వ్యాపారం

Gold Buying Tips: తులానికి 9 గ్రాములేనా? కస్టమర్లు తెలుసుకోవాల్సిన అసలు లెక్క ఇదే!

6 నిమిషాల పఠనం

బంగారం కొనడమంటే మన దగ్గర కేవలం ఆభరణం తీసుకోవడం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్, ఆపత్కాలంలో ఆదుకునే బలమైన ఆస్తి. అందుకే పెళ్లిళ్లు వచ్చినా, పండుగలు వచ్చినా నగల దుకాణాలకు జనం క్యూ కడతారు. పాత నగలు ఇచ్చి కొత్తవి చేయించుకోవడమో లేక కొత్తగా తులం బంగారంతో గొలుసో, గాజులో చేయించడమో చేస్తుంటారు.

Gold Buying Tips: బంగారం కొనడమంటే మన దగ్గర కేవలం ఆభరణం తీసుకోవడం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్, ఆపత్కాలంలో ఆదుకునే బలమైన ఆస్తి. అందుకే పెళ్లిళ్లు వచ్చినా, పండుగలు వచ్చినా నగల దుకాణాలకు జనం క్యూ కడతారు. పాత నగలు ఇచ్చి కొత్తవి చేయించుకోవడమో లేక కొత్తగా తులం బంగారంతో గొలుసో, గాజులో చేయించడమో చేస్తుంటారు. కానీ ఇక్కడే చాలామందికి తెలియని ఒక మతలబు దాగుంది. మీరు పూర్తి తులం (10 గ్రాములు) బంగారం ఇచ్చినా లేదా చేయించినా.. చేతికి వచ్చేసరికి అది 9 గ్రాములే ఉండొచ్చు. మరి మిగిలిన ఆ ఒక్క గ్రాము బంగారం ఎక్కడికి పోతుంది? ఆ మాయ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులంలో గ్రాము ఎటు పోతుంది?

ముడి బంగారాన్ని నేరుగా మెడలో వేసుకునే నగలా మార్చడం సాధ్యం కాదు. దానికి కొలిమిలో కరిగించడం, సుత్తితో కొట్టి రేకులుగా, తీగలుగా మార్చడం, కట్ చేయడం, డిజైన్ ప్రకారం అతికించడం, చివరగా మెరుపు కోసం పాలిష్ పట్టడం.. ఇలా ఎన్నో దశలు ఉంటాయి. ఈ ప్రాసెస్‌లో సహజంగానే కొంత బంగారం రాలిపోవడమో, అరిగిపోవడమో జరుగుతుంది. దీనినే వ్యాపారంలో 'వేస్టేజ్' లేదా 'తరుగు' అంటారు. సాధారణంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంతో నగ తయారు చేసేటప్పుడు దాదాపు ఒక గ్రాము వరకు వేస్టేజ్ రూపంలో పోతుందని నగల వ్యాపారులు చెబుతుంటారు. అంటే మీరు తులం బంగారం ఇస్తే, చేతికి వచ్చే ఆభరణం నికర బరువు 9 గ్రాములే ఉంటుంది. డిజైన్ ఎంత క్లిష్టంగా, సున్నితంగా ఉంటే ఈ తరుగు శాతం అంతగా పెరిగే అవకాశం ఉంటుంది.

24 క్యారెట్లతో నగలు ఎందుకు రావు?

చాలామంది 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో నగలు చేయించుకోవాలని చూస్తుంటారు. కానీ 24 క్యారెట్ల పసిడి వెన్నలా చాలా మృదువుగా ఉంటుంది. దాంతో నగలు చేస్తే కాస్త ఒత్తిడి తగిలినా వంగిపోతాయి, తెగిపోతాయి. అందుకే ఆభరణం గట్టిగా, బలంగా ఉండటానికి అందులో రాగి, వెండి, జింక్ లాంటి ఇతర లోహాలను కలుపుతారు. అలా రూపొందేదే 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం. ఈ మిశ్రమం కలిపే క్రమంలో, కరిగించే సమయంలో కూడా స్వచ్ఛత, బరువు లెక్కల్లో తేడాలు వస్తుంటాయి.

పాత బంగారం ఇచ్చేటప్పుడు జాగ్రత్త

ఇంట్లో ఉన్న పాత నగలను ఇచ్చి కొత్త డిజైన్లు చేయించుకునేటప్పుడు కస్టమర్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. పాత నగల మొత్తం బరువుకు సమానంగా కొత్త నగలు ఎప్పటికీ రావు. పాత నగల స్వచ్ఛత ఎంత ఉందనేది మెల్టింగ్ టెస్ట్ చేశాకే తెలుస్తుంది. అందులో ఉండే రాళ్లు, ఎనామిల్, లక్క బరువును ముందే తీసేస్తారు. కరిగించిన తర్వాత చేతికొచ్చే అసలైన ప్యూర్ బంగారం ఎంతో, ఆ బరువుపైనే కొత్త నగ లెక్కలు ఆధారపడి ఉంటాయి.

కొనేముందు ఈ లెక్కలు చూసుకోండి..

నగ ఏదైనా దానిపై స్పష్టమైన 'BIS హాల్‌మార్క్' ఉందో లేదో చూసుకోవాలి. తీసుకునే నగ 22 క్యారెట్లా లేక 18 క్యారెట్లా అన్నది బిల్లులో రాయించుకోవాలి. అలాగే నగల మొత్తం బరువు ఎంత? అందులో తరుగు ఎంత శాతం వేశారు? మేకింగ్ ఛార్జెస్ ఎంత తీసుకుంటున్నారు? అన్నది బిల్లు వేసేముందే స్పష్టంగా మాట్లాడుకోవాలి. వీటితో పాటు పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కరిగించిన తర్వాత ఎంత బరువు వచ్చిందో రసీదుపై తప్పకుండా రికార్డు చేయించాలి. బంగారం కొనేటప్పుడు ఈ చిన్నపాటి లెక్కలు గమనించుకోకపోతే.. తరుగు, తయారీ పేరుతో మన కష్టార్జితంలో గ్రాములకు గ్రాములు కరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే కొనేముందే అసలు బరువు, తరుగు లెక్కలపై స్పష్టత తెచ్చుకోవడం కస్టమర్ల బాధ్యత.

#Gold Buying Tips#Gold Jewellery#Gold Wastage#Gold Tarugu#Gold Making Charges#Gold Purity#22 Carat Gold#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి