Oral Health: డయాబెటిస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేవి గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్స్, కంటి చూపు మందగించడం మాత్రమే. కానీ, సైలెంట్ కిల్లర్‌లా మారే ఈ వ్యాధి దంతాలను, దవడ ఎముకలను లోపల నుంచే పిండిపిండి చేస్తుందన్న చేదు నిజాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే చిగుళ్ల ఇన్ఫెక్షన్లు పెరిగి, చివరికి పళ్లు వదులై రాలిపోయే ప్రమాదం ఉంది.
డయాబెటిస్ – దంతాల మధ్య అసలు లింక్ ఏంటంటే..
షుగర్ వ్యాధి నేరుగా పంటిపై దాడి చేయదు. కానీ నోటిలోని సహజ రక్షణ వ్యవస్థను కుప్పకూల్చుతుంది. షుగర్ అదుపులో లేనప్పుడు నోటిలో లాలాజలం తగ్గి 'డ్రై మౌత్' సమస్య వస్తుంది. నోటిలోని యాసిడ్లను తటస్థం చేసే శక్తి తగ్గి బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు దంతాలపై పల్చటి జిగురు పొర పేరుకుపోతుంది. అది కాలక్రమేణా గట్టిపడి గారగా మారుతుంది. దీనివల్ల చిగుళ్లు వాచి రక్తం కారే 'జింజివైటిస్' మొదలవుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే, అది 'పెరియోడాంటైటిస్' అనే భయంకరమైన దశకు చేరుకుంటుంది. ఈ దశలో ఇన్ఫెక్షన్ పంటి వేర్లను దాటి దవడ ఎముకను తినేయడం మొదలుపెడుతుంది. ఎముక కోతకు గురవడంతో దంతాలు వదులై ఊడిపోతాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే డయాబెటిస్ బాధితుల్లో ఈ పెరియోడాంటైటిస్ ముప్పు ఏకంగా మూడు రెట్లు ఎక్కువ.
20 ఏళ్ల లోపే నమిలే పళ్లు ఊడిపోతున్నాయా?
డయాబెటిస్‌లో ఏ రకమైనా సరే.. అది దంతాలు, చిగుళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్సులిన్ లోపంతో వచ్చే టైప్-1 డయాబెటిస్ బాధితుల్లో, యుక్తవయసులోనే అంటే 20 ఏళ్లు నిండకముందే నమిలే దంతాలు (మోలార్స్) వదులై ఊగిపోయే ప్రమాదం ఉంది. ఎవరిలోనైనా నాలుగు నమిలే పళ్లు ఉన్నట్టుండి కదులుతున్నాయంటే వారిని టైప్-1 బాధితులుగా అనుమానించి పరీక్షలు చేయించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఇక మెజారిటీ ప్రజల్లో కనిపించే టైప్-2 డయాబెటిస్ బాధితుల్లోనైతే చిగుళ్ల వ్యాధులు, దంత క్షయం విపరీతంగా పెరుగుతాయి. మరోవైపు గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే 'జెస్టేషనల్ డయాబెటిస్' సైతం చిగుళ్ల వాపు, రక్తం కారే సమస్యలకు దారితీస్తుంది. ప్రసవం తర్వాత షుగర్ అదుపులోకి వచ్చినా, ఆ సమయంలో దంతాలపై పడిన దుష్ప్రభావం మాత్రం ప్రమాదకరంగానే మిగిలిపోతుంది.
అన్నింటికంటే ముఖ్యంగా మధుమేహానికి, నోటి ఆరోగ్యానికి మధ్య ఒక విచిత్రమైన పరస్పర బంధం దాగుంది. నోటిలో ఏమాత్రం ఇన్ఫెక్షన్ పెరిగినా అది నేరుగా రక్తంలోని చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. అదే సమయంలో రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే నోటిలోని బ్యాక్టీరియా మరింత బలపడి ఇన్ఫెక్షన్ను తీవ్రతరం చేస్తుంది. దీనివల్ల సహజ రోగనిరోధక శక్తి తగ్గిపోయి చిన్న గాయం కూడా త్వరగా మానదు. ఫలితంగా తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతూ పన్ను తీయించాలన్నా లేదా ఏదైనా సర్జరీ చేయాలన్నా షుగర్ పూర్తిగా అదుపులో లేకపోతే వైద్యులు కూడా చికిత్స చేయలేక చేతులెత్తేసే పరిస్థితి తలెత్తుతోంది.
బాధితులు గుర్తించాల్సిన 6 ప్రమాద సంకేతాలు ఇవే..
మధుమేహం బారిన పడిన వారిలో రక్తంలో పెరిగే చక్కెర స్థాయులు నోటి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఆహారంలోని చక్కెరలు నోటిలోని బ్యాక్టీరియాతో కలిసి పంటిపై ఉండే రక్షణ కవచమైన ఎనామిల్‌ను తినేయడంతో తీవ్రమైన పిప్పిపళ్ల సమస్య మొదలవుతుంది. దీనికితోడు నోటిలో రోగనిరోధక శక్తి తగ్గడంతో చిగుళ్లు ఎర్రబడి, బ్రష్ చేసిన ప్రతిసారీ రక్తం కారే 'జింజివైటిస్' బారిన పడతారు. ఈ దశలోనే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమించి 'పెరియోడాంటైటిస్' రూపంలో దవడ ఎముకనే కరిగించేస్తుంది. పంటి వేర్లు వదులై చీము కారడం, దంతాలు ఊడిపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి. మరోవైపు రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం వల్ల నాలుకపై తెల్లటి, ఎర్రటి మచ్చలతో కూడిన 'థ్రష్' అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకి విపరీతమైన నొప్పి పెడుతుంది. దీనికి లాలాజల ఉత్పత్తి పడిపోయి నోరు ఎండిపోయే 'డ్రై మౌత్' సమస్య కూడా తోడవుతుంది. నోరు పొడిబారడంతో సహజ శుభ్రత లోపించి, బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయి తీవ్రమైన నోటి దుర్వాసనకు దారితీస్తుంది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నివారణకు ఏం చేయాలంటే..
షుగర్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవాలి. రోజూ రెండుసార్లు (ఉదయం, రాత్రి పడుకునే ముందు) సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్, ఫ్లోరైడ్ పేస్ట్‌తో సున్నితంగా రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలి. రాత్రి బ్రష్ చేశాక ఏమీ తినకూడదు. పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి ప్రతిరోజూ ఫ్లాసింగ్ చేయాలి. ప్రతి 3 నెలలకోసారి బ్రష్ మార్చాలి. తీపి పదార్థాలు, భోజనం చేసిన వెంటనే నోటిని శుభ్రంగా పుక్కిలించాలి. గోరువెచ్చని నీటిలో కల్లుప్పు వేసి నోటిని శుభ్రం చేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను చాలావరకు అడ్డుకోవచ్చు. స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. తీసిపెట్టుకునే పళ్ల సెట్స్ వాడకాన్ని తగ్గించాలి. సాధారణ వ్యక్తులు ఏడాదికి ఒకసారి, డయాబెటిస్ ఉన్నవారు ప్రతి 6 నెలలకోసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి. డెంటిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు మీకు షుగర్ ఉన్న విషయాన్ని ముందే చెప్పడం మర్చిపోవద్దు. దంతాల సమస్యలను కేవలం పంటి నొప్పికే పరిమితం అనుకోకుండా, అది శరీరంలోని షుగర్ హెచ్చుతగ్గులకు సంకేతం కావచ్చని గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వాలి.


