ఏపీ

AP: రాప్తాడులో ఉన్మాదం.. రంపంతో విద్యార్థినిపై దాడి.. ప్రభుత్వం సీరియస్‌!

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

AP: బడి గదిలో పిల్లలంతా శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. ఇంతలోనే చేతిలో రంపం పట్టుకుని ఓ వ్యక్తి లోపలికి దూసుకొచ్చాడు. కళ్లముందేం జరుగుతోందో టీచర్, తోటి పిల్లలు తెలుసుకునేలోపే.. టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థినిపై విచక్షణ లేకుండా రంపంతో దాడికి దిగాడు.

AP: బడి గదిలో పిల్లలంతా శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. ఇంతలోనే చేతిలో రంపం పట్టుకుని ఓ వ్యక్తి లోపలికి దూసుకొచ్చాడు. కళ్లముందేం జరుగుతోందో టీచర్, తోటి పిల్లలు తెలుసుకునేలోపే.. టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థినిపై విచక్షణ లేకుండా రంపంతో దాడికి దిగాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేపింది.

క్లాస్‌రూమ్‌లోనే ఏం జరిగిందంటే..

రాప్తాడు హైస్కూల్‌లో ఎప్పటిలాగే క్లాసులు నడుస్తున్నాయి. పదో తరగతి గదిలో టీచర్ లెక్కల పాఠం చెబుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ యువకుడు మెషీన్ రంపంతో నేరుగా క్లాస్‌రూమ్‌లోకి చొరబడ్డాడు. బెంచీపై కూర్చున్న ఆ బాలిక వద్దకు వెళ్లి తల, ముఖం, వీపుపై రంపంతో కోసేశాడు. అడ్డుకోబోయిన మరో అమ్మాయికి కూడా గాయాలయ్యాయి. "నేను బోర్డు వైపు తిరిగి పాఠం చెబుతున్నాను.. అప్పుడే ఓ వ్యక్తి లోపలికి వచ్చి దాడి చేశాడు. కళ్లముందు అంత రక్తం చూసి బిత్తరపోయాను, అసలేం జరుగుతుందో తోచలేదు" అంటూ ఆ క్లాస్ టీచర్ భయంతో వణికిపోతూ చెప్పారు. తోటి విద్యార్థులు, టీచర్లు పెద్దగా కేకలు వేయడంతో ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు.

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలిక.. నిందితుడు అరెస్ట్

రక్తపు మడుగులో పడిపోయిన విద్యార్థినిని హుటాహుటిన అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు దాడికి వాడిన రంపం మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ధర్మవరం వైపు పారిపోతున్న నిందితుడిని పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడు ధర్మవరం మండలానికి చెందినవాడని, ఆ బాలికకు బంధువేనని స్థానికులు చెబుతున్నారు.

తీవ్రంగా స్పందించిన సీఎం, పవన్, లోకేష్

పాఠశాలలో జరిగిన ఈ అమానుష ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... బడి లోపలికి వచ్చి ఆడపిల్లలపై ఇలాంటి ఘాతుకాలకు పాల్పడే మృగాళ్లకు సమాజంలో తిరిగే హక్కే లేదని స్పష్టం చేశారు. ఆడపిల్లల వైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా కఠిన శిక్ష వేయిస్తామన్నారు. బాధితురాలి తల్లితో స్వయంగా ఫోన్‌లో మాట్లాడిన బాబు.. "పాపను బతికించుకోవడానికి ఎంత ఖర్చయినా చేద్దాం, ప్రభుత్వం మీకు పూర్తి అండగా ఉంటుంది" అని ధైర్యం చెప్పారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రశాంతంగా చదువుకునే బడి గదిలోకి వచ్చి ఇంతటి దారుణానికి ఒడిగట్టడం దారుణమన్నారు. అనంతపురం కలెక్టర్‌తో మాట్లాడిన పవన్, నిందితుడిని అస్సలు వదిలిపెట్టవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. "క్లాస్ రూమ్‌లోనే నెత్తుటి మడుగులో పడివున్న పిల్లను చూసి కన్నీళ్లు ఆగడం లేదు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హోంమంత్రి అనిత సైతం ఈ ఘటనపై సీరియస్ అయ్యి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ దారుణానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌లదే పూర్తి బాధ్యత వహించాలి అని జగన్ డిమాండ్ చేశారు.

#Andhra Pradesh#Raptadu#Anantapur#School Student Attack#Student Attacked#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి