'అర్నబ్' తుపాను సృష్టించిన భీకర బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్ వాసులు ఇంకా కోలుకోకముందే, రాష్ట్ర ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ మరో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది.
అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న నికోబార్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో సముద్రంలో అలల తీవ్రత తీవ్రంగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. అక్టోబర్ 31 శనివారం రోజున మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. నవంబర్ 1 ఆదివారం, నవంబర్ 2 సోమవారం రోజుల్లో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం నాటికి కోనసీమ జిల్లా నగరంలో అత్యధికంగా 91.5 మిమీ, పశ్చిమగోదావరి తణుకులో 81.2 మిమీ, అనకాపల్లి జిల్లా చోడవరంలో 80.2 మిమీ, కాకినాడ జిల్లా వేలంగిలో 76.9 మిమీ వర్షపాతం నమోదైంది. ఆర్నబ్ తుపాను వరదల కారణంగా ఇప్పటికే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలు దెబ్బతినడంతో, అధికారులు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీరప్రాంతం, వాగులు, పొంగిపొర్లుతున్న నదుల సమీపంలో ఉన్న ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని విజ్ఞప్తి చేశారు.


