తెలంగాణ

Telangana:ఆ మాటలు సీఎం చేతకానితనానికి పరాకాష్ఠ.. బీజేపీ ఎంపీ డీకే అరుణ!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

తెలంగాణలో వివాదాస్పద మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం, ప్రభుత్వ భూముల అమ్మకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి..

తెలంగాణలో వివాదాస్పద మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం, ప్రభుత్వ భూముల అమ్మకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.. ఈ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు..

ముఖ్యమంత్రి భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామనడం చేతకానితనానికి పరాకాష్ఠ అని విమర్శించారు.. భూములు అమ్మడం కాదు.. ముందు ఢిల్లీకి మూటలు పంపడం ఆపేస్తే.. రాష్ట్ర అభివృద్ధికి నిధులు అవే సరిపోతాయింటూ చురకలు అంటించారు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తోందని తెలిపిన అరుణ.. ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే 'ఓటు చోరీ' అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.

ఒకవేళ కాంగ్రెస్ ఊహించినట్టు ఓటు చోరీ జరిగి ఉంటే, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేదని స్పష్టం చేశారు.. ఈ క్రమంలో డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లను తొలగించవద్దా అని సూటిగా ప్రశ్నించిన డీకే అరుణ.. అధికారం కోసం రాహుల్ గాంధీ దేశంలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తున్నారని, ఈ విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు..

మరోవైపు ముఖ్యమంత్రికి కేవలం కొడంగల్ మాత్రమే కనిపిస్తుందా? అని ప్రశ్నించిన ఎంపీ.. ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు స్థానికుడు కాకపోయినా గెలిపించారని.. కానీ అక్కడ రోడ్ల విస్తరణ పేరుతో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందించకపోవడం దారుణమని మండిపడ్డారు.. వెంటనే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గానికి పెద్దపీట వేసిందని.. రెండేళ్లలో అమృత్ పథకం కింద 2.22 కోట్లు, ఎంపీ నిధుల నుంచి 1.45 కోట్లు, పీఎం శ్రీ కింద 79.50 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద 69.75 లక్షలు, అలాగే వీబీ జీ రామ్ జీ కింద 30 లక్షల నిధులతో విరివిగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించిన డీకే అరుణ.. సీఎం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు..

కేసీఆర్ గతంలో ప్రాజెక్ట్ నీటి అప్రోచ్‌ను నార్లాపూర్‌కు మార్చి పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని.. ఇప్పుడు మళ్లీ మొదటి డిపిఆర్ ప్రకారం జూరాల అప్రోచ్‌తోనే పనులు చేపట్టి, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే జిల్లాకు అన్యాయం చేసిన వ్యక్తిగానే చరిత్రలో మిగిలిపోతారని హెచ్చరించారు.

ప్రాజెక్టు పనుల కోసం కేంద్రం వద్దకు కలిసి వెళ్దామని, నిధులు సాధించుకుందామని అరుణ పిలుపునిచ్చారు. మరోవైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, అరాచకవాదాన్ని అంతం చేసేందుకు హైదరాబాద్‌లో నవంబర్ 2న బీజేపీ 'మహా పాదయాత్ర' చేపట్టబోతోంది. నిజాం కాలేజ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మోహింజహి మార్కెట్ వరకు సాగే ఈ యాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

#Telangana Politics#BJPvsCongress#Revanth Reddy#Palamuru RangareddyProject#KodangalDevelopment#AmitShah#HyderabadPadayatra#TelanganaBJP#CentralGovernmentFunds#TelanganaNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి