అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ(31) ఉద్యోగరీత్యా అమెరికాలోని మిస్సోరిలో నివాసముంటోంది. ఆమె కారులో ప్రయాణిస్తుండగా వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సుప్రియ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఆమెతో పాటు ప్రయాణిస్తున్న మరొక భారతీయ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. సుప్రియ భర్త కొడుమూరి రంజిత్, అత్తమామలు ప్రస్తుతం మహబూబాబాద్ పట్టణంలోని వీరభద్ర అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్నారు. ఈ ప్రమాద వార్త తెలియగానే సుప్రియ కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఘటనతో మహబూబాబాద్ పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు కావాల్సిన ప్రక్రియలపై స్థానిక అధికారులు, కుటుంబ సభ్యులు ఆరా తీస్తున్నారు. మిస్సోరి పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


