చిన్న పరికరం.. భారీ విధ్వంసం!
నౌకను ముంచకుండానే కదలకుండా చేసే మైన్
హార్ముజ్‌లో ఎందుకింత ఆందోళన?
27 మంది భారతీయుల భద్రతపై కలవరం
హార్ముజ్ జలసంధిలో మరో ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంది. 27 మంది భారతీయ సిబ్బంది ఉన్న పనామా జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై లింపెట్ మైన్లతో దాడి జరిగినట్లు సమాచారం. రెండు పేలుడు పరికరాలు నౌకకు అమర్చడంతో ఇంజిన్ గదిలో పేలుళ్లు జరిగి మంటలు చెలరేగాయి. నౌక కదలికలు నిలిచిపోయాయి. దీంతో భారతీయ సిబ్బంది జాడపై టెన్షన్ మొదలైంది.
ఈ ఘటనతో లింపెట్ మైన్లు అంటే ఏమిటి? అనే చర్చ మొదలైంది. చిన్న పరిమాణంలో ఉండే ఈ పేలుడు పరికరాలు భారీ నౌకలను ఎలా దెబ్బతీస్తాయి? ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఈ దాడి ఎలాంటి పరిణామాలకు దారితీయవచ్చు? అనే ఆందోళన కొనసాగుతోంది.
చిన్న పరికరం.. భారీ విధ్వంసం!
యుద్ధం అంటే భారీ క్షిపణులు, యుద్ధ విమానాలు, బాంబులు మాత్రమే కాదు. ఒక్కోసారి కంటికి కనిపించని చిన్నపాటి పేలుడు పరికరం కూడా శత్రువుకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. లింపెట్ మైన్లు అలాంటి ప్రమాదకరమైన ఆయుధాలే. లింపెట్ అనే పేరు సముద్రంలో కనిపించే చిన్న నత్తల నుంచి వచ్చింది. ఈ నత్తలు రాళ్లకు గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి. వాటి ఆకారం కూడా ఈ పేలుడు పరికరాలను పోలి ఉంటుంది. అందుకే వీటికి లింపెట్ మైన్స్ అనే పేరు వచ్చింది.
సాధారణ సముద్ర గర్భ మైన్ల మాదిరిగా ఇవి సముద్రపు అడుగున పాతిపెట్టే పరికరాలు కావు. నౌక అడుగు భాగానికి లేదా దాని బయటి భాగానికి అతుక్కునేలా రూపొందిస్తారు. నీటిలో పనిచేసే ప్రత్యేక సిబ్బంది వీటిని నౌకకు అమరుస్తారు. వీటికి ఉండే అయస్కాంత వ్యవస్థలు నౌక లోహపు భాగాలకు అతుక్కునేందుకు సహాయపడతాయి. వీటి అసలు ప్రమాదం పరిమాణంలో కాదు. దాడి జరిగిన ప్రదేశంలోనే ఉంది.
నౌకను ముంచాల్సిన అవసరం లేదు.. కదలకుండా చేస్తే చాలు!
లింపెట్ మైన్ల ప్రధాన ఉద్దేశం ప్రతిసారీ భారీ నౌకను సముద్రంలో ముంచేయడం కాదు. నౌకను పనిచేయకుండా చేయడం. సైనిక పరిభాషలో దీనిని 'మిషన్ కిల్' అంటారు. ఒక భారీ ఆయిల్ ట్యాంకర్‌ను ఊహించుకోండి. వేల టన్నుల చమురుతో సముద్రంలో ప్రయాణిస్తోంది. దాని ఇంజిన్ వ్యవస్థ దెబ్బతింటే ఏమవుతుంది? నౌక కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. దిశను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటే నౌక ప్రయాణం ప్రమాదకరంగా మారుతుంది. ప్రొపల్షన్ వ్యవస్థ దెబ్బతింటే ముందుకు కదలడం సాధ్యం కాదు. అంటే నౌక సముద్రంలోనే ఉన్నప్పటికీ దాని ప్రయాణ సామర్థ్యం పూర్తిగా దెబ్బతినవచ్చు.
ఈ తరహా పేలుడు పరికరాల్లో టైమ్ డిలే లేదా ఇతర ఫ్యూజ్ వ్యవస్థలు ఉంటాయి. కొన్ని నమూనాల్లో తొలగించే ప్రయత్నాన్ని గుర్తించే ప్రత్యేక రక్షణ వ్యవస్థలు కూడా ఉంటాయి. అందుకే పేలని మైన్ కనిపించినా దానిని సాధారణ వస్తువులా తొలగించడం సాధ్యం కాదు. ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులే వీటిని నిర్వీర్యం చేయాలి.
నీటి అడుగున పేలుడు ఎందుకు మరింత ప్రమాదకరం?
లింపెట్ మైన్ల ప్రమాదాన్ని పెంచే మరో అంశం నీరు. భూమిపై పేలుడు జరిగినప్పుడు ఒక రకమైన ప్రభావం ఉంటుంది. అదే నీటి అడుగున పేలుడు జరిగితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నీరు పేలుడు ప్రభావాన్ని చుట్టుపక్కల నిర్మాణాలకు బదిలీ చేస్తుంది. దాంతో నౌక కింది భాగంలో పెద్ద రంధ్రాలు ఏర్పడటం, నిర్మాణాలు దెబ్బతినడం, మెషీన్లు పనిచేయకుండా పోవడం వంటివి జరుగుతాయి.
పేలుడు ప్రభావం వల్ల నౌకలోని కీలక వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా, సమీపంలో ఉన్న సిబ్బందికి కూడా తీవ్రమైన గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే పరిమాణం చిన్నదని ఈ ఆయుధాలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
రెండో ప్రపంచ యుద్ధం నుంచే వాడుకలో..
లింపెట్ మైన్లు కొత్తగా వచ్చిన ఆయుధాలు కావు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే వీటి వినియోగం కనిపించింది. శత్రు నౌకలను నేరుగా భారీ యుద్ధంతో ఎదుర్కోకుండా, సీక్రెట్ గా దెబ్బతీయడానికి వీటిని ఉపయోగించారు. తర్వాతి కూడా వివిధ దేశాల నౌకాదళాలు ఇలాంటి ఆయుధాలను యుద్ధ రంగంలో మారాయి. 1970ల మొదట్లో అమెరికా నౌకాదళం కూడా లింపెట్ మైన్లను ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. అంటే దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆయుధాలు ఇప్పటికీ సముద్ర భద్రతకు సవాల్ గా నిలుస్తున్నాయి.
హార్ముజ్‌లో ఎందుకింత ఆందోళన?
ఇప్పుడు అసలు సమస్య హార్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఇది ఒకటి. పర్షియన్ గల్ఫ్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు చమురు రవాణా చేసే నౌకలు ఈ మార్గంపై ఆధారపడతాయి. అందుకే ఇక్కడ జరిగే చిన్నపాటి దాడి కూడా ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తుంది.
ఇక తాజా ఘటనలో 27 మంది భారతీయ సిబ్బంది ఉన్న పనామా జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై రెండు లింపెట్ మైన్లు అమర్చినట్లు వార్తలొచ్చాయి. పేలుళ్ల కారణంగా ఇంజిన్ గదిలో మంటలు చెలరేగి నౌక కదలికలు నిలిచిపోయినట్లు సమాచారం. ఇది కేవలం ఒక నౌకకు జరిగిన నష్టం మాత్రమే కాదు. హార్ముజ్ మీదుగా ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
భారతదేశానికి ఎలాంటి ముప్పు?
ఈ ఘటనలో 27 మంది భారతీయ సిబ్బంది ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సముద్ర రవాణా రంగంలో భారతీయ నావికులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. అంతర్జాతీయ చమురు రవాణా మార్గాల్లో ఉద్రిక్తతలు పెరిగితే వారి భద్రత కూడా కీలక సమస్యగా మారుతుంది. అంతేకాదు, హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడితే చమురు సరఫరాపై ప్రభావం పడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై కూడా భారం పడే అవకాశం ఉంటుంది.
రవాణా ఖర్చులు పెరగడం, బీమా ప్రీమియంలు అధికమవడం, నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి రావడం వంటి పరిణామాలు కూడా ఎదురుకావచ్చు.
సముద్ర యుద్ధంలో కొత్త ఆందోళన!
అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు, మైన్ల ముప్పు అంతర్జాతీయ ఆందోళనగా మారాయి. యూరోపియన్ దేశాలు కూడా సముద్ర మార్గాల్లో మైన్లను తొలగించే అంశంపై చర్చిస్తున్నాయి. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఒక్కటే. భారీ యుద్ధ నౌకలు, అత్యాధునిక రాడార్లు, ఉపగ్రహ నిఘా ఉన్నప్పటికీ సాధారణ వాణిజ్య నౌకలకు ఇలాంటి రహస్య దాడుల నుంచి పూర్తి రక్షణ కల్పించడం ఎంతవరకు సాధ్యం?
ఒక చిన్న పేలుడు పరికరం ఒక భారీ చమురు ట్యాంకర్‌ను నిలిపివేయగలిగితే, అదే తరహా ఘటనలు వరుసగా జరిగితే ప్రపంచ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? హార్ముజ్ జలసంధి ఇప్పుడు కేవలం చమురు రవాణా మార్గం మాత్రమే కాదు. అంతర్జాతీయ భద్రత, ఇంధన సరఫరా, భౌగోళిక రాజకీయాల మధ్య కీలకమైన యుద్ధ వేదికగా మారుతోంది. సముద్ర గర్భంలో కనిపించని ముప్పు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కనిపించే ప్రభావం చూపిస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.


