హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన సీనియర్ అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రౌడీషీటర్‌కు జైలు సూపరింటెండెంట్ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సదరు రౌడీషీటర్ ఏకంగా రూ.2కోట్లు లంచంగా చెల్లించి బెయిల్ పొందాడని, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అమాయకులపై దాడులు చేయడమే కాకుండా మరిన్ని హత్యలకు కుట్రలు పన్నుతున్నాడని ఒవైసీ బాహాటంగానే విమర్శించారు.
వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం సుదీర్ఘ కాలంగా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నందుకే లాయర్ ఖాజా మొయినుద్దీన్‌ను పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని ఒవైసీ స్పష్టం చేశారు. ఇలాంటి దారుణమైన నేరాలకు ఒడిగడుతూ సమాజ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని, వారిని వెంటనే నగర బహిష్కరణ (ఎక్స్‌టర్న్‌మెంట్) చేయాలని డిమాండ్ చేశారు.
నేరస్తులతో చేతులు కలిపే జైలు అధికారుల తీరు వల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. లంచం తీసుకుని నిందితుడికి బెయిల్ లభించేలా సహకరించినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జైలు సూపరింటెండెంట్‌ను తక్షణమే విధుల్లోంచి తొలగించి, ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఈ ఘటనతో భయాందోళనలో ఉన్న బాధితుల కుటుంబసభ్యులకు ప్రభుత్వం, పోలీసులు తగిన భద్రత కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. నేరస్థులకు సహకరించే అధికారుల వల్ల శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని, దీనికి వెంటనే అడ్డుకట్ట వేయకపోతే నగరంలో శాంతిభద్రతలు మరింత క్షీణించే ప్రమాదం ఉందన్నారు. అసదుద్దీన్ ఆరోపణలతో రక్షణ శాఖలో వైఫల్యాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇప్పటికైనా జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.


