Telangana Politics: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల నగారా మోగిన ప్రతిసారీ పాత హత్యల తాలూకు వివాదాలు తెరపైకి రావడం చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఎర్రజెండాకు కంచుకోటగా నిలిచిన ఈ ప్రాంతంలో, కీలక ఎన్నికలు వచ్చినప్పుడల్లా సీపీఎం నాయకత్వాన్ని టార్గెట్ చేయడం, మర్డర్ కేసుల దర్యాప్తు పేరుతో వారిపై ఒత్తిడి పెంచి లొంగదీసుకోవడం అధికార పార్టీలకు ఒక అలవాటుగా మారిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు మునుగోడు ఉపఎన్నిక సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాన్నే, ఇప్పుడు అధికార కాంగ్రెస్ కూడా అమలు చేస్తోందా అన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ప్రస్తుత తరుణంలో, ఏడాది క్రితం నాటి హత్య కేసును పోలీసులు తెరపైకి తీసుకురావడం వెనుక ఉన్న అసలు రాజకీయ సూత్రధారులు ఎవరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఏడాది తర్వాత హఠాత్తుగా ప్రెస్ మీట్..
చింతకాని మండలం పాతలపాడు గ్రామానికి చెందిన సీపీఎం నేత సామినేని రామారావు గత సంవత్సరం అక్టోబర్ 31న దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే కాంగ్రెస్ నాయకులే తన భర్తను హతమార్చారని రామారావు భార్య పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఈ హత్య వెనుక ఉన్న అసలు దోషులను పట్టుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఎం అగ్రనేతలు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే, దాదాపు ఏడాది కాలంగా ఎలాంటి పురోగతి లేకుండా మరుగున పడి ఉన్న ఈ కేసులో, సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఖమ్మం పోలీస్ కమిషనర్ హఠాత్తుగా ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించడం తీవ్ర కలకలం రేపింది.
గతంలో సంచలనం సృష్టించిన తెల్దార్పల్లి తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు నిందితులే రామారావును కూడా అంతమొందించారని పోలీసులు తేల్చారు. ఇందులో ఆర్థిక, స్థానిక రాజకీయ విభేదాలు ఉన్నాయంటూ పోలీసులు పరోక్షంగా సీపీఎం పార్టీ వైపే అనుమానాల వేలు చూపించడం వివాదానికి ఆజ్యం పోసింది. స్థానిక కాంగ్రెస్ నేతలను కాపాడేందుకు, తమ పార్టీ నాయకత్వం మెడకే ఉచ్చు బిగించేందుకు పోలీసులు అధికార పక్షం ఆదేశాలతో కథలు అల్లుతున్నారని వామపక్ష నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల మద్దతు కోసమేనా
ఈ మొత్తం పరిణామాల వెనుక ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కలే దాగి ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకోవడం అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ నియోజకవర్గ పరిధిలో, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రౌండ్ లెవల్లో బలమైన కేడర్, ఓటు బ్యాంకు కలిగిన సీపీఎం ఇచ్చే మద్దతు ఫలితాన్ని శాసించే స్థాయిలో ఉంటుంది. గతంలో మునుగోడు ఉపఎన్నికల సమయంలో తెల్దార్పల్లి హత్య కేసులో కీలక వామపక్ష నేత పేరు చేరకుండా నియంత్రించి, సీపీఎం మద్దతును బీఆర్ఎస్ తమవైపు తిప్పుకుందనే ప్రచారం నడిచింది.
ఇప్పుడు కాంగ్రెస్ కూడా సరిగ్గా అదే తరహా ఒత్తిడి రాజకీయాన్ని ప్రయోగిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రామారావు హత్య కేసులో అసలు సూత్రధారులు ఎవరనే విషయాన్ని తేల్చకుండా, కేసును అడ్డం పెట్టుకుని సీపీఎంను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న సందేహాలు బలపడుతున్నాయి. హైదరాబాద్ స్థాయి నుంచి అందిన ఆదేశాల మేరకే ఖమ్మం పోలీసులు ఈ సమయంలో హడావిడి చేస్తున్నారని వామపక్ష శ్రేణులు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. ఎన్నికల వేళ పోలీసుల దూకుడు, కామ్రేడ్ల ఎదురుదాడితో ఖమ్మం జిల్లా రాజకీయం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది.


