ఏపీలోని తిరుపతి శ్రీ సిటిలో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లెస్ ట్రెయిన్స్ తయారు అవుతున్నాయి. మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముంబైలోని వడాలా-థానే-కాసర్వడవలి మెట్రో లైన్ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లను ఫ్రాన్స్ సంస్థ ఆల్‌స్టోమ్ (Alstom) విజయవంతంగా రూపొందిస్తోంది.
ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఆల్‌స్టోమ్ తయారీ కేంద్రంలో రూపొందించిన తొలి రైలు సెట్‌ను ప్రతినిధులు తాజాగా ఆవిష్కరించారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కోసం ఎల్ అండ్ టీ (L&T) ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో ఆల్‌స్టోమ్ కంపెనీ మొత్తం 39 డ్రైవర్ లెస్ రైళ్లను, సిగ్నలింగ్ వ్యవస్థను తయారు చేస్తున్నది.
కేవలం 14 నెలల్లోనే రికార్డు స్థాయిలో మొదటి 6 కోచ్‌ల రైలు తయారీ పూర్తయినట్టు తెలిసింది. అత్యుత్తమ అర్బాలిస్ సీబీటీసీ సిగ్నలింగ్ వ్యవస్థను ఈ రైళ్లలో అమర్చారు. రెండు రైళ్ల మధ్య వ్యవధిని కేవలం 90 సెకన్లకు తగ్గించి నడిపే వీలుంటుందని అధికారులు వెల్లడించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ ఆశయాలకు అనుగుణంగా ఈ డ్రైవర్ లెస్ రైళ్లను దేశీయంగా తయారు చేసినట్టు వెల్లడించారు. మొదటి రైలు సెట్‌ను పరీక్షల నిమిత్తం ముంబైకి త్వరలోనే తరలించనున్నట్టు సమాచారం. మిగిలిన 38 రైళ్లు దశలవారీగా శ్రీసిటీ తయారీ కేంద్రం నుంచి సరఫరా కానున్నాయి.
మేకిన్ ఇండియా బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కేంద్రం ఇప్పటికే వేగంగా అడుగులు వేస్తోంది. దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించి ఎగుమతులను ప్రోత్సహించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి.అందులో భాగంగానే దేశీయంగా డ్రైవర్ లెస్ రైళ్లను తయారీ చేసి భారత్ పవర్ చాటాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలిసింది.


