శ్రీలంక క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య భారత యువ క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తుకు ఒక అద్భుతమైన పెట్టుబడి అని ఆయన అభివర్ణించారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జయసూర్య ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అయితే అతడిలో ఉన్న అపారమైన ప్రతిభ, దూకుడైన బ్యాటింగ్ శైలి ఇప్పటికే ప్రత్యేకంగా నిలుస్తున్నాయని జయసూర్య పేర్కొన్నారు.
‘అతడిని తన సహజ సిద్ధమైన ఆటను స్వేచ్ఛగా ఆడనివ్వండి. అతడి పని అతడిని చేయనివ్వండి. అలా ప్రోత్సహిస్తే భారత క్రికెట్‌కు అతను ఒక మంచి పెట్టుబడిగా మారతాడు’ అని టీమ్ మేనేజ్మెంట్కు సూచించారు. యువ ఆటగాడిపై అనవసరమైన అంచనాలు, ఒత్తిడి పెంచి అతడి ఆటను భంగపరచవద్దని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా మరో భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మను కూడా జయసూర్య కొనియాడారు. అభిషేక్‌ను ఒక సంపూర్ణమైన ఆల్-రౌండ్ బ్యాటర్‌గా అభివర్ణిస్తూ, మైదానంలో నలువైపులా విరుచుకుపడుతూ షాట్లు ఆడగల అసాధారణ సామర్థ్యం అతనికి ఉందని ప్రశంసించారు.
మరోవైపు, పాకిస్థాన్‌లో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో (Tri-Series) శ్రీలంక జట్టు కనబరుస్తున్న అద్భుత ప్రదర్శనపై జయసూర్య సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్లో జరగనున్న భారత పరిమిత ఓవర్ల పర్యటనకు ముందు ఈ ప్రదర్శన లంక ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని తెలిపారు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో బ్యాటర్ల ఆధిపత్యం పెరగడం, ఎంతటి భారీ లక్ష్యాలనైనా ఛేదించడం సానుకూల పరిణామమని, అయితే ఇది బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతోందని వ్యాఖ్యానించారు.


