంత్ టీమ్

  • సబ్జెక్ట్ లేని వారసత్వం

  • దేశాన్ని కుదిపేసిన కేసుల్లో అరెస్టులు జరిగాయి

  • తెలంగాణలో మాత్రం శిక్షలేవి?

  • స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809,

స్వేచ్ఛ ఛైర్మన్.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు. ఇన్నేళ్లలో భారత రాజకీయ వ్యవస్థ ఎన్నో మలుపులు చూసింది. ప్రభుత్వాలు మారాయి. ప్రధానమంత్రులు మారారు. ముఖ్యమంత్రులు మారారు. పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ప్రతిపక్షంలోకి వెళ్లాయి. కానీ ఒక విషయం మాత్రం రాజకీయాలను పదేపదే వెంటాడుతూనే ఉంది. అదే అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు, దర్యాప్తులు, అరెస్టులు, కోర్టు కేసులు, తీర్పులు. ఏమిటీ అవినీతి కథా చిత్రమ్? ఎందుకీ అవినీతి బాగోతం? కొన్ని కేసులు ప్రభుత్వాలనే కుదిపేశాయి. కొన్ని కేసుల్లో మంత్రులు రాజీనామా చేశారు. కొందరు జైలుకెళ్లారు. మరికొందరిని కోర్టులు నిర్దోషులుగా విడుదల చేశాయి. ఇంకొన్ని కేసులు దశాబ్దాలు గడిచినా ఇంకా కోర్టుల్లోనే ఉన్నాయి. అంటే ఒక ఆరోపణ బయటపడటం ఒక విషయం. కేసు నమోదు కావడం మరో విషయం. దర్యాప్తు జరగడం ఇంకో విషయం. ఛార్జ్‌షీట్ దాఖలు కావడం అందులో కీలకమైన మలుపు. కోర్టులో నేరం రుజువు కావడం ఫైనల్ టచ్. అందుకే భారత రాజకీయ చరిత్రలోని కొన్ని పెద్ద కేసులను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే.. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. దేశంలో ఇంతకుముందు పెద్ద పెద్ద రాజకీయ స్కాములపై వ్యవస్థ ఎలా స్పందించింది? అదే క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు సంబంధించిన కేసులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? మిగిలిన రాష్ట్రాలు, కేంద్రంలోని అవినీతి కేసులతో కలిపి చూస్తే తెలంగాణలో తాత్సారం ఎందుకు? ఇది ఎవరి లోపం? కేంద్ర ప్రభుత్వానిదా? లేక తెలంగాణ సర్కారుదా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం. అందుకే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బయటపడ్డ కుంభకోణాలు, వాటిలో తీర్పులు, శిక్షలు ఇలా ప్రతి అంశాన్ని మీ ముందుకు తెస్తున్నాం.

జీప్ స్కామ్ నుంచి మొదలైన కథ

స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే దేశం ఎదుర్కొన్న తొలి పెద్ద రాజకీయ వివాదాల్లో 1948 జీప్ స్కామ్ ఒకటి. బ్రిటన్ నుంచి ఆర్మీ కోసం జీప్‌ల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 1950లలో వచ్చిన ముండ్రా స్కామ్ స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ నిధుల నిర్వహణపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. ఎఐసీ నిధులను హరిదాస్ ముండ్రాకు సంబంధించిన కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టిన వ్యవహారం పార్లమెంట్‌లో పెద్ద దుమారం రేపింది. అప్పటి ఎంపీ ఫిరోజ్ గాంధీ ఈ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తారు. జస్టిస్ ఎంసీ చాగ్లా నేతృత్వంలో విచారణ జరిగింది. ఈ వ్యవహారం రాజకీయంగా అంతటి ప్రకంపనలు సృష్టించడంతో అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. హరిదాస్ ముండ్రాకు జైలు శిక్ష కూడా పడింది. అంటే స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది సంవత్సరాలకే ఒక విషయం స్పష్టమైంది. ప్రజాధనం విషయంలో ఆరోపణలు వస్తే పార్లమెంట్ ప్రశ్నించవచ్చు. విచారణ జరగొచ్చు. బాధ్యత రాజకీయ స్థాయికి కూడా చేరొచ్చు.

బోఫోర్స్.. 4 దశాబ్దాల తర్వాత ముగిసిన కేసు

1980లలో బోఫోర్స్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేసింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం సమయంలో స్వీడన్‌కు చెందిన బోఫోర్స్ కంపెనీ నుంచి హోవిట్జర్ గన్స్ కొనుగోలు వ్యవహారంలో కమీషన్లు చెల్లించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఒక్క వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ రాజకీయ నష్టం కలిగించింది. కేసు దర్యాప్తు సాగింది. విదేశీ సంస్థలు, మధ్యవర్తులు, రాజకీయ సంబంధాలు.. ఇలా కథ దశాబ్దాల పాటు సాగింది. కోర్టుల్లో వివిధ దశలు దాటింది. చివరికి 2026 ఆగస్టులో సుప్రీంకోర్టు చివరిగా మిగిలిన అప్పీల్‌ను కూడా కొట్టివేసింది. దీంతో దాదాపు 40 ఏళ్ల న్యాయపరమైన ప్రయాణానికి తెరపడింది. బోఫోర్స్ రాజకీయంగా ఎంత పెద్ద తుఫాను సృష్టించినా.. న్యాయపరంగా కేసు చివరి వరకు సాగిన తీరు భారత న్యాయవ్యవస్థలో సుదీర్ఘ కేసుల చరిత్రకు ఒక ఉదాహరణగా నిలిచింది.

హవాలా కేసు.. పేర్లు వచ్చాయి.. శిక్షలు ఎక్కడ?

1990లలో జైన్ హవాలా కేసు మరో సంచలనం. దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు హవాలా డైరీల్లో ఉన్నాయన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు వచ్చాయి. పెద్ద పెద్ద పేర్లు వినిపించాయి. కానీ చివరికి క్రిమినల్ కేసులో నేరం రుజువు చేయడానికి అవసరమైన సాక్ష్యాల సమస్య ముందుకొచ్చింది. చాలామంది నిందితులు కోర్టుల్లో బయటపడ్డారు. ఈ కేసు ఒక కీలకమైన పాఠాన్ని కూడా నేర్పించింది. ఒక వ్యక్తి పేరు ఏదైనా డైరీలో కనిపించడం మాత్రమే నేరాన్ని రుజువు చేయడానికి సరిపోదు. పేరు రావడం ఒకటి. నేరం రుజువు కావడం మరోటి.

హర్షద్ మెహతా.. దేశ ఆర్థిక వ్యవస్థకు షాక్

1992 సెక్యూరిటీస్ స్కామ్ దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. హర్షద్ మెహతా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, సెక్యూరిటీస్ లావాదేవీల్లో అక్రమాలు బయటపడ్డాయి. వేల కోట్ల రూపాయల వ్యవహారంపై దేశం ఉలిక్కిపడింది. ఈ కేసు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో నియంత్రణ వ్యవస్థలు, బ్యాంకింగ్ పద్ధతులు, మార్కెట్ పర్యవేక్షణపై పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. అంటే కొన్ని స్కాములు కేవలం నిందితులను కోర్టుకు తీసుకెళ్లడానికే పరిమితం కాలేదు. వ్యవస్థలోనే మార్పులు తీసుకొచ్చాయి.

టెల్గీ.. నకిలీ స్టాంపుల సామ్రాజ్యం

అబ్దుల్ కరీం టెల్గీ నకిలీ స్టాంప్ పేపర్ల వ్యవహారం దేశవ్యాప్తంగా విస్తరించిందన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో అధికారులు, పోలీసులు, రాజకీయ సంబంధాలపై కూడా ఆరోపణలు వచ్చాయి. టెల్గీపై కేసులు నమోదయ్యాయి. కోర్టు విచారణ జరిగింది. అతనికి జైలు శిక్ష పడింది. ఈ కేసు కూడా ఒక ప్యాటర్న్‌ను చూపించింది. కుంభకోణం బయటపడటం, దర్యాప్తు, అరెస్టు, కోర్టు, చివరికి శిక్ష.. ఇలా న్యాయపరమైన ప్రక్రియ ముందుకు సాగింది.

తేహెల్కా నుంచి సత్యం వరకు

2001లో తేహెల్కా స్టింగ్ ఆపరేషన్ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రక్షణ ఒప్పందాల్లో లంచాల ఆరోపణలు స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటకు రావడం అప్పట్లో పెద్ద ప్రకంపనలు రేపింది. తర్వాత 2009లో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ అకౌంటింగ్ కుంభకోణం దేశ కార్పొరేట్ చరిత్రలోనే భారీ సంఘటనగా నిలిచింది. కంపెనీ ఖాతాల్లో భారీ స్థాయిలో అక్రమ లెక్కలు చూపించారన్న విషయం బయటపడింది. సత్యం వ్యవహారం తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్, ఆడిటింగ్ వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు వచ్చాయి. ఇక్కడ రాజకీయ నాయకుడి కేసు కాకపోయినా.. ఒక పెద్ద స్కామ్ బయటపడినప్పుడు నియంత్రణ సంస్థలు, దర్యాప్తు సంస్థలు, కోర్టులు ఎలా స్పందిస్తాయో చూపించిన ఉదాహరణగా ఇది నిలిచింది.

కామన్వెల్త్ గేమ్స్.. ఆదర్శం నుంచి ఆరోపణల వరకు

2010 కామన్వెల్త్ గేమ్స్ దేశ ప్రతిష్ఠను ప్రపంచం ముందు చాటాల్సిన కార్యక్రమం. కానీ అదే సమయంలో నిర్వహణ, కాంట్రాక్టులు, కొనుగోళ్లు, ఖర్చులపై భారీ అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాగ్, సీబీఐ సహా వివిధ సంస్థలు వ్యవహారాన్ని పరిశీలించాయి. సురేష్ కల్మాడీ సహా పలువురు దర్యాప్తును ఎదుర్కొన్నారు. కొన్ని కేసులు కోర్టు దశకు వెళ్లాయి. అయితే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి చివరికి దోషిగా తేలాడని చెప్పడం సరైంది కాదు. కాగ్ అభ్యంతరం ఒకటి, సీబీఐ కేసు మరోటి, కోర్టు దోష నిర్ధారణ ఇంకోటి. ఈ తేడా చాలా ముఖ్యమైనది.

2జీ.. ఆరోపణల నుంచి విముక్తి వరకు

2జీ స్పెక్ట్రమ్ కేసు భారత రాజకీయ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన కేసుల్లో ఒకటి. స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అప్పటి టెలికాం మంత్రి ఏ.రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళి సహా పలువురు నిందితులయ్యారు. 2017లో ప్రత్యేక సీబీఐ కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. అక్కడితో కథ ముగియలేదు. సీబీఐ ఆ తీర్పును సవాల్ చేసింది. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ ప్రక్రియ కొనసాగుతోంది. అంటే 2జీ కథలో ఒకవైపు భారీ రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. ఇంకోవైపు అప్పీల్ ప్రక్రియ ఉంది. ఇదే న్యాయవ్యవస్థలో కేసులు ఎలా అనేక దశలు దాటుతాయో చూపిస్తుంది.

కోల్ స్కామ్.. అందరూ దోషులేనా?

కోల్ బ్లాక్ కేటాయింపులు కూడా దేశ రాజకీయాలను కుదిపేశాయి. 2014లో సుప్రీంకోర్టు 1993 నుంచి 2010 మధ్య జరిగిన 214 బొగ్గు బ్లాక్ కేటాయింపుల్లో 204ను చట్టవిరుద్ధంగా పేర్కొని రద్దు చేసింది. అయితే దీనిలో అందరూ నేరస్తులుగా తేలారు అని అనుకోవడం తప్పు. క్రిమినల్ కేసులు వ్యక్తిగతంగా కొనసాగాయి. 2026లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన ఒక కేసులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్ ను సుప్రీంకోర్టు అంగీకరించింది. మరో కోల్ కేసులో మాజీ కోల్ సెక్రటరీ హెచ్.సీ. గుప్తా, మాజీ ఎంపీ విజయ్ దర్దా తదితరులు కూడా 2026లో నిర్దోషులుగా విడుదలయ్యారు. అంటే ఒక విధాన నిర్ణయం వివాదాస్పదమవ్వడం ఒక విషయం. దాని వెనుక ఉన్న ప్రతి వ్యక్తి క్రిమినల్‌గా దోషి కావడం మరో విషయం.

గడ్డి స్కామ్.. లాలూ కేసు ఎందుకు ప్రత్యేకం?

బిహార్ గడ్డి స్కామ్ అంటే ప్రభుత్వ ఖజానా నుంచి పశుసంవర్ధక శాఖ పేరుతో అక్రమంగా నిధులు ఉపసంహరించుకున్నారన్న ఆరోపణలతో అనేక కేసులు నమోదయ్యాయి. లాలూ ప్రసాద్ యాదవ్‌పై వేర్వేరు ట్రెజరీ కేసులు నడిచాయి. దేవఘర్, చైబాసా, దుమ్కా, డోరండా ఇలా ఒక్కో కేసులో ఒక్కో తీర్పు వచ్చింది. 2022లో డోరండా ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా విధించారు. ఇప్పటికే ఇతర కేసుల్లో కూడా ఆయనకు శిక్షలు పడ్డాయి. అయితే ఆయా తీర్పులపై అప్పీళ్లు కొనసాగుతున్నాయి. లాలూ ఉదాహరణలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ నాయకుడిపై క్రిమినల్ కేసు నడవొచ్చు. దోషిగా తేలొచ్చు. శిక్ష పడొచ్చు. అదే సమయంలో అప్పీల్ హక్కు కూడా ఉంటుంది.

తమిళనాడులో జయలలిత కేసు

జయలలిత అక్రమాస్తుల కేసు కూడా భారత రాజకీయ చరిత్రలో కీలకమైన కేసు. 1990లలో ప్రారంభమైన ఈ కేసు దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. ట్రయల్ కోర్టు జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా తేల్చింది. తర్వాత కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును తిప్పికొట్టి వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. కానీ 2017లో సుప్రీంకోర్టు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లపై ట్రయల్ కోర్టు ఇచ్చిన దోష నిర్ధారణను పునరుద్ధరించింది. జయలలిత అప్పటికే మరణించడంతో ఆమెకు సంబంధించిన అప్పీల్ రద్దయింది. ఈ కేసు ఒక కీలకమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. హైకోర్టు తీర్పు ఒకలా ఉండొచ్చు. సుప్రీంకోర్టు తీర్పు మరోలా ఉండొచ్చు. అందుకే కేసు చివరి న్యాయస్థాయికి వెళ్లే వరకు కథ పూర్తి కాదు.

శారదా.. రాజకీయ సంబంధాల ఆరోపణలు.. కానీ తుది తీర్పు వేరు

పశ్చిమ బెంగాల్‌లో శారదా చిట్‌ఫండ్ వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లక్షలాది మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బులు సేకరించి భారీ మోసం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. 2014లో సుప్రీంకోర్టు శారదా సహా పలు చిట్‌ఫండ్ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అప్పటి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేరు కూడా ఈ కుంభకోణంలో వినిపించింది.

జగన్ కేసులు.. ఛార్జ్‌షీట్లు ఎన్నో.. తీర్పు ఇంకా లేదు

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులు అత్యంత దీర్ఘకాలిక రాజకీయ-అవినీతి కేసుల్లో ఒకటిగా నిలిచాయి. సీబీఐ 2011లో కేసు నమోదు చేసింది. ఆ తర్వాత అనేక ఛార్జ్‌షీట్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు వచ్చాయని సీబీఐ ఆరోపించింది. ఈ కేసుల్లో ఆస్తుల అటాచ్‌మెంట్, మనీలాండరింగ్, పెట్టుబడులు తదితర అంశాలపై కూడా న్యాయపోరాటాలు జరిగాయి. కానీ 2026 నాటికీ ప్రధాన క్రిమినల్ కేసుల్లో తుది తీర్పు రాలేదు.

ఢిల్లీ లిక్కర్ కేసు.. తాజా కాలానికి పెద్ద ఉదాహరణ

ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం. 2021 - 22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అవినీతి, కుట్ర ఆరోపణలతో సీబీఐ, ఈడీ దర్యాప్తులు జరిగాయి. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా పలువురు అరెస్ట్ అయ్యారు. కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత విడుదలయ్యారు. కానీ ఇక్కడే కథలో మరో మలుపు. 2026 ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ అవినీతి కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా 23 మందిని డిశ్చార్జ్ చేసింది. సీబీఐ ఆ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది.

మరి తెలంగాణ సంగతేంటి?

2014 నుంచి 2023 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం మారిన తర్వాత గత ప్రభుత్వ పాలనపై అనేక ఆరోపణలు, దర్యాప్తులు, రాజకీయ పోరాటాలు మొదలయ్యాయి. అందులో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ వ్యవహారాలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి.

కాళేశ్వరం.. కమిషన్ నుంచి సీబీఐ దాకా

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వ్యవహారంపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ 2025 జూలై 31న నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అంటే కాళేశ్వరం వ్యవహారం ఇప్పుడు కేవలం రాజకీయ ఆరోపణల స్థాయిలో లేదు. విచారణ కమిషన్ సీన్ లోకి ఎంటరైంది. నివేదిక వచ్చింది. అసెంబ్లీలో చర్చ జరిగింది. సీబీఐ దర్యాప్తుకు ఆదేశం వచ్చింది. అయితే అసలు కీలకమైన ప్రశ్నలు ఇంకా ముందున్నాయి. ఎవరిపై క్రిమినల్ బాధ్యత వస్తుంది? ఎవరిపై ఛార్జ్‌షీట్ వస్తుంది? ఎవరిపై నేరం రుజువవుతుంది? అన్నది ఇంకా దర్యాప్తు, తదుపరి న్యాయ ప్రక్రియలో తేలాల్సి ఉంది.

ఫోన్ ట్యాపింగ్.. ఇక్కడ అరెస్టులు కూడా జరిగాయి

తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చివరి దశలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై 2024లో కేసు నమోదైంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తదితరుల పేర్లు కేసులో వచ్చాయి. వారిలో పలువురు అరెస్టయ్యారు. 2024లో ఛార్జ్‌షీట్ దాఖలైంది. 2026లో కూడా దర్యాప్తు కొనసాగింది. వందలాది మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దిశగా కూడా దర్యాప్తు సాగింది.

ఫార్ములా ఈ.. ఇప్పుడు కోర్టులోనే అసలు ఫైట్

మాజీ మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. హెచ్ఎండీఏ నిధుల నుంచి చెల్లింపుల విషయంలో నిబంధనలు పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. 2026 మార్చిలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 2026 సెప్టెంబర్‌లో కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ అక్టోబర్ 30కి వాయిదా పడింది. కేటీఆర్ మాత్రం ఈ కేసును రాజకీయ కక్షగా అభివర్ణిస్తున్నారు. అంటే ఇక్కడ కూడా రెండు వాదనలు ఉన్నాయి. ప్రభుత్వం అవకతవకలు జరిగాయని అంటోంది. బీఆర్ఎస్ రాజకీయ వేధింపులని అంటోంది. కోర్టు మాత్రం చివరికి సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉంటుంది.

తెలంగాణలో కేసులు నత్తనడక ఎందుకు?

ఇదే అసలు ప్రశ్న. ఇక్కడ మొదట చూడాల్సింది కేసుల స్వభావం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కేసులో ఇంజినీరింగ్ నిర్ణయాలు, టెండర్లు, ఫైనాన్సింగ్, ప్రభుత్వ ఉత్తర్వులు, సాంకేతిక నివేదికలు, బ్యాంకింగ్ లావాదేవీలు, వందల ఫైళ్లు ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్‌లో డిజిటల్ సాక్ష్యాలు, ఫోరెన్సిక్ డేటా, అధికారుల వాంగ్మూలాలు ఉంటాయి. ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వ చెల్లింపుల ప్రక్రియ, అధికార అనుమతులు, ఆర్థిక విధానం వంటి అంశాలు ఉంటాయి.

కోర్టులో నిలబడే సాక్ష్యమే అసలు పరీక్ష

రాజకీయ వేదికపై ఆరోపణ చేయడం సులభం. ప్రెస్‌మీట్‌లో ఇది భారీ స్కామ్ అనడం సులభం. అసెంబ్లీలో ఇంత నష్టం జరిగింది అనడం కూడా సులభం. కానీ కోర్టులో ఒక వ్యక్తి నేరాన్ని రుజువు చేయాలంటే ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? దాని వెనుక ఉద్దేశం ఏమిటి? ఎవరికి ఆర్థిక ప్రయోజనం వచ్చింది? ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది? అధికారిక ప్రక్రియ ఎలా ఉల్లంఘించబడింది? అన్నదంతా ఆధారాలతో చూపించాలి. అందుకే దేశంలోనే అనేక కేసులు ఆరోపణల దశ నుంచి కోర్టులో రుజువు చేయలేని దశకు వెళ్లాయి. 2జీ, హవాలా, ఢిల్లీ ఎక్సైజ్ కేసుల్లో కనిపించిన పరిణామాలు దీనికి ఉదాహరణలు. అదే సమయంలో గడ్డి స్కామ్, జయలలితకు సంబంధించిన కేసుల్లో దోష నిర్ధారణలు కూడా జరిగాయి.

కేంద్రం గేమ్ ఆడుతోందా?

ఇది తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న అత్యంత హాట్ ప్రశ్న. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పుడు రంగంలోకి వస్తాయి? ఏ కేసుల్లో ఎంత వేగంగా చర్యలు తీసుకుంటాయి? అన్నది రాజకీయ చర్చకు కారణమవుతూనే ఉంది. కాంగ్రెస్ సహా కొన్ని రాజకీయ వర్గాలు కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తోందని ఆరోపిస్తుంటాయి. మరోవైపు బీజేపీ, కేంద్ర సంస్థలు చట్టపరమైన ఆధారాల మేరకే పని చేస్తున్నాయని చెబుతోంది.

రేవంత్ ప్రభుత్వం స్పీడ్ తగ్గించిందా?

ఇదీ మరో రాజకీయ ప్రశ్న. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కేసులను రాజకీయ కక్ష సాధింపుగా ఉపయోగిస్తోందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. కాళేశ్వరంపై కమిషన్ ఏర్పాటు చేసింది. నివేదిక తెప్పించింది. అసెంబ్లీలో చర్చించింది. ఆ తర్వాత సీబీఐ దర్యాప్తునకు అప్పగించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే ప్రజలు అడిగే తదుపరి ప్రశ్న వేరే. తుది చర్యలు ఎప్పుడు? ఎవరి మీద నేరం రుజువవుతుంది? ఎవరిపై ఛార్జ్‌షీట్ బలంగా నిలుస్తుంది? ఎప్పుడు కోర్టు తీర్పు వస్తుంది? ఇవే ఇప్పుడు అసలు పరీక్షలు.

దేశ చరిత్ర చెబుతున్న అసలు పాఠం

ఈ మొత్తం కథను చూస్తే ఒక విచిత్రమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. ముండ్రా కేసులో రాజకీయ బాధ్యత బయటపడింది. బోఫోర్స్ దాదాపు 40 ఏళ్లు నడిచింది. హర్షద్ మెహతా వ్యవహారం ఆర్థిక నియంత్రణ వ్యవస్థపై ప్రభావం చూపింది. టెల్గీ కేసులో శిక్ష పడింది. గడ్డి స్కామ్‌లో లాలూకు పలుమార్లు శిక్షలు పడ్డాయి. జయలలిత కేసులో సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును పునరుద్ధరించింది. అదే సమయంలో 2జీలో నిందితులు ట్రయల్ కోర్టులో నిర్దోషులయ్యారు కానీ సీబీఐ అప్పీల్ కొనసాగుతోంది. కోల్ కేసుల్లో కొందరికి విముక్తి లభించింది. ఢిల్లీ ఎక్సైజ్ కేసులో కూడా ట్రయల్ కోర్టు 2026లో కీలక నిందితులను డిశ్చార్జ్ చేసింది. జగన్ కేసులు మాత్రం ఇంతకాలం తర్వాత కూడా తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి. అంటే ఒకే ఫార్ములా లేదు. కొన్ని కేసులు శిక్షలతో ముగుస్తాయి. కొన్ని కేసులు నేరం రుజువు కాకుండానే ముగుస్తాయి. కొన్ని కేసులు అప్పీళ్లలో ఉంటాయి. కొన్ని కేసులు దశాబ్దాల పాటు కొనసాగుతాయి.

తెలంగాణకు ఇప్పుడు అసలు పరీక్ష ఏంటి?

తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు సంబంధించిన ఆరోపణలు నిజమా కాదా అన్నది తేలాలి. చివరికి కోర్టులో నిలిచే సాక్ష్యాలే కీలకం. కాళేశ్వరంలో సీబీఐ ఏం కనుగొంటుంది? ఫోన్ ట్యాపింగ్‌లో తదుపరి ఛార్జ్‌షీట్ ఎవరిని చేర్చుతుంది? ఫార్ములా ఈ కేసులో కోర్టు ఏ దిశలో వెళ్తుంది? ఇవే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కీలకమైన ప్రశ్నలు. దేశ చరిత్రలో ఇదే జరిగింది. 2జీలో అరెస్టులు, రాజకీయ ప్రకంపనలు వచ్చినా ట్రయల్ కోర్టు నేరారోపణలను రుజువు చేయలేకపోయింది. జయలలిత కేసులో ఒక హైకోర్టు తీర్పు ఇచ్చినా సుప్రీంకోర్టు వేరే తీర్పు ఇచ్చింది. కోల్ కేసులో ఆరోపణలు ఉన్నా మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన ఒక కేసు 2026లో క్లోజర్‌తో ముగిసింది. లాలూ కేసులో మాత్రం దోష నిర్ధారణ, శిక్షల దాకా వెళ్లింది. అంటే ప్రతి స్కామ్ కథకు ముగింపు ఒకేలా ఉండదు.

తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతోంది?

ఒకవైపు గత ప్రభుత్వంపై ఆరోపణలతో రాజకీయ పోరాటం. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తులు ముందుకు తీసుకెళ్తోంది. మూడోవైపు బీఆర్ఎస్ రాజకీయ కక్ష ఆరోపణలు చేస్తోంది. నాలుగోవైపు కేంద్ర సంస్థల పాత్రపై రాజకీయ అనుమానాలు. ఐదోవైపు కోర్టులు. మధ్యలో ప్రజలు. ప్రజల ప్రశ్న మాత్రం చాలా సింపుల్. నిజంగా తప్పు జరిగిందా? జరిగితే ఎవరు చేశారు? ఎంత నష్టం జరిగింది? ఎవరు లాభపడ్డారు? ప్రభుత్వ నిధులు ఎక్కడికి వెళ్లాయి? ఎవరు బాధ్యులు? ఎవరు నిర్దోషులు? ఎప్పుడు తుది తీర్పు? ఇదే అసలు జవాబు కోరుకుంటున్న ప్రశ్న. స్వాతంత్ర్యం తర్వాత భారత రాజకీయ చరిత్రలో స్కామ్ అనే పదం ఎన్నోసార్లు వినిపించింది. కానీ ప్రతి ఆరోపణ నేరం కాలేదు. ప్రతి కేసు శిక్షతో ముగియలేదు. ప్రతి అరెస్ట్ దోష నిర్ధారణగా మారలేదు. అలాగే ప్రతి రాజకీయ ఆరోపణను కూడా కొట్టిపారేయలేం. అందుకే ప్రజాస్వామ్యంలో అసలు పరీక్ష ఒక్కటే. దర్యాప్తు సంస్థలు నిజాయితీగా పనిచేయాలి. కోర్టులు ఆధారాల ఆధారంగా నిర్ణయించాలి. ప్రభుత్వాలు రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలి. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపాలి. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే పెద్ద పరీక్ష. కాళేశ్వరం నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు.. ఫార్ములా ఈ నుంచి భవిష్యత్తులో బయటకు వచ్చే మరిన్ని దర్యాప్తుల వరకు.. రాజకీయ యుద్ధం ఇప్పటికే మొదలైంది. కానీ అసలు యుద్ధం ఇంకా కోర్టులోనే జరగాలి. అందుకే తెలంగాణ కథకు అసలు క్లైమాక్స్ ఇంకా రాలేదు. ఇది కేవలం కేసుల కథ కాదు.. అధికారం, దర్యాప్తు, రాజకీయాలు, న్యాయవ్యవస్థ మధ్య నడుస్తున్న పెద్ద ఘర్షణ. ప్రజలు గమనిస్తున్న అవినీతి కథా చిత్రమ్.

ఆస్తుల చుట్టూ సోషల్ మీడియా వార్.. ప్రజలకు ఉపయోగం ఉందా?

ఓవైపు కేసులపై అప్పుడప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య యుద్ధం జరగడం కామన్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆస్తుల గోల జరుగుతోంది. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తుల చిట్టా ఇదేనంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించనప్పటి నుంచి యుద్ధం మొదలైంది. బీఆర్ఎస్ వర్గం కూడా అదే రేంజ్‌లో సీఎం కుటుంబ సభ్యుల ఆస్తుల చిట్టా బయటకు తీస్తున్నారు. ఇరు వర్గాలు సోషల్ మీడియాలో తిట్టిపోసుకుంటున్నాయి. దీనివల్ల జనానికి ఉపయోగం ఉందా అంటే ఏదీ లేదు. కేసులంటారు, విచారణలు చేస్తారు, నివేదికల పేరుతో కాలయాపన తప్ప ఉపయోగం ఉందా అంటూ ప్రభుత్వంపై జనం మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో తప్పులు జరిగి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవయింది. ఏం చేశారు? ఇప్పుడెందుకు ఈ పిల్లి గాండ్రింపులు? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

#SwechaNews#TelanganaPolitics#RevanthReddy#KTR#KaleshwaramCBI#PhoneTappingCase#FormulaECase#CorruptionCasesIndia
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి