KCR: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారా? గులాబీ బాస్ సెకండ్ ఇన్నింగ్స్‌కు రంగం సిద్ధమైందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లో సంచనాలు సృష్టిస్తున్నాయి. కేసీఆర్ త్వరలోనే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతారని, దేశ రాజకీయాలను శాసించేలా కీలక పాత్ర పోషిస్తారంటూ కేటీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలు వ్యూహం ఏంటి
తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై అధికార కాంగ్రెస్‌పై పోరాడుతున్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి మహారాష్ట్ర, పంజాబ్, యూపీ వంటి రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు పెట్టిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత జాతీయ బాటను పూర్తిగా పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు సడన్‌గా కేటీఆర్ మళ్లీ 'జాతీయ రాజకీయాలు' అనే అంశాన్ని తెరపైకి తేవడం కేవలం క్యాడర్‌ను ఉత్సాహపరచడానికే కాదని, దీని వెనుక పక్కా రాజకీయ వ్యూహం దాగుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీతో పొత్తు ప్రచారానికి చెక్ పెట్టేందుకేనా?
ఈ ప్రకటన వెనుక ఉన్న అత్యంత కీలకమైన సంచలన కోణం.. బీజేపీతో పొత్తు ప్రచారాన్ని తుత్తునియలు చేయడమే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదే పదే "బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటే.. తెరవెనుక ఒప్పందాలు ఉన్నాయి" అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసిపోతాయనే ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి. ఈ ప్రచారానికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలంటే కేసీఆర్ నేరుగా ఢిల్లీ పెద్దలపైనే యుద్ధం ప్రకటించాలనేది గులాబీ అధిష్ఠానం ఆలోచనగా తెలుస్తోంది.
గతంలో జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రంలోని బీజేపీ విధానాలనే ప్రధాన అజెండాగా ఎంచుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే రూట్‌ను ఎంచుకోవడం ద్వారా.. తాము బీజేపీకి పూర్తి బద్ధ శత్రువులమే తప్ప, ఎలాంటి సయోధ్య లేదనే స్పష్టమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపవచ్చని బీఆర్‌ఎస్ భావిస్తోంది. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా జాతీయస్థాయిలో పోరాడటం ద్వారా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంతో పాటు, అటు మైనార్టీ, సెక్యులర్ ఓటు బ్యాంక్‌ను తిరిగి పార్టీ వైపు తిప్పుకోవచ్చనేది కేసీఆర్ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.
మొత్తానికి కేటీఆర్ ప్రకటనతో గులాబీ దండులో కొత్త ఉత్సాహం మొదలవగా.. కేసీఆర్ బయటకు వచ్చి ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు, కేంద్రంపై ఎలాంటి అస్త్రాలు సంధించబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.


