తెలంగాణ

BRS : కొడంగల్‌లోనే సీఎంకు చెక్.. గులాబీ దళం పక్కా స్కెచ్ ఇదేనా!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

తెలంగాణ రాజకీయ సంగ్రామంలో ఇప్పుడు ఊహించని సభల యుద్ధం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎదురుదాడికి దిగారు. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో నిప్పులు చెరిగి, తదుపరి లక్ష్యంగా హరీశ్ రావు అడ్డా సిద్దిపేటను ఎంచుకోవడంతో గులాబీ శిబిరం ఆత్మరక్షణలో పడిందని భావించిన వారికి.. బీఆర్‌ఎస్ ఇప్పుడు ఊహించని ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

BRS : తెలంగాణ రాజకీయ సంగ్రామంలో ఇప్పుడు ఊహించని సభల యుద్ధం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎదురుదాడికి దిగారు. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో నిప్పులు చెరిగి, తదుపరి లక్ష్యంగా హరీశ్ రావు అడ్డా సిద్దిపేటను ఎంచుకోవడంతో గులాబీ శిబిరం ఆత్మరక్షణలో పడిందని భావించిన వారికి.. బీఆర్‌ఎస్ ఇప్పుడు ఊహించని ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిని ఆయన సొంత గడ్డపైనే సవాలు చేస్తూ.. కొడంగల్‌లోనే భారీ పొలిటికల్ బాంబు పేల్చేందుకు గులాబీ దళం పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

సీఎం అడ్డాలోనే ముకుతాడు వేసే ప్లాన్!

ఎదుటివారి కంచుకోటలను బద్దలు కొట్టే వ్యూహానికి బదులుగా, ఏకంగా నాయకుడి మూలాలనే దెబ్బకొట్టాలన్నది గులాబీ దళం పక్కా వ్యూహం రచిస్తుందని తెలుస్తుంది. సిరిసిల్ల సభలో రేవంత్ చేసిన విమర్శలను తేలిగ్గా వదిలేయకుండా, సీఎం సొంత ఇలాకా అయిన కొడంగల్ వేదికగానే సమాధానం చెప్పాలని గులాబీ అధిష్ఠానం భావిస్తోంది. "మీరు మా నియోజకవర్గాలకు వస్తే.. మేం నేరుగా మీ సొంత ఇలాకాలోనే సభ పెట్టి నిలదీస్తాం" అనే స్పష్టమైన హెచ్చరికను కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపడమే ఈ ప్రతివ్యూహం వెనుక అసలు ఉద్దేశం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గులాబీ నేతలు సంధించనున్న ప్రధాన అస్త్రాలు:

కొడంగల్ నియోజకవర్గ పరిధిలో స్థానిక రైతులపై నమోదైన పోలీసు కేసుల అంశాన్ని బీఆర్‌ఎస్ రాజకీయాస్త్రంగా మార్చుకోనుంది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే రైతులు ఇబ్బందులు పడుతున్నారని చూపిస్తూ రేవంత్‌ను డిఫెన్స్‌లో నెట్టే ప్రయత్నం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. సిరిసిల్ల వేదికగా కేటీఆర్ ఆస్తులపై రేవంత్ చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు, సీఎం కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను, అనుమానాస్పద లావాదేవీలను పక్కా ఆధారాలతో కొడంగల్ గడ్డపైనే బయటపెట్టేందుకు గులాబీ దళం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా, సీఎం తన సొంత నియోజకవర్గాన్ని సైతం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని.. గత బీఆర్‌ఎస్ పాలనలోనే కొడంగల్ రూపురేఖలు మారాయని గణాంకాలతో సహా చాటిచెప్పే ప్రయత్నం జరగనుంది.

వ్యూహాత్మక అడుగులు

ఈ సభ విషయంలో గులాబీ నాయకత్వం అత్యంత ఆచితూచి అడుగులు వేస్తోంది. సాధారణ రాజకీయ బహిరంగ సభగా ప్రకటిస్తే ప్రభుత్వం నుంచి అనుమతుల చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో పాటు, అధినేత కేసీఆర్ హాజరుపై భిన్నమైన చర్చ నడిచే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని రాజకీయ సభగా కాకుండా, పట్టభద్రుల ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమం రూపంలో నిర్వహించడమా లేక నియోజకవర్గ స్థాయి మేధోమథన సదస్సుగా ప్లాన్ చేయడమా అనేదానిపై కసరత్తు జరుగుతోంది. ఏది ఏమైనా అక్టోబర్ చివరి నాటికి కొడంగల్ వేదికగా బలప్రదర్శన చేసి, రాష్ట్ర రాజకీయాలను తనవైపు తిప్పుకోవాలన్న బీఆర్‌ఎస్ స్కెచ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

#BRS#Bharat Rashtra Samithi#Telangana Politics#BRS Politics#Revanth Reddy#Telangana Congress#Congress vs BRS#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి