ఎల్నినో (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో ఎలాంటి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ తాగునీటి సౌకర్యాల కల్పనకు భారీగా ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 'సింగూరు' ప్రాజెక్టు ఆధారిత ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాలు తీర్చడానికి రూ.120 కోట్లను కేటాయించినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తక్షణ నీటి ఎద్దడి నివారణ నిమిత్తం ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు ఆమోదించినట్లు ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా తాజా పరిస్థితి, చేపడుతున్న అత్యవసర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై శనివారం ఉదయం మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి కొరత తీవ్రంగా ఉండే గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను గరిష్టంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.
అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రైవేట్ బోరుబావులను అద్దెకు తీసుకోవడంతో పాటు నీటి కొరత ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా క్రమం తప్పకుండా నీటిని సరఫరా చేసేందుకు రవాణా ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేతిపంపులు, సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ నీటి సరఫరా పథకాలు, బావులు ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఎక్కడైనా అంతరాయం ఏర్పడినా, లేదా భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటిన ప్రాంతాలు ఉన్నా వాటిని ముందుగానే గురించాలని అధికారులను హెచ్చరించారు.
దీంతోపాటు ప్రజల్లో నీటి పొదుపుపై, ఎల్నినో ప్రభావంపై విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇటీవల హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో కురిసిన వర్షపు నీరు వృథా కాకుండా పూర్తిగా భూగర్భంలోకి ఇంకేలా తక్షణ చర్యలు చేపట్టాలని సీతక్క సూచించారు. ప్రధాన తాగునీటి వనరులు, నివాస ప్రాంతాల వద్ద ఉన్న ఇంకుడు గుంతలు, మ్యాజిక్ పిట్లలోకి వర్షపు నీరు చేరేలా చూడాలని, నిర్మాణంలో ఉన్న ఇంకుడు గుంతల పనులను రాబోయే రెండు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు
.


