NIMS: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యల గురించి, తమకు జరుగుతున్న అన్యాయం గురించి, నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి గురించి స్వేచ్ఛ న్యూస్ కు తెలియజేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా, తమకు న్యాయం జరిగేలా దారి చూపిస్తారని ఆశిస్తూ వినతిపత్రం అందజేశారు.
నిమ్స్ కాంట్రాక్ట్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దొరికే విధంగా చూడాలని కోరారు. నిమ్స్ లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, అన్యాయాలను, అక్రమ నియామకాలను, అవినీతిపరుల గురించి వివరించే ప్రయత్నం చేశారు.
''గత పదేళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నాము. మాకు తీరని అన్యాయం జరుగుతోంది. 1996లో పర్మినెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక సంవత్సరం పాటు తక్కువ వేతనంతో, మరికొందరు జీతాలు లేకుండా మూడు నుంచి ఆరు నెలలు పాటు పనిచేసిన వారికి నేరుగా జాబ్ ఇస్తామన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న వారిలో కొంతమందిలో ఉద్యోగానికి, వారి అర్హతకు సంబంధం లేకుండా పోయింది.
ఉదాహరణకు బయో మెడికల్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తిని MRI టెక్నీషియన్ గా అపాయింట్ చేశారు. అప్రెంటిస్ చేసిన వ్యక్తిని డయాలసిస్ టెక్నీషియన్ గా అపాయింట్ చేశారు. మరికొన్ని విభాగాల్లో టెన్త్, ఇంటర్ అర్హత ఉన్న వారిని కూడా తీసుకున్నారు. వారిని ఇప్పటివరకు కొనసాగిస్తున్నారు. అందులో కొంతమంది రిటైర్మెంట్ కూడా అయిపోయారు.
అర్హత లేకున్నా ప్రమోషన్లు
మెడికల్ విభాగంలో ఎంత అనుభవం ఉన్నా సైన్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిని మాత్రమే తీసుకోవాలి. మెడికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే మెడికల్ రిలేటెడ్ స్పెషల్ కోర్సులు ఏదైనా చేసి ఉండాలి. ప్రస్తుతం వారికి అది లేదు. గతంలో ఉన్న డైరెక్టర్ బీరప్ప కూడా అర్హత ఉన్న వారికి మాత్రమే, డిగ్రీలు ఉన్న వారికి మాత్రమే ప్రమోషన్స్ ఇస్తామన్నారు. క్వాలిఫికేషన్ లేకపోతే ప్రమోషన్ ఇవ్వలేనని చెప్పారు. కానీ, ప్రస్తుతం ప్రమోషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇలా 30 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే నిమ్స్ హాస్పిటల్లో కొనసాగిస్తున్నారు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తే బెదిరింపులు
పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయడం లేదని ఎవరూ అడగడం లేదు. కొందరు వ్యక్తులు.. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర మెప్పు కోసం ఉద్యోగాల భర్తీ గురించి పోరాడుతున్న వ్యక్తులను భయపెట్టడం, బెదిరింపులకు గురి చేయడం, తప్పుడుగా ప్రచారం చేయడం ఇలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాకు జరుగుతున్న అన్యాయాల గురించి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.
పెద్ద వాళ్ల అండ ఉంటేనే ఉద్యోగాలు, ప్రమోషన్లు
ఒకప్పుడు నిమ్స్ హాస్పిటల్ లో 650 బెడ్స్ ఉండేవి. ఇప్పుడు 1650 బెడ్స్ కు పెంచారు. బెడ్ల సంఖ్య పెరుగుతున్నా పర్మినెంట్ అయ్యేది కేవలం డాక్టర్స్ మాత్రమే. హాస్పిటల్ లో పెద్ద వాళ్ల అండ ఉంటేనే ప్రమోషన్లు వస్తున్నాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. ఉదాహరణకు ఒకే కుటుంబంలో ఏడుగురు పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఇలా నిమ్స్ లో మాత్రమే జరిగింది. నిమ్స్ లో పనిచేస్తున్న పర్మినెంట్ ఎంప్లాయ్స్.. తమ కుటుంబసభ్యుడినో, లేదా దగ్గర బంధువునో తీసుకొచ్చి కాంట్రాక్టు ఉద్యోగిగానో, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్ గానో పెడుతున్నారు. ఇటువంటి వారిపై నిమ్స్ యాజమాన్యం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
క్రెడిట్ కేవలం డాక్టర్లకేనా? కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించరా?
నిమ్స్ హాస్పిటల్ ఎన్నో ఘనతలు సాధించింది. పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. అత్యుత్తమ చికిత్స, ఆపరేషన్లు, ఆర్గాన్ ట్రాన్స్ ఫర్.. ఇంకా మరెన్నో విజయాలను సాధించింది. కానీ క్రెడిట్ అంతా డాక్టర్స్ కు మాత్రమే దక్కుతోంది. అందులో టెక్నీషీయన్స్, నర్సింగ్ ఆఫీసర్, మరెన్నో క్యాటగిరీలు వారు లేరా? వారి కష్టాన్ని, ఉనికిని పూర్తిస్థాయిలో గుర్తించడం లేదు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్ లో పర్మినెంట్ ఎంప్లాయ్స్ 20 నుండి 30శాతం మాత్రమే ఉన్నారు. నెలకు యావరేజ్ గా నలుగురు రిటైర్ అయిపోతున్నారు. మరి నిమ్స్ లో పర్మినెంట్ ఉద్యోగాల సంగతి ఏమిటి?
వాళ్లకి జీతం నెలకు లక్ష.. మాకు 32వేలే
పేరుకు మాత్రం గొప్పగా చెప్పుకుంటారు. ఒక రోజులో 5088 మంది పేషెంట్లు వచ్చారు, 306 మంది పేషెంట్లను అడ్మిట్ చేశామని మీడియాలో వస్తే మేము ఎంతో ఆనందపడ్డాం. కానీ ఇంతమంది పేషెంట్స్ కి ట్రీట్ మెంట్ చేసేది ఎవరు? కేవలం డాక్టర్లేనా? టెక్నీషియన్స్, సిస్టర్స్, కాంట్రాక్టు ఉద్యోగులు.. రాత్రి పగలు డ్యూటీలు చేసి వారికి సేవలు అందించడం లేదా? మరి వారికి గుర్తింపు ఎందుకు రావడం లేదు? ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. నిమ్స్ లో సుమారు 1000 మందికిపైగా కాంట్రాక్ట్, నర్సింగ్ ఆఫీసర్.. 300 మందికి పైగా కాంట్రాక్ట్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అయితే, పర్మినెంట్ ఎంప్లాయ్ కి సుమారు జీతం నెలకు 1,40,000 నుండి 1,99,500 గా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం కేవలం రూ.32 వేలే.
నైట్ డ్యూటీలు చేసేది కాంట్రాక్ట్ ఉద్యోగులే
రాత్రి డ్యూటీలలో పర్మినెంట్ ఎంప్లాయస్ చాలా డిపార్ట్ మెంట్లలో పని చేయడం లేదు. కాంట్రాక్ట్ టెక్నీషియన్స్ మాత్రమే చేస్తున్నారు. స్టాఫ్ నర్స్ కేటగిరీలో పర్మనెంట్ స్టాప్ వాళ్లు కూడా పనిచేస్తున్నారు. పగలంతా 20 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 5-10 మంది పర్మినెంట్ ఎంప్లాయ్స్, 30 నుంచి 40 మంది స్టూడెంట్లు కలిసి నడిపించే డిపార్ట్ మెంట్లలో.. రాత్రిపూట కేవలం 4-8 మంది మాత్రమే ఉంటారు. పగలు ఎంత పని అవుతుందో దానికి 50-60% వరకు రాత్రి డ్యూటీలలో అవుతుంది. పని చేస్తున్న వారు కాంట్రాక్ట్ ఉద్యోగులే.
పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి అడ్డుపడుతున్నారు
నిమ్స్ లో ఉన్న కొందరు వారి స్వలాభం కోసం, వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రమోషన్స్ కోసం, మరెన్నో స్వార్ధపూరిత ఆలోచనలను దాచుకొని పర్మినెంట్ నోటిఫికేషన్ రానివ్వకుండా చేస్తున్నారని ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. నిమ్స్ లో ఇంత అన్యాయం జరుగుతున్నా, అవినీతి ఆరోపణలు వస్తున్నా యూనియన్స్, అసోసియేషన్స్ ఏవీ కూడా విచారణ కోరడం లేదు.
గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం పోతుంది
ఇప్పుడు జరుగుతున్న ACB దాడులను చూస్తుంటే హాస్పిటల్ వ్యవస్థలో ఇన్ని అక్రమాలకు, వందల కోట్ల అవినీతికి పాల్పడొచ్చా? అనే అనుమానం సామాన్య వ్యక్తిని ఆశ్చర్యపరుతోంది. ఇలాగే జరుగుతూ పోతుంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద, గవర్నమెంట్ వ్యవస్థ మీద, అందులో ఎంతగానో కష్టపడుతున్న వారి మీద ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు.
HOD ల అండతోనే భారీగా అవినీతి
ACB దాడులు కేవలం ఒకరిద్దరి మీదనే జరగడం కాదు, పూర్తి వ్యవస్థ మీద జరగాలి. నిమ్స్ లో ఉన్న హెచ్ వోడీలందరిపై ACB తనిఖీలు చేయాలి. HOD ల హస్తం లేకుండానే ఒక వ్యక్తి ఇంతలా భారీ స్థాయిలో అవినీతికి పాల్పడతాడా? ఇక్కడ అందరం ఆలోచించాల్సిన విషయం ఇది. హాస్పిటల్ లో ఎక్విప్ మెంట్లు, మిషన్లు, మానిటర్లు, స్కానింగ్ మిషన్లు HODల ప్రమేయం లేకుండా ఇవ్వరు. HOD లు అంగీకరిస్తేనే ఏ మిషన్ అయినా ఇస్తారు. కొన్ని డిపార్ట్ మెంట్ HODలు అవినీతి సొమ్ము వెనక్కి వేసుకుంటున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. ఇలానే జరుగుతూ పోతే కాంట్రాక్ట్ వ్యవస్థ కింద పని చేస్తున్న మాలాంటి నిరుద్యోగులు ఎంతగానో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా అడ్డదారిలో సంపాదించాలని మాత్రమే కాంట్రాక్ట్ వ్యవస్థలను నడిపిస్తున్నారు తప్ప మరొకటి కాదు.
నిమ్స్ హాస్పిటల్ లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవ్వడం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎస్సీ ఎస్టీ కమిషన్ భక్తి వెంకటయ్య ఆధ్వర్యంలో రెండుసార్లు నిమ్స్ ని సందర్శించారు. వాటి మీద ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత లేదు. నిమ్స్ హాస్పిటల్ లో ST (కోయ, లంబాడా, సుగాలి) క్యాటగిరిలో ఉన్న వారిలో కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే పర్మినెంట్ ఉద్యోగులు ఉండడం తీవ్ర చర్చలకు దారితీస్తుంది.
హెచ్వోడీలంతా ఆంధ్రా వాళ్లే.. డబ్బులిచ్చే వాళ్లకే పర్మినెంట్ ఉద్యోగాలు
HOD లు తమకు నచ్చిన వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించుకోవడం, అడ్మినిస్ట్రేషన్ కు సూట్ కేసులు అందించే వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా తీసుకోవడం, ప్రమోషన్లు ఇవ్వడం, అందులోనూ అందరూ ఆంధ్ర HODలు అవడం, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఆంధ్ర వారు ఉండడం ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం. దీని గురించి అడిగితే.. డాక్టర్స్ కేటగిరి (NMC) అనేది నేషనల్ లెవెల్ కాబట్టి ఎవరు ఏ స్టేట్ నుండి అయినా వారు కూడా అర్హులు అని కొందరు చెబుతున్నారు. మరి అలా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి సుమారు 12 సంవత్సరాల అవుతున్నా నిమ్స్ లో మాత్రం తెలంగాణ పాలన లేదు. ఇప్పటికీ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఆంధ్ర వారిని తీసుకోవడం వెనుక అసలు విషయం ఏంటి? ఇదంతా ఆంధ్ర HOD ల అండతో జరుగుతున్నది కాదా?
పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న తెలంగాణ సొమ్ము
ప్రస్తుతం నర్సింగ్, టెక్నికల్, టెక్నీషియన్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగాలు నిర్వర్తిస్తున్న వారిలో సుమారు 100 మందికిపైగా ఆంధ్ర, నాన్ లోకల్ వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి జీతం నెలకు 32000×100 Members=32,00,000 (32లక్షల రూపాయలు). 3200,000 ×12 Months = 3,84,00,000 (3 కోట్ల 84 లక్షల రూపాయలు). ఈ సొమ్ము అంతా తెలంగాణ ట్రెజరీ నుండి నాన్ లోకల్ కాంట్రాక్టు ఉద్యోగులకు ఇస్తున్నటువంటి జీతాలు. ఇలా తెలంగాణ సొమ్మంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు రావలసిన ఉద్యోగాలు కూడా రానటువంటి పరిస్థితి.
నిమ్స్ లో అనేక అన్యాయాలు, అక్రమాలు
అనస్తేషియా డిపార్ట్ మెంట్ లో పేటనిల్ నార్కోటిక్ డ్రగ్ చూసుకోవడానికి నియమించిన వారిలో కొందరిని నేరుగా టెక్నీషియన్ కాంట్రాక్టులుగా కొనసాగే విధంగా HOD చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విషయాన్ని డైరెక్టర్ బీరప్ప దృష్టికి తీసుకెళ్లాం. అయినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలా నిమ్స్ లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతిపరుల గురించి ప్రతిరోజు వివరించినా సంవత్సరం కూడా సరిపోదు. అందుకే పూర్తిస్థాయిలో విచారణలు చేపట్టాలి. అవినీతిరహిత నిమ్స్ గా మార్చాలి.
ఒకప్పుడు మేము నిమ్స్ ఉద్యోగులం అని చెప్తే ఓహో గొప్ప ఆసుపత్రి అనే పేరు ఉందని మమ్మల్ని గౌరవించే వాళ్ళు. కానీ ప్రస్తుతం అవినీతి నిమ్స్ గా ముద్ర పడిపోతోంది. అందుకే నిమ్స్ లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే విధంగా, బ్యాక్ లాగ్ పోస్టులను తీసే విధంగా, SC/ST రిక్రూట్ మెంట్లను అమలు చేసే విధంగా, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాము.
గతంలో స్వేచ్ఛ న్యూస్ మా కోసం ఎన్నో రకాల వార్తలు రాసింది. అన్యాయాలను ప్రశ్నించింది. దాంతో కొంతవరకు మార్పు జరిగింది. పూర్తి స్థాయిలో నిమ్స్ ఆసుపత్రికి తెలంగాణ నిమ్స్ ఆసుపత్రిగా గుర్తింపు తెచ్చే విధంగా మార్పు తీసుకొస్తారని, మీ వంతు కృషి మాకు తోడుగా ఉండాలని మిమ్మల్ని సదా నమ్ముతూ ఈ వినతి పత్రాన్ని అందజేస్తున్నాము.
ఇట్లు
తెలంగాణ నిమ్స్
టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులు
NIMS, Hyderabad, NIMS Contract Employs, Corruption, Swechaa News,


