గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.నేరెళ్ల బాధితులను బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ కుమ్మక్కై దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ మండిపడ్డారు. ఆదివారం బంజారాహిల్స్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2017లో ఇసుక మాఫియాను అడ్డుకున్న నేరెళ్ల దళిత, బడుగు వర్గాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు సాగించిన దాష్టీకాలను మరోసారి గుర్తుచేశారు.
నేరేళ్ల బాధితుల దుఃఖాన్ని రాజకీయంగా వాడుకుని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, తీరా గద్దెనెక్కాక అసలు వాళ్లు బాధితులు అనడానికే ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెప్పడం చూస్తుంటే ప్రతిపక్ష, అధికార పార్టీలు కుమ్మక్కు అయ్యాయని స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. నేరెళ్ల బాధితులపై పెట్టిన అక్రమ కేసులు రికార్డుల్లో భద్రంగా ఉన్నప్పుడు జైలర్ రాసిన నివేదికలు, అప్పటి డీఐజీ రవివర్మ పరిశీలన రిపోర్టులు ఎలా మాయం అయ్యాయని నిలదీశారు.
జాతీయ ఎస్సీ కమిషన్ నిర్వహించిన ప్రజాకోర్టు రికార్డులపై ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేవడం లేదని అడిగారు. గత ప్రభుత్వ పాలనలో నేరెళ్ల బాధితులు దారుణ హింసకు గురైతే ప్రస్తుత ప్రభుత్వంలోనూ వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు కేవలం రూ.5 లక్షలు, రూ.10 లక్షల చొప్పున అరకొర చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఎన్నో ఏండ్లుగా ఆసుపత్రులు, కోర్టుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తున్న 8 కుటుంబాలకు ప్రభుత్వం అందజేసిన ఆర్థికసాయం ఏ మాత్రం న్యాయం చేయలేదని పేర్కొన్నారు.
రేవంత్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం, 3 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని, త్వరలోనే ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాస్తామని హెచ్చరించారు.


