చిన్న చిన్న గొడవలు చిలికిచిలికి గాలి వానలా మారుతున్నాయి. కూర్చుని మాట్లాడుకుంటే పోయేదానికి ప్రతిదానికి వాగ్వాదానికి దిగడం, నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోవడంతో కొందరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దీంతో ఏం చేస్తున్నారో ఆ క్షణం వారికే తెలియడం లేదు.ఫలితంగా ఎదుటివారి ప్రాణాలు తీయడం లేదా తమ ప్రాణాలను తీసుకోవడం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.
రాత్రి భోజనంలో వండిన కూర విషయంలో వివాదం కాస్త భర్త హత్యకు దారి తీసింది. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. నరోడా స్మార్ట్ సిటీలో నివాసముంటున్న మాజీ ఆర్మీ జవాన్ దిలీప్.. ప్రస్తుతం జీఎండీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
అయితే, గురువారం రాత్రి సమయంలో కూర విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇద్దరూ పరస్పరం దూషించుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన నిర్మల వంటగదిలోని కత్తి తెచ్చి దిలీప్ ఛాతీ ఎడమ భాగంలో గుండె పైభాగంలో బలంగా పొడిచింది.
తీవ్ర రక్తస్రావమైన దిలీప్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న నరోడా పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. నిందితురాలు నిర్మలను అరెస్ట్ చేశారు. హత్యకు దారితీసిన అంశాలపై వివరాలు సేకరించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. తండ్రి మృతి చెందడం, తల్లి కటకటాలపాలవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు.వారిని సమీప బంధువులకు అప్పగించినట్టు తెలుస్తోంది.


