హైదరాబాద్ నగరంలో హైడ్రా (HYDRAA) తన కూల్చివేతల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా శనివారం నగరంలోని రామాంతాపూర్ ప్రాంతంలో హైడ్రా అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. స్థానిక చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం (FTL) పరిధిలో అక్రమంగా నిర్మించారనే ఆరోపణలతో ఓ ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూల్చివేతకు గురైన ఇంటి యజమాని మీడియా ముందు తన ఆవేదనను వెల్లబోసుకున్నాడు. కోర్టు ఇచ్చిన 'స్టేటస్ కో' (Status Quo) ఆదేశాలను సైతం అధికారులు లెక్కచేయకుండా ఈ కూల్చివేతలకు పాల్పడ్డారని బాధితుడు వాపోయాడు.
తమ తల్లి 1974లోనే ఆ ప్రాంతంలో ప్లాట్ కొనుగోలు చేశారని, 1980లో తాము అక్కడ ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నామని తెలిపారు. గత 50 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రాపర్టీ ట్యాక్స్, మున్సిపల్ బిల్లులు అన్నీ చెల్లిస్తూ వస్తున్నామని చెప్పారు. ఎలాంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా ఒక్కసారిగా వచ్చి ఇల్లు కూల్చివేశారని కన్నీటిపర్యేమయ్యాడు. ఇటీవల హైడ్రా అధికారులు తమ ఇంటి వద్ద కొలతలు తీసుకోవడంతో అనుమానం వచ్చి తాము కోర్టును ఆశ్రయించామని బాధితుడు తెలిపారు.
ముందుగా చెరువు ఎఫ్టీఎల్ హద్దులను అధికారికంగా నిర్ధారించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. అయితే కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ అధికారులు తమ ఇంటిని కూల్చివేశారని బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, హైడ్రా కూల్చివేతలపై నగర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్టీఎల్ (FTL) పరిధిలోని అక్రమ నిర్మాణాల తొలగింపు పేరుతో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాధితులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
కనీసం నోటీసులు జారీ చేయడానికి కూడా సమయం ఇవ్వకుండా, యాభై ఏళ్ల చరిత్ర ఉన్న ఇంటిని కూల్చివేయడం పట్ల మానవతా వాదులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలు జోక్యం చేసుకుని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అధికారులు చూపుతున్న అలసత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, న్యాయస్థానాలు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.


