కొందరు ఘరానా దొంగలు రెచ్చిపోతున్నారు.సామాన్యులతో కలిసి పోయి మంచి వారిలా నటిస్తూ జేబులు కొల్లగొడుతున్నారు.రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, బ్యాంకులు, షాపింగ్ మాల్స్‌ను టార్గెట్‌గా చేసుకుంటున్నారు ఈ దొంగలు.సాయం చేసినట్టు నటిస్తూనే డబ్బులు కాజేస్తున్నారు.అనంతరం బాధిత వ్యక్తికి అనుమానం కలుగకముందే అక్కడి నుంచి జారుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే..ఓ దొంగ సాయం చేస్తున్నట్టు నటించి బ్యాంకు వచ్చిన యువతి నుంచి రూ.1.25 లక్షల చోరీకి పాల్పడ్డాడు. హర్యానా రాష్ట్రంలోని జింద్ జిల్లా సఫిదో ప్రాంతంలో ఈ చోటు చేసుకున్నంది. మువానా గ్రామానికి చెందిన పాయల్ అనే యువతి రూ.1.25 లక్షలు డిపాజిట్ చేయడానికి సోదరుడితో కలిసి SBI బ్యాంక్‌కు వెళ్లగా.. ఆమె పక్కనే ఉన్న ఓ దొంగ సహాయం చేస్తున్నట్లు నటించాడు.
అనంతరం రూ.1.25 లక్షలు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. తొలుత ఫామ్ నింపిన ఆ దొంగ ఉద్దేశపూర్వకంగానే అకౌంట్ నంబర్‌ను తప్పుగా రాశాడు. అకౌంట్ నంబర్ తప్పుగా ఉండటం గమనించి క్యాషియర్ ఆ ఫామ్‌ను రిజెక్ట్ చేశాడు. అప్పుడు ఆ దొంగ కొత్తగా మరో ఫామ్ నింపుతున్నట్టు నటించి రూ.1.25 లక్షల క్యాష్ తీసుకుని వెళ్లిపోయాడు.
డబ్బులు కనిపించడం లేదని యువతి చూడగా.. ఆ దొంగ సైతం పరార్ అయ్యాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి.దీంతో యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


