ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పూటకో మాట.. రోజుకో నిర్ణయం అనే విధంగా పాలన సాగుతోందని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో రవాణా రద్దీని తట్టుకునేందుకు ప్రణాళికలు వేయడం, కొన్ని రోజులకే వాటిని మార్చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అర్ధాంతరంగా రద్దు చేయడంపై పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కేబీఆర్ పార్క్ చుట్టూ పేరుకుపోయిన ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు రూ.1,090కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం ప్రభుత్వం ప్రాథమిక పనులు ప్రారంభించి, పెద్దఎత్తున నిధులను కూడా వ్యయం చేసింది. అయితే, ఏకారణాలు చూపకుండానే ఈ ప్రాజెక్ట్‌ను ఉన్నట్టుండి రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ప్రారంభించిన పనులను మధ్యలోనే నిలిపివేయడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని ప్రతిపక్షాలు, ప్రజలు విమర్శిస్తున్నారు.
నరికిన చెట్లు తిరిగొస్తాయా? పర్యావరణవేత్తల ఆందోళన
ఈ రోడ్ల వెడల్పు, నిర్మాణ పనుల కోసం కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నాటి పచ్చని భారీ వృక్షాలను నరికివేశారు. అభివృద్ధి పేరుతో వందలాది చెట్లను తొలగించి, ఇప్పుడు ప్రాజెక్ట్‌నే రద్దు చేయడాన్ని పర్యావరణవేత్తలు తప్పుబడుతున్నారు. ‘నిర్మాణం కోసం నరికేసిన పచ్చని చెట్లను ప్రభుత్వం మళ్లీ తిరిగి తీసుకురాగలదా?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌కే తలమానికమైన కేబీఆర్ పార్క్ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసి, చివరకు ప్రాజెక్ట్ వదిలేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా 4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన
పాత ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిన ప్రభుత్వం, దానికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. పంజాగుట్ట ఎన్ఎఫ్‌సీ జంక్షన్ (నాగార్జున సర్కిల్) నుంచి ప్రారంభించి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్‌ను కలుపుతూ ముఫకంజా విద్యా సంస్థల వరకు 4 కిలోమీటర్ల పొడవునా 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ కొత్త కారిడార్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ, ప్రజల్లో మాత్రం అనుమానాలు తొలగడం లేదు.
పదేపదే నిర్ణయాల మార్పుపై స్థానికుల ఆగ్రహం
పాలనలో స్పష్టమైన ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే ప్రభుత్వం పదేపదే నిర్ణయాలు మారుస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఒక ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయలు తగలేసి, పర్యావరణానికి విఘాతం కలిగించిన తర్వాత, దాన్ని రద్దు చేసి మరొక ప్రాజెక్ట్ అనడం ప్రభుత్వ అనాలోచిత వైఖరికి నిదర్శనమని మండిపడుతున్నారు. నిధుల దుర్వినియోగానికి బాధ్యులెవరని జనం ప్రశ్నిస్తున్నారు.
వన్‌వేతో ప్రయాణికుల గగ్గోలు
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు రెండేళ్లలో ఫ్లైఓవర్లను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అప్పటి వరకు పార్క్ చుట్టూ వన్ వే నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు. అయితే, వన్ వే నిబంధనలతో ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టు వెనక్కి తీసుకున్నప్పటికీ శాశ్వతంగా వన్ వే కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో వాహనదారులు దూరభారంతో గగ్గోలు పెడుతున్నారు.
ముందే జాగ్రత్త పడాలంటున్న నిపుణులు
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ముందుకు వెళ్లాలని నగర రవాణా, నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు తెచ్చిన పంజాగుట్ట - జూబ్లీహిల్స్ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన కూడా రేపు సాంకేతిక, పర్యావరణ కారణాల సాకుతో రద్దు కాకుండా ముందే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలు, పర్యావరణ ప్రభావ అంచనాలు (EIA) పూర్తి చేశాకే పనులు ప్రారంభించాలని, ప్రజాధనాన్ని మళ్లీ వృథా చేయవద్దని స్పష్టం చేస్తున్నారు.


