తెలంగాణ రాజకీయాల్లో కొడంగల్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయి విమర్శలు దుమారం రేపాయి. తమ మూడేళ్ల పాలనలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని రేవంత్ పేర్కొనడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "ముఖ్యమంత్రి పడుతున్న ఆ కష్టం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమా? లేక కమీషన్లు దండుకోవడం కోసమా?" అని హరీశ్‌రావు నేరుగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పాలనపై రేవంత్ చేసిన విమర్శలను తిప్పికొడుతూ, గత ప్రభుత్వం కొడంగల్‌కు ఏమీ చేయలేదనడం శుద్ధ అబద్ధమని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని హరీశ్‌రావు ఆధారాలతో వివరించారు. కేసీఆర్ హయాంలో కొడంగల్‌లో రెండు 50 పడకల ఆసుపత్రుల నిర్మాణం, ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ప్రతీ మండలానికి ధాన్యపు గోదాముల నిర్మాణం, బీటీ రోడ్ల విస్తరణ, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులను పూర్తి చేశామని గుర్తుచేశారు.
అంతేకాకుండా నియోజకవర్గ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కొడంగల్ అభివృద్ధిని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి.. తన పాలనలో సిద్దిపేటకు ఏం చేశారో చెప్పగలరా?’ అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు తరలించుకుపోయారని, రూ.14కోట్ల క్రీడా ప్రాంగణం (స్టేడియం), ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, రింగ్ రోడ్డు, పంచాయతీరాజ్ రోడ్ల పనులను రద్దు చేశారని ఆరోపించారు.
అదేవిధంగా వెయ్యి పడకల ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ పనులను మధ్యలోనే నిలిపివేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో 25లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా, ఇటీవలి వర్షాలకు ధాన్యం కొట్టుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దునిద్రపోతోందని హరీశ్‌రావు విమర్శించారు. తమ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పనులపై ప్రజల సమక్షంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కొడంగల్, సిద్దిపేట అభివృద్ధి అంశాలపై హరీశ్‌రావు చేసిన ఆరోపణలు, విమర్శలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయమవుతున్నది.


