సికింద్రాబాద్లోని బాణాసంచా దుకాణంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. దీంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాపు ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకివెళితే.. సికింద్రాబాద్ చిలకలగూడలోని డీబీఆర్ షోరూం పక్కనే ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే దుకాణం మొత్తం అగ్నికీలలు వ్యాపించాయి. మంటల ధాటికి భారీ శబ్దాలతో బాణసంచా మొత్తం పేలిపోయింది. పేలుళ్ల శబ్దాలతో పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో బాణసంచా దుకాణంలోని క్రాకర్స్ పూర్తిగా కాలిపోయాయి.జనావాసాలు, రద్దీ ప్రాంతాల్లో క్రాకర్ షాపుల ఏర్పాటుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉండగా, క్రాకర్ షాపులో మంటలు చెలరేగడానికి గల అసలు కారణం గుర్తుతెలియని వ్యక్తి అంటించిన ఓ రాకెట్ అని తెలిసింది. డీబీఆర్ షోరూమ్ పక్కనే ఉన్న క్రాకర్స్ షాపులోకి ఒక రాకెట్ నేరుగా దూసుకెళ్లింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగగా షాపులోని క్రాకర్స్ పూర్తిగా కాలిపోయాయి.కళ్లెదుటే తన క్రాకర్స్ షాప్ కాలిపోవడంతో యజమాని కన్నీరుమున్నీరయ్యాడు. ఇదిలాఉండగా, జనావాసాల మధ్య క్రాకర్స్ దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకుండా చూడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తాజాగా ప్రమాదం వలన ప్రస్తుతం ఎవరికీ ఏం జరగకపోయినా ఏదైనా పెను ప్రమాదం సంభవించి ఉంటే పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పక్కనే కమర్షియలు షాపులు ఉన్నాయని వాటికి మంటలు వ్యాపిస్తే పరిస్థితి ఏంటని, పండుగ పూట షాపింగ్ చేయడానికి జనాలు వస్తుంటారని, వారికి ఏమైనా అయితే పరిస్థితి దారుణంగా ఉండేదని పలువురు చెబుతున్నారు. ఇకమీదట ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, షాపులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.


