TG: గ్రేటర్ హైదరాబాద్‌ను మునుపెన్నడూ లేని విధంగా నీటి సంక్షోభం వెంటాడుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో నగరవాసులు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని దాదాపు 25 కీలక ప్రాంతాల్లో బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో ప్రజలు జలమండలి వాటర్ ట్యాంకర్ల మీదే ఆధారపడాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నగరంలో రోజుకు 10 వేల నుంచి 12 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని వాటర్ బోర్డు అధికారులు చెబుతుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు..
హైదరాబాద్‌లోని ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితి చూస్తే జనం ఏ స్థాయిలో నీటి కోసం అల్లాడుతున్నారో అర్థమవుతోంది. హైదర్ నగర్, కూకట్పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్, మైత్రివనం, ఎర్రగడ్డతో పాటు పాతబస్తీ, రాజేంద్రనగర్, షేక్‌పేట్, మణికొండ ప్రాంతాల్లో ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఫిల్లింగ్ స్టేషన్లలో ట్యాంకర్లు బారులు తీరి కనిపిస్తుండగా, డిమాండ్‌కు తగ్గట్టుగా ట్యాంకర్ల స్లాట్లు కూడా కేటాయించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. గడిచిన పది పదిహేను రోజుల్లోనే బుకింగ్స్ భారీగా పెరిగాయని, ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రెండు నెలల్లో (జనవరి నాటికి) పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ట్యాంకర్ల డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటిని వృథా చేస్తే భారీగా ఫైన్లు..
నగరంలో పెరుగుతున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని జలమండలి అధికారులు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టారు. తాగునీటిని వృథాగా రోడ్లపైకి వదిలేసినా, మిస్ యూజ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ పరిధిలోని పలు నివాసాలతో పాటు ప్యారడైజ్ హోటల్ వంటి ప్రముఖ వాణిజ్య సంస్థలకు రూ. 5 వేల నుంచి రూ. 25 వేల వరకు భారీ జరిమానాలు విధించారు. మరోవైపు పర్మిషన్స్ లేకుండా వేస్తున్న అక్రమ బోరింగులపై ఉక్కుపాదం మోపుతున్నారు. శంషాబాద్, రాజేంద్రనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో అక్రమ బోర్లను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశారు.
భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్న తరుణంలో నగర ప్రజలు నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని, సంక్షోభం మరింత ముదరకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని వాటర్ బోర్డు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


