Telangana Politics: తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాషాయ పార్టీలో ఆధిపత్య పోరుకు తెరలేపాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో రెండు స్థానాలకు పోలింగ్ జరగనుండగా, ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంపై బీజేపీ శ్రేణుల్లో ముందే స్పష్టత వచ్చింది. అక్కడ మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయింది. కానీ, ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానమే ఇప్పుడు పార్టీలో ముఠా తగాదాలు, తీవ్ర అసంతృప్తికి కేంద్ర బిందువుగా మారింది.
జెండా మోసిన సొంత నేత వర్సెస్ బయటి నాయకుడు
ఈ స్థానంలో పార్టీ అభ్యర్థిత్వం చుట్టూ నడుస్తున్న అసలు వివాదం.. "సంస్థాగతంగా పనిచేసిన సొంత నేతకా? లేక బయటి నుంచి వచ్చే వ్యక్తులకా?" అనే చర్చ. పార్టీలో అంతర్గతంగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి టి. రవికుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఏళ్ల తరబడి కాషాయ జెండా మోసి, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నాయకుడికే ప్రాధాన్యత ఇవ్వాలని కేడర్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. రవికుమార్ కూడా పార్టీ ముఖ్యనేతలను కలుస్తూ టికెట్ తనకే దక్కాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, పీఆర్టీయూ నేత భిక్షం గౌడ్ బీజేపీ పంచన చేరి ‘బి-ఫామ్’ దక్కించుకోవడానికి జోరుగా పావులు కదుపుతున్నారు. ఆయన బీజేపీలోకి వస్తే ఉపాధ్యాయ ఓటర్ల మద్దతు లభిస్తుందని, ఇరు స్థానాల్లోనూ ఆ ప్రభావం ఉంటుందని కొందరు పార్టీ పెద్దలు భావిస్తుండటమే ఈ చిచ్చుకు కారణమైంది.
బయటి వ్యక్తులకు రెడ్ కార్పెట్ వేస్తే ఊరుకోం
ఈ పరిణామం ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైన టీపీయూఎస్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. సిద్ధాంతాలు పక్కనపెట్టి, ఎన్నికల స్వార్థం కోసం బయటి సంఘాల నాయకులను ఎలా నెత్తిన పెట్టుకుంటారని సంఘ్ పరివార్ వర్గాలు పార్టీ పెద్దలను నిలదీస్తున్నాయి. దీనికితోడు, మిత్రపక్షమైన జనసేన అభ్యర్థి పేరును కూడా కొందరు పరిశీలిస్తుండటంతో గందరగోళం మరింత పెరిగింది. సంస్థ సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేస్తున్న సొంత పార్టీ నేతలకు అన్యాయం చేసి, పొరుగు గూటి నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తే ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో కేడర్ ఏ మేరకు సహకరిస్తుందనేది బీజేపీ అధిష్ఠానానికి మింగుడుపడని ప్రశ్నగా మారింది. ఈ టికెట్ వార్ చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి.


