కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు ప్రయివేటీకరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు (PSU), ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశానికి ఆస్తులని పేర్కొన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటీకరణ, తక్కువ విలువకు సంస్థ వాటాలను కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఐడీబీఐ బ్యాంక్ విలువను తగ్గించి చూపిస్తున్నట్టు వస్తున్న నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బిడ్డింగ్ ఆఫర్లు రిజర్వ్ ధర కంటే తక్కువగా వచ్చినప్పుడు, నిబంధనలు, వ్యాల్యుయేషన్ పద్ధతులను ఎందుకు మార్చాల్సి వచ్చిందని, దీనికి సమాధానం చెప్పాలని కేంద్రాన్ని నిలదీశారు.
ఇక ఐడీబీఐ బ్యాంక్‌కు అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రైమ్ ల్యాండ్స్‌తో సహా కీలక నగరాల్లో ఉన్న బ్యాంక్ ఆస్తుల విలువను సరిగ్గా లెక్కించారా? లేదా? కావాలని తగ్గించి చూపిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులు లేవనెత్తుతున్న న్యాయమైన సందేహాలను, ఆందోళనలను కేంద్రం ఎందుకు పరిష్కరించడం లేదని అడిగారు.
కేంద్రంలో నిలకడగా రాణిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐని ప్రయివేటు సంస్థకు కట్టబెట్టే ముందు దేశ ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయం విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారుకు ఎందుకు అంత తొందర అని నిలదీశారు.


