Home Appliances: దసరా, దీపావళి వచ్చిందంటే చాలు.. ఇళ్లలోకి కొత్త కాంతులు తెచ్చుకోవాలని, పాత టీవీ స్థానంలో స్మార్ట్ టీవీ, వంటింట్లోకి కొత్త రిఫ్రిజిరేటర్ లేదా వాషింగ్ మెషీన్ కొనుక్కోవాలని మధ్యతరగతి కుటుంబాలు ఏడాదంతా ఎదురుచూస్తుంటాయి. పండుగ వేళ కంపెనీలు ప్రకటించే భారీ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్చేంజ్ బోనస్‌లు తమ బడ్జెట్‌కు సరిపోతాయని కలలు కంటారు. కానీ ఈసారి మాత్రం ఆ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆఫర్ల పలకరింపులకు బదులు, పండుగ రాకముందే నిత్యావసర ఎలక్ట్రానిక్స్ ధరలకు రెక్కలు వచ్చాయి. పండుగ ఆఫర్ల ఆశలపై కంపెనీలు ఒక్కసారిగా ధరల పిడుగు విసిరాయి.
రూ.10 వేల వస్తువు రూ.13 వేలకు!
సాధారణంగా పండుగల సమయంలో మార్కెట్ డిమాండ్‌ను బట్టి ధరల్లో కొద్దిగా మార్పులుంటాయి. కానీ ఈ ఏడాది గృహోపకరణాల ధరలు పెరగడం ఇది ముచ్చటగా మూడోసారి. గతంతో పోలిస్తే ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్ రేట్లు ఏకంగా 30 శాతం వరకు ప్రియమయ్యాయి. గతంలో రూ.10,000 పలికిన బేసిక్ మోడల్స్ ఇప్పుడు ఏకంగా రూ.13,000 కడితే తప్ప దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు ఉపకరణాలపై 23 శాతం వరకు ధరలు పెరగ్గా, తాజాగా మరో 5 నుంచి 8 శాతం అదనపు భారం పడింది. పండుగ బోనస్‌లు చేతికొచ్చే లోపే మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకడం మధ్యతరగతి ప్రజలను తీవ్ర అయోమయంలో పడేసింది.
ఏసీల తయారీపై రాగి పిడుగు..
ముఖ్యంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు విపరీతంగా పెరగడం వెనుక ముడిసరుకుల సంక్షోభం ప్రధాన కారణంగా నిలిచిందని చెబుతున్నారు. ఒక్క ఏసీ తయారీకే దాదాపు 3 నుంచి 4 కిలోల రాగి (కాపర్) అవసరం అవుతుంది. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో టన్ను రాగి ధర 8,000 నుంచి 9,000 డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా 14,500 డాలర్లకు ఎగబాకింది. దీనికి తోడు అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్ ముడిసరుకుల రేట్లు కూడా భారీగా పెరిగాయి. ముడి చమురు భగ్గుమనడంతో లాజిస్టిక్స్, రవాణా వ్యయం తడిసిమోపెడైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులు, దిగుమతి సుంకాలు కంపెనీల తయారీ వ్యయాన్ని 15 శాతానికి పైగా పెంచేశాయి. ఈ భారమంతా చివరకు కస్టమర్ల జేబుల నుంచే వసూలు చేస్తున్నారు.
ప్రముఖ బ్రాండ్ల ముందస్తు షాక్
మార్కెట్‌లోని బ్లూస్టార్, గోద్రెజ్, ఎల్జీ, డైకిన్, హెయిర్, హిటాచీ వంటి అగ్రగామి బ్రాండ్లన్నీ ధరల పెంపును అమల్లోకి తెచ్చాయి. ఏసీల ధరలు బ్రాండ్‌ను బట్టి రూ.2,000 నుంచి రూ.4,000 వరకు పెరిగాయి. వాషింగ్ మెషీన్లు, ఫ్రిడ్జ్‌లు, టీవీలపై మరో 3 నుంచి 4 శాతం వరకు పెంపు తప్పదని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. గోద్రెజ్ అప్లయెన్సెస్ ఉత్పత్తి వ్యయం 8-10% పెరిగిన కారణంగా 5-7% ధరల పెంపు అనివార్యమని ప్రకటించగా, హెయిర్ సంస్థ ఇప్పటికే 5 శాతం పెంచి, డిసెంబర్ - జనవరి నాటికి రెండో విడత పెంపునకు రెడీ అవుతుంది.
పాత స్టాక్ అయిపోతే ఇక అంతే..
పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళనతో చాలామంది కస్టమర్లు ముందస్తు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో డీలర్లు తెచ్చి పెట్టుకున్న పాత స్టాక్ మాత్రమే ప్రస్తుతం కాస్త పాత ధరలకు దొరుకుతుంది. ఆ స్టాక్ కంప్లీట్‌గా అయిపోతే కొత్త రావడంతోనే పెరిగిన ధరలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. దీంతో ప్రస్తుతం షోరూమ్‌లలో పండుగ సందడి కంటే ముందే ఆందోళనతో కూడిన రద్దీ కనిపిస్తోంది. పండుగ వేళ కొత్త వస్తువులతో ఇళ్లను ముస్తాబు చేసుకోవాలనుకున్న సామాన్యుడికి ఈ ధరల మంట తీవ్ర నిరాశను మిగులుస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.


