బాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన రాధికా ఆప్టే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దక్షిణాదికి చెందిన ఒక సీనియర్ హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాగా, తాజాగా నటి కీర్తి సురేశ్‌తో కలిసి తాను నటించిన 'అక్క' అనే చిత్రం ప్రమోషన్ల కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో దక్షిణాది సినీ రంగంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, ఎదురైన ఇబ్బందులను బహిరంగంగా పంచుకుంది.
దక్షిణాది సినిమాల షూటింగ్స్ సమయంలో తనకు తీవ్రమైన ఒంటరితనం అనుభవంలోకి వచ్చిందని రాధికా ఆప్టే ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ సెట్స్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడ సరైన పరిచయస్తులు గానీ, స్నేహితులు గానీ ఉండేవారు కాదని తెలిపింది. ఒక కొత్త ప్రాంతంలో సరైన ఏజెంట్ తోడు లేకుండా, ఎవరి సహాయం లభించక ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చేదని, అంతేకాకుండా సినిమా సెట్స్‌లో అత్యధిక శాతం పురుషులే ఉండేవారని, పురుషాధిక్య వాతావరణంతో పాటు వారు మాట్లాడే ప్రాంతీయ భాష తనకు అర్థం కాకపోవడంతో మానసికంగా తీవ్ర అసౌకర్యానికి, ఒంటరితనానికి గురయ్యానని గుర్తుచేసుకుంది. బాలీవుడ్‌లోనూ కొన్ని ప్రతికూల అనుభవాలు ఎదురైనప్పటికీ, సౌత్ ప్రాజెక్టుల సమయంలో మరింత ఇబ్బంది పడ్డానని చెప్పింది.
దక్షిణాదిలోని కొన్ని సినిమాల చిత్రీకరణ సమయంలో కనీసం అగ్రిమెంట్లు ఉండేవి కావని, నటీనటులకు ముందుగా స్క్రిప్ట్ కూడా ఇచ్చేవారు కాదని రాధిక తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు సెట్లో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో, వేటిని అడగాలో ఎలా స్పందించాలో అర్థం కాక మానసిక వేదనను అనుభవించానని వివరించింది. అదే సమయంలో మరాఠీ చిత్రాల్లో నటించేటప్పుడు మాతృభాష కావడం వల్ల, ఏవైనా ఇబ్బందులు వస్తే వెంటనే ఇంటికి వెళ్లిపోయే వెసులుబాటు ఉండేదని తెలిపింది. కానీ సౌత్ చిత్రాల షూటింగ్ సమయంలో మాత్రం తనకు ఏమాత్రం సహాయం లేని నిస్సహాయ స్థితిలో ఒంటరిగా మిగిలిపోయానని వ్యాఖ్యానించింది.
అయితే కాలంతో పాటు తనలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరిగిందని, నాటి ప్రతికూల పరిస్థితుల నుంచే ఎంతో నేర్చుకున్నానని రాధికా ఆప్టే స్పష్టం చేసింది. తన హద్దులు ఏమిటో ఇతరులకు స్పష్టంగా చెప్పడం, సెట్స్‌లో ఎక్కడైనా తప్పు లేదా అన్యాయం జరిగితే ధైర్యంగా ఎదిరించి మాట్లాడటం నేర్చుకున్నానని తెలిపింది. కాగా, తెలుగులో రామ్ గోపాల్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రక్త చరిత్ర', అదేవిధంగా 'ధోని', 'ఎందుకంటే ప్రేమంట!', బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'లయన్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో రాధికా ఆప్టే కథానాయికగా నటించి మెప్పించింది. అయితే, తన అనుభవాలను నిక్కచ్చిగా చెబుతుండటంపై పలు చర్చలకు దారితీస్తోంది.


