హైదరాబాద్ మహానగరంలో ఇటీవల క్రైమ్ రేటు పెద్దఎత్తున పెరుగుతున్న తరుణంలో నగర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.కొందరు విదేశీయులు నగరంలో అక్రమంగా నివాసం ఉంటూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశంతో రంగంలోకి దిగిన పోలీసులు క్రైమ్ రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను పెద్దఎత్తున గుర్తించారు. ఆగస్టు 31 నుంచి నగరవ్యాప్తంగా కొనసాగిన స్పెషల్ ఆపరేషన్ మొత్తంగా 49 మంది అక్రమ విదేశీయులను పోలీసులు గుర్తించారు.వారిలో చాలా మంది వీసా గడువు ముగిసినా తమ దేశాలకు వెళ్లిపోకుండా నగరంలో నివాసం ఉంటున్నట్టు నిర్దారించారు.
టోలిచౌకిలో అత్యధికంగా 30 మంది.. లంగర్‌హౌస్, మెహదీపట్నంలో ఆరుగురు చొప్పున గుర్తించారు. పట్టుబడిన 49 మందిని హోల్డింగ్ సెంటర్లకు తరలించారు. కాగా, ఇప్పటికే 12 మంది వారి సొంత దేశాలకు డిపోర్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా గంజాయి, నకిలీ కరెన్సీ, మోసాలకు సంబంధించిన కేసులను సైతం గుర్తించారు.
దీనికి తోడు గడువు ముగిసిన టూరిస్ట్ వీసాతో ఉన్న కెన్యా మహిళ వ్యభిచార కార్యకలాపాల్లో ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా నగరంలో నివాసం ఉంటున్న ముగ్గురు సౌత్ సుడాన్ దేశస్తులకు డ్రగ్ స్క్రీనింగ్‌లో గంజాయ్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు. విదేశీయులకు ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు పాస్‌పోర్ట్, వీసా పరిశీలించాలని యజమానులకు ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ విదేశీయులపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసుల స్పష్టంచేశారు. కాగా, నగరంలో నివాసం ఉంటున్న కొందరు విదేశీయులు డ్రగ్స్, గంజాయి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, క్రైమ్ రేటు పెరగడంలో వీరి పాత్ర కూడా ఉందని అనుమానంతోనే పోలీసులు ఈ స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది.












