Health Tech : సాంకేతికత పుణ్యమా అని గుండె కొట్టుకునే వేగం నుంచి శరీరంలోని ఆక్సిజన్ స్థాయిల వరకు అన్నింటినీ చేతి గడియారాలు, స్మార్ట్ రింగులతో కొలుస్తున్న కాలమిది. అయితే ఇప్పుడు ఏకంగా మనిషి మెదడు పనితీరును అంచనా వేస్తామంటూ ఒక సరికొత్త గ్యాడ్జెట్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రూపొందించిన ‘టెంపుల్’ అనే పరికరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇది నిజంగా విప్లవాత్మక ఆవిష్కరణా? లేక మార్కెటింగ్ జిమ్మిక్కులతో కూడిన భ్రమా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
మెదడు స్కానర్ అనే ప్రచారం ఎంతవరకు నిజం?
నుదురు, చెవి మధ్య ఉండే కణత భాగంలో ఈ చిన్న పరికరాన్ని అమర్చుకుంటే మెదడులోని రక్త ప్రసరణను, ఆక్సిజన్ స్థాయిలను, అంతర్గత ఉష్ణోగ్రత నియంత్రణను సూచించే బయోలాజికల్ ఎంట్రోపీని ‘బ్రెయిన్ ఫ్లో టెక్నాలజీ’ ద్వారా లెక్కిస్తుందని సంస్థ ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా విరాట్ కోహ్లీ, పీవీ సింధు వంటి దిగ్గజ క్రీడాకారులు దీనిని వినియోగిస్తున్నారంటూ మార్కెట్లో భారీ హైప్‌ను సృష్టించి, ఏకంగా రూ.85,000 ధరతో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. ప్రముఖుల పేర్లతో ప్రచారం జోరుగా సాగడం చూస్తుంటే, సాంకేతిక బలం కంటే బ్రాండ్ మార్కెటింగ్‌పైనే సంస్థ ఎక్కువ ఆధారపడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైద్యుల సందేహాలు.. శాస్త్రీయతపై నిలదీత
సాధారణంగా వైద్యరంగంలో ఒక పరికరాన్ని ప్రామాణికంగా గుర్తించాలంటే నిశితమైన క్లినికల్ ట్రయల్స్, 'పీర్-రివ్యూడ్' పరిశోధనా పత్రాలు తప్పనిసరి. అయితే ఈ డివైస్‌కు అలాంటి బలమైన శాస్త్రీయ నిరూపణలు ఏవీ లేవని ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ సైరియాక్ అబ్బీ ఫిలిప్స్‌తో పాటు పలువురు వైద్య నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు.
ఈ పరికరం మెదడు లోపల జరిగే రక్త ప్రసరణను ఏమాత్రం పర్యవేక్షించలేదని, ముఖంపై ఉండే పైచర్మపు రక్త నాళాల్లోని మార్పులను మాత్రమే గుర్తిస్తోందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వైద్యపరమైన ఫలితాలు, శాస్త్రీయ ధ్రువీకరణలు లేకుండానే కస్టమర్ల నుంచి రూ.85 వేల భారీ మొత్తాన్ని వసూలు చేయడం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్షమాపణలు.. ప్రీ-ప్రింట్ పత్రాల వాగ్దానం
ఈ విమర్శలపై తొలుత ఆగ్రహం వ్యక్తం చేసి వైద్యులనే తప్పుపట్టిన గోయల్, ఆ తర్వాత తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పరికరం పనితీరుపై పూర్తి స్థాయి శాస్త్రీయ నిర్ధారణకు ఇంకా సమయం పడుతుందని ఆయన అంగీకరించడం గమనార్హం. పరిశోధనలకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రీ-ప్రింట్ రూపంలో విడుదల చేస్తామని, నచ్చకపోతే 14 రోజుల్లో డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని సంస్థ ప్రకటించింది.
ఒక పరికరం పనితీరుపై శాస్త్రీయంగా పూర్తి స్పష్టత రాకముందే, స్టార్ డమ్ అండతో మెదడును స్కానింగ్ చేస్తుందంటూ మార్కెట్లోకి తేవడం మార్కెటింగ్ మాయాజాలం తప్ప మరొకటి కాదనే వాదనలకు బలం చేకూరుతోంది. శాస్త్రీయ పరీక్షల గండం గట్టెక్కితే తప్ప, ఇది మెదడు స్కానర్ కాదని, కేవలం మార్కెటింగ్ ఎత్తుగడ మాత్రమేనన్న అనుమానాలు తొలగిపోవు.


