రాష్ట్రంలో కొత్త చేయూత పింఛన్ల లబ్దిదారులు మొత్తంగా 4.5 లక్షలు ఉంటే అందులో 3.5 లక్షలు ఒంటరి మహిళలు, వితంతువులకు కేటాయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.అదేవిధంగా నేత, గీత కార్మికులకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రతిరోజూ 37 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారన్నారు.
మహిళా సాధికారతే లక్ష్యం..
మహిళా సాధికారతే రాష్ట్ర ప్రగతికి బలమైన పునాది అని సీఎం అన్నారు. 2034 నాటికి మహిళా స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది సభ్యులను చేర్చి, వారందరినీ కోటీశ్వరులుగా మారుస్తామన్నారు. మహిళలు కేవలం సంఘాల సభ్యులుగా కాకుండా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కొడంగల్ పర్యటనలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం మాట్లాడారు. దీపావళి నాడు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చిన మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
'మీరే నా కుటుంబం.. నా ఆత్మబంధువులు. మీ ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా. అడిగిన దానికంటే ఎక్కువే ప్రజలు నాకు అందించారు. ఇక జీవితంలో నేను ఆశించేది ఏమీ లేదు. మీ అభివృద్ధి కోసం పనిచేయడమే నా లక్ష్యం’ అని పేర్కొన్నారు.
మహిళలకు రూ.79 వేల కోట్ల రుణాలు..
తెలంగాణలో ప్రస్తుతం 70 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, వారి చేతుల్లో ఆర్థిక స్వావలంబన ఉంటేనే కుటుంబాలు బాగుపడతాయని అన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్‌ల కుట్టుపని బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. తద్వారా ఏటా రూ.15 నుంచి రూ.20 కోట్ల వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పెట్రోల్ బంకులు, సౌర విద్యుత్ ఉత్పత్తి రంగాల్లోనూ మహిళలకు భాగస్వామ్యం కల్పించామన్నారు. గత 34 నెలల్లో మహిళా సంఘాలకు రూ.79 వేల కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలు అందించామని గుర్తుచేశారు.
చదువే కీలకం..పిల్లలపై నిర్లక్ష్యమొద్దు..
పిల్లలకు ఉన్నత విద్య అందించాలని మహిళలకు సీఎం పిలుపునిచ్చారు. ‘మీరు పడిన కష్టం మీ పిల్లలు పడకూడదు. చదువే జీవితాలను మారుస్తుంది. మీ పిల్లల చదువులపై మీకు ఎంత శ్రద్ధ ఉందో.. నాకు కూడా అంతే శ్రద్ధ ఉంది. మీ ఆడబిడ్డలను ఉన్నత చదువులు చదివిస్తామని నా పుట్టినరోజు సందర్భంగా మాట ఇవ్వండి. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని సీఎం భరోసా కల్పించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి పారిశ్రామికవేత్తలుగా మారాలని పిలుపునిచ్చారు. మహిళా స్వయం సంఘాలతో ముఖాముఖికి ముందు కొడంగల్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మంజూరైన 4.5 లక్షల చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


