తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా నదీ జలాల వివాదంపై కేఆర్ఎంబీ ట్రిబ్యునల్‌లో ఇంకా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో చేసుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని పక్కనబెట్టి నదీ పరివాహాక ప్రాంతం తమ వద్ద ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని, పెరిగిన ఆయకట్టు, తాగు నీటి అవసరాల నిమిత్తం కేటాయింపులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అందుకు మోకాలడ్డుతోంది. తమ వద్ద ప్రాజెక్టులు, నీటి వినియోగం పెరిగినందున ప్రస్తుతం ఉన్న నీటి కేటాయింపులనే కొనసాగించాలని కృష్టా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎదుట ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు తమ వాదనలు వినిపిస్తున్నారు.
దూకుడు పెంచిన ఏపీ..
కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణతో పోలిస్తే ఏపీ సర్కార్ దూకుడు పెంచింది. ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోతున్నట్టు తెలిసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో నీటిని తరలించినట్టు సమాచారం. శ్రీ శైలం రిజర్వాయర్ నుంచి కేవలం 79 రోజుల్లోనే 72 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం ఎత్తిపోసినట్టు లెక్కలు చెబుతున్నాయి. రోజుకు సగటున దాదాపు ఒక టీఎంసీ నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించినట్టు తెలిసింది. అయితే, ఇప్పటివరకు తెలంగాణ వినియోగించుకున్నది కేవలం 12 టీఎంసీలే కావడం గమనార్హం.
అడుగంటిన నిల్వలు..
ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడిన విషయం తెలిసిందే. తెలంగాణలో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయితే, దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి సామర్థ్యం గతంతో పోలిస్తే తక్కువగా నమోదు అయ్యింది. ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో ఇన్ ఫ్లో తక్కువగా ఉండింది. దీంతో ఈ ఏడాది గేట్లు కూడా సరిగా లిఫ్ట్ చేయలేదు. అయితే, ఉన్న నీటిలో అధికశాతం ఏపీనే ఎక్కువగా తరలించుకుపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ఓవైపు ఎల్ నినో ప్రభావం... వర్షాలు లేకపోవడం, ఉన్నవాటిని ఏపీ లిఫ్గ్ చేయడంతో తెలంగాణకు తీవ్ర నీటి కొరత ఏర్పడింది.శ్రీ శైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అడుగంటుకుపోయాయి. ప్రస్తుతం ఉమ్మడి రిజర్వాయర్లలో మిగిలింది కేవలం 27 టీఎంసీల నీరే అని తెలిసింది.
రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర..
ఏపీ సర్కారు ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్రను వీడటం లేదు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో రాష్ట్రంలో అన్నదాతలకు సాగు, ప్రజలకు తాగు నీటి అవసరాల కోసం నీటిని తరలించలేదు. ఏపీ తరలించుకుపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నది. కనీసం అభ్యంతరం కూడా తెలపలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర తాగు, సాగు నీటి ప్రయోజనాలు అంటే రేవంత్ సర్కారుకు లెక్కలేదా? అని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ విషయంపై అభ్యంతరం తెలుపుతూ కృష్ణా ట్రిబ్యునల్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కాగా, తన రాజకీయ గురువు చంద్రబాబు కోసమే రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అవుతున్నారని, అందుకే ఎన్ని టీఎంసీల నీటిని తరలించుకుపోతున్నా అభ్యంతరం తెలపడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది.
తేలని నీటి పంచాయితీ..
కృష్ణా నీటిలో వాటాలపై ఏపీ, తెలంగాణ మధ్య ఇంకా పంచాయితీ తేలలేదు. 66:34 నిష్పత్తిలోనే నీటి వాటాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కాగా, తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ వాదిస్తోంది.నీటి వాటాలపై నిర్ణయం తీసుకోవడంలో కృష్ణా బోర్డు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, 79 రోజులుగా సమావేశాల పేరుతో కేఆర్ఎంబీ కాలయాపన చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ నీటి మళ్లింపును అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


