కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 14న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో నిర్వహించే భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు. ఈ ప్రొగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతోంది. దేశవిదేశాల నుంచి ఇన్వెస్టర్స్, ఎంటర్ ప్రెన్యూర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వం తరఫున రాయితీలు ఇస్తామని పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారత్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. దీనికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం విచ్చేయనున్నారు.
అయితే, రాహుల్ గాంధీని రాకను తెలంగాణ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.గత ఎన్నికల సమయంలో మోసపూరిత ఆరు గ్యారెంటీలు ఇచ్చారని, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తున్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజల తరఫున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది. నవంబర్ 14న 'భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీ పాల్గొనడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టంచేశారు.
ఎన్నికల టైంలో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అందువల్ల ఆయన పర్యటన సందర్భంగా నల్లజెండాలు ప్రదర్శించి అడ్డుకుంటామని హెచ్చరించారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు ఇచ్చిన 'ఆరు గ్యారెంటీ'ల్లో ఒక్కదాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీజేపీ చీఫ్ ఆరోపించారు.
సీఎంగా రేవంత్ రెడ్డి మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నప్పటికీ, రాహుల్ ఇచ్చిన హామీలు రాష్ట్రంలో ఏమాత్రం అమలు కావడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ అగ్రనేతకు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోే రాహుల్ రాక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలు ప్రదర్శించి, సదస్సులో పాల్గొనకుండా అడ్డుకుంటామని స్పష్టంచేశారు.


