హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగ అయిన దీపావళికి ప్రత్యేక ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినం వెనుక అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు, సత్యభామ సమేతుడై నరకాసురుడిని సంహరించిన ఘట్టాన్ని స్మరించుకుంటూ నరకచతుర్దశిగా, అదేవిధంగా శ్రీరాముడు రావణాసురుడిని అంతమొందించి 14ఏళ్ల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన వేళ ప్రజలు దివ్యమైన దీపాలతో స్వాగతం పలికిన జ్ఞాపకంగా దీపావళిని ఆనవాయితీగా జరుపుకుంటారు.
నరకచతుర్దశి, దీపావళి అమవాస్య పర్వదినాలు కలిసి రావడం ఈ ఏట వేడుకలకు మరింత ఆధ్యాత్మిక శోభను, ప్రాధాన్యతను తీసుకొచ్చింది. దీపావళి రోజున సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున నిద్రలేచి తలకు, శరీరానికి నువ్వుల నూనె రాసుకుని చేసే అభ్యంగన స్నానానికి విశేష ప్రాముఖ్యత ఉనట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయడం వల్ల శరీరం, మనస్సు సంపూర్ణంగా శుద్ధి అవుతాయని భక్తుల విశ్వాసం.
స్నానానంతరం శ్రీకృష్ణుడు, సత్యభామల పటాలకు లేదా విగ్రహాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలి. అధర్మంపై ధర్మం సాధించిన విజయ జ్ఞాపకాలను స్మరించుకుంటూ భగవంతుడిని ఆరాధిస్తే నిత్య విజయం, సుఖసంతోషాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు ఉద్ఘాటిస్తున్నారు. పండుగ రోజు సాయంత్రం వేళ ఇంటిని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, గుమ్మాల వద్ద, ప్రాంగణంలో మరియు పూజా మందిరంలో ప్రమిదలలో దీపాలు వెలిగించడం ప్రధాన సంప్రదాయంగా వస్తోంది.
అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగులను నింపే దీపాలు శుభానికి, సానుకూల శక్తికి ప్రతీకలుగా నిలుస్తాయి. సాయంత్రం శుభ ముహూర్తంలో విఘ్నేశ్వరుడైన శ్రీ మహాగణపతిని, అనంతరం సిరిసంపదల అధిదేవత అయిన లక్ష్మీదేవిని కుటుంబ సమేతంగా భక్తితో పూజించాలి. పువ్వులు, పండ్లు, పిండివంటల నైవేద్యాలను సమర్పించి లక్ష్మీదేవి దేవి ఆరాధన చేయడం వల్ల నింట అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయని భావిస్తారు.
ఇంటినిండా ప్రమిదల కాంతులు నింపి, కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలను జరుపుకోవడం ఎంతో మంగళకరమని పండితులు వివరిస్తున్నారు. సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే ఆధ్యాత్మిక పూజా విధానాలతో పాటు, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా, కాలుష్యరహితంగా సురక్షితమైన పద్ధతుల్లో దీపావళి సంబరాలు నిర్వహించుకోవడం నేటి కాలంలో అత్యంత ఆవశ్యకమని నిపుణులు సూచిస్తున్నారు.


