Harish Rao: రాష్ట్రాన్ని పాలించే రక్షకుడే భక్షకుడిగా మారిపోయాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఒక్క బిల్డర్‌ను సంతోషపెట్టడం కోసం 2వేల అపార్ట్మెంట్లలో ఉండే 4వేల కుటుంబాలు, 5వేల మంది ప్రజల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒక్క అపార్ట్మెంట్ కట్టుకోవడానికి ప్రజలకు చెందిన ఇన్ని అపార్ట్మెంట్లు కూల్చాలా? అని ప్రశ్నించారు. నార్సింగిలో 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ మార్పును తీవ్రంగా వ్యతిరేకించారు హరీశ్ రావు. ఈ మార్పు వల్ల 4వేల కుటుంబాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు.
సీఎం రేవంత్ కేవలం తమ అనుయాయుల లబ్ధి కోసం అలైన్ మెంట్ మార్చి స్కూళ్లకు సైతం రెడ్ మార్క్ వేసిన పరిస్థితి బాధాకరం అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. హైడ్రా, 22A , 100 ఫీట్ రోడ్లు అంటూ వేల మంది సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బ్రదర్స్, బడా రియల్ ఎస్టేట్ సంస్థల కోసం ఏకంగా రోడ్డు అలైన్మెంట్లనే మార్చి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపించారు.
''నీ కుటుంబసభ్యుల స్కూల్ కోసం ఇంకో స్కూల్ కూల్చేస్తావా? ఇంకో అపార్ట్ మెంట్ కోసం ఈ అపార్ట్ మెంట్ కూలుస్తావా? ఇదెక్కడి న్యాయం? కోకాపేటలో గజం రూ.2 లక్షల విలువ ఉన్న భూమిని కేవలం రూ.47 వేలకే గుట్టుచప్పుడు కాకుండా వేలం వేశారు. రూ.110 కోట్ల విలువైన భూమిని రూ.26 కోట్లకు కట్టబెట్టారు. ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నప్పుడు ఇళ్లు కూల్చాల్సిన అవసరమే లేదు'' అని హరీశ్ రావు అన్నారు.
నార్సింగిలో భవనాలకు రెడ్ మార్కింగ్స్
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ మార్పు వల్ల నష్టపోతున్న సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మిడోస్ తదితర కాలనీలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు హరీశ్ రావు. పాదయాత్రగా కాలనీల్లో పర్యటిస్తూ, హెచ్ఎండీఏ అధికారులు వేసిన రెడ్ మార్కింగ్‌లను పరిశీలించారు. బాధిత కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. అన్ని అనుమతులు, ఓసీలు ఉన్నా తమ భవనాలను కూల్చేందుకు మార్కింగ్‌లు వేశారంటూ కాలనీ వాసులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నష్టపోతున్న అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మాటలు వింటుంటే ప్రభుత్వం ఎంత అరాచకంగా వ్యవహరిస్తోందో స్పష్టమవుతోందన్నారు హరీశ్ రావు.
ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి
''నిజానికి ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకానీ ఒక బిల్డర్ కోసమో, ఒక కాంట్రాక్టర్ కోసమో, కొందరు వ్యక్తుల స్వార్థం కోసమో పనిచేయకూడదు అని హితవు పలికారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఈ 100 ఫీట్ల రోడ్డు కోసం మాస్టర్ ప్లాన్‌లో మార్కౌట్ ఇచ్చారు. అయితే ఆనాడు ఇచ్చిన గెజిట్‌లో ఇక్కడి గుట్టను తొలగిస్తూ, గుట్ట మీద ఉన్న 400 ఏళ్ల చారిత్రక హనుమాన్ టెంపుల్‌ను కూల్చేస్తూ ఆ 100 ఫీట్ల రోడ్డు అలైన్మెంట్ ఉండేది.
తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆ హనుమాన్ ఆలయాన్ని కాపాడాలని స్థానికులు సబిత దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సబితా ఇంద్రారెడ్డి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి, ఆ 100 ఫీట్ల రోడ్డును యథావిధిగా కొనసాగిస్తూనే.. ఆలయం దగ్గర మాత్రం గుడిని కాపాడుతూ, పక్కనే ఉన్న ఓపెన్ ల్యాండ్ నుంచి మెయిన్ రోడ్డుకు కలిపేలా 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గెజిట్ (జీవో నం. 181) ఇచ్చింది'' అని హరీశ్ రావు గుర్తు చేశారు.
ఒక్క బిల్డర్ ప్రయోజనమే రేవంత్ ప్రభుత్వ ప్రయోజనం
''ఆ రోజు మేము అలైన్మెంట్ ఎందుకు మార్చామంటే.. అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రజల కోరిక మేరకు ఒక చారిత్రక దేవాలయాన్ని కాపాడుతూ, ఏ ఒక్క అపార్ట్‌మెంట్‌కు గానీ, ఏ ఒక్కరి ఇంటికి గానీ ఇంచు కూడా నష్టం కలగకుండా 2018లో కేసీఆర్ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. మరి ఈరోజు 2026లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కొత్త గెజిట్ వెనుక ఏముంది? ఇందులో ఏమైనా ప్రజాప్రయోజనం ఉందా? ఇందులో అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లేనే లేదు. కేవలం ‘ప్రైవేట్ ఇంట్రెస్ట్’ మాత్రమే ఉంది. ఒక్క బిల్డర్ ప్రయోజనమే ఈ ప్రభుత్వ ప్రయోజనంగా మారింది'' అని హరీశ్ రావు ఆరోపించారు.
ఒక్క బిల్డర్‌ను సంతోషపెట్టడం కోసం 5వేల మంది ప్రజల జీవితాలతో చెలగాటం
ఒక్క బిల్డర్‌ను సంతోషపెట్టడం కోసం ఇవాళ 2 వేల అపార్ట్మెంట్లలో ఉండే 4 వేల కుటుంబాలు, 5 వేల మంది ప్రజల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు అని హరీశ్ రావు విరుచుకుపడ్డారు. దసరా పండుగ ముందు వీళ్ల ఇండ్లకు రెడ్ మార్కులు వేసి, గత రెండు నెలలుగా ఏం జరుగుతుందో తెలియక నిద్రలేని రాత్రులు గడిపేలా చేశారని వాపోయారు.
రాధా రియల్టర్ భూదాహం
''ఈ ప్రాంతంలో ఆర్ఆర్ రియాల్టీ అనే బిల్డర్ తమను ఎలా వేధించాడో, ఆయన భూదాహానికి తాము ఎలా ఇబ్బంది పడ్డామో ఇక్కడ ఇల్లు కట్టుకున్న కాలనీ వాసులు కన్నీళ్లతో చెబుతున్నారు. ఈ రాధా రియల్టర్ ఎక్కడ ఉంటాడో కార్తీక్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. అతను సాక్షాత్తూ ‘బిగ్ బ్రదర్’ ఆఫీసులోనే కూర్చుంటాడు. అక్కడ అతనికి ఒక ప్రత్యేక ఛాంబర్ పెట్టారు. ఆ అండ చూసుకునే అతడికి ఇంత ధైర్యం వచ్చింది. లేకపోతే రాత్రికి రాత్రే జీవోలు, గెజిట్లు మారుతాయా? జనవరి 7న ఒక జీవో వస్తుంది. తెల్లారేసరికి జనవరి 8న మళ్లీ మార్పులతో ఇంకో గెజిట్ వస్తుంది. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, పెద్ద స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టే రాత్రికి రాత్రే జీవోలు మారిపోయి, ఇండ్లపై రెడ్ మార్కింగ్‌లు పడుతున్నాయి'' అని హరీశ్ రావు ఆరోపించారు.
''ఇదంతా జరుగుతున్నది ఒకవైపు ముఖ్యమంత్రి కూతురి స్కూల్ కోసం. అంటే ‘బిగ్ బ్రదర్స్’ కుటుంబానికి చెందిన కార్పొరేట్ స్కూల్ కోసం. ఇంకోవైపు బిగ్ బ్రదర్స్ భాగస్వామి, అత్యంత సన్నిహితుడైన ఆర్ఆర్ రియాల్టీ హై-రైజ్ భవనాల కోసమే. హనుమాన్ టెంపుల్‌ను తప్పిస్తూ 2018లో వేసిన పాత నోటిఫైడ్ రోడ్డులో రాధా రియల్టర్స్ వెంచర్ ఎఫెక్ట్ అవుతుందని దాన్ని మార్పించాడు.
ఒక్క అపార్ట్మెంట్ కట్టుకోవడానికి ప్రజల ఇన్ని అపార్ట్మెంట్లు కూల్చాలా?
అంతేకాకుండా, కొత్తగా వేలంలో కొనుక్కున్న భూమికి, అతని ఇతర భూములకు హై-రైజ్ పర్మిషన్ రావాలంటే ముందు 100 ఫీట్ల రోడ్డు ఉండాలి కాబట్టి, ఆ రోడ్డును రౌండ్‌గా తిప్పి ఇక్కడున్న 10 అపార్ట్మెంట్లను కూల్చడానికి సిద్ధమయ్యారు. అంటే వాళ్ల ఒక్క అపార్ట్మెంట్ కట్టుకోవడానికి ప్రజల ఇన్ని అపార్ట్మెంట్లు కూల్చాలా? వాళ్ల స్కూల్ కోసం ఎంతో ప్యాషన్‌తో, కష్టపడి కట్టుకున్న స్కూల్‌ను కూల్చేస్తారా? ఇదెక్కడి న్యాయం?'' అని హరీశ్ రావు రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు.
''ఇందులో జరిగిన భూ వేలం కుంభకోణం చూస్తే వీళ్ల దోపిడీ ఎంత బరితెగింపుగా ఉందో అర్థమవుతుంది. సాధారణంగా ప్రభుత్వం ఎప్పుడైనా భూమిని వేలం వేస్తే.. ముందు అక్కడ 100 ఫీట్ల రోడ్డు వేసి, ఆ భూమి 100 ఫీట్ల రోడ్డు మీద ఉందని పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చి వేలం వేస్తుంది. అప్పుడు ఆ భూమికి ఎక్కువ ధర పలికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ వీళ్లు ఏం చేశారు?
110కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ.26 కోట్లకే కట్టబెట్టారు
కోకాపేట, నార్సింగి ప్రాంతంలో ఇవాళ గజం ధర రూ. 2 లక్షలకు తక్కువ లేదు. కానీ ఈ ప్రభుత్వ భూమికి 60 ఫీట్ల రోడ్డే ఉంది. హై-రైజ్ పర్మిషన్ రాదు అన్నట్లుగా చూపించి, 100 ఫీట్ల రోడ్డు విషయం దాచిపెట్టి.. సైలెంట్‌గా గజం కేవలం రూ. 47 వేలకే వేలం వేసేశారు. దాదాపు రూ. 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 26 కోట్లకే తమ బిల్డర్‌కు కట్టబెట్టారు. తీరా అగ్గువకు భూమి కొన్నాక.. ఇప్పుడు ఆ భూమికి 100 ఫీట్ల రోడ్డు వేయడం కోసం మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలుస్తామంటున్నారు'' అని హరీశ్ రావు నిప్పులు చెరిగారు.
రియల్ ఎస్టేట్ బిల్డర్ల భూదాహం, ధనదాహం తీర్చడానికే
''ఒకవైపు HYDRAA అని పెట్టి పేదవాళ్ల గుడిసెలన్నీ కూల్చి వాళ్లను రోడ్డు మీదకు తెచ్చారు. ఇంకోవైపు హైదరాబాద్ చుట్టూ భూములను ‘22-A’ నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు 100 ఫీట్ల రోడ్ల పేరుతో మధ్యతరగతి ప్రజల అపార్ట్మెంట్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా అయినా, 22-A అయినా, 100 ఫీట్ల రోడ్లయినా.. ఇవేవీ ప్రజలకు పనికొచ్చే పనులు కావు. కేవలం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్ల భూదాహం, ధనదాహం తీర్చడానికి చేస్తున్న అరాచకాలే. చట్టప్రకారం కొత్త గెజిట్ ఇవ్వాలన్నా, మాస్టర్ ప్లాన్ మార్చాలన్నా.. ముందు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, స్టేక్ హోల్డర్స్‌తో మాట్లాడాలి, పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. కానీ ఇక్కడ ఏ ఒక్కటీ చేయలేదు.
కనీసం బాధితులు వెళ్లి తమ గోడు చెప్పుకుందామంటే అధికారులు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. వినతిపత్రం ఇస్తామంటే.. ఇందులో చాలా పెద్దవాళ్లు ఉన్నారు లేండి, మేము మాట్లాడలేం, మీరు ఏమీ అనుకోకండి, మేము కాగితం కూడా తీసుకోలేం అని అధికారులు అంటున్నారంటే రాష్ట్రంలో అసలు చట్టం ఉందా? బాధితుల కాగితం తీసుకోవడానికి కూడా అధికారులు భయపడుతున్నారంటే.. దీని వెనుక ముఖ్యమంత్రి కుటుంబం, ‘బిగ్ బ్రదర్స్’ ఉన్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? రాష్ట్రాన్ని పాలించే రక్షకుడే ఇవాళ భక్షకుడిగా మారిపోయాడు'' అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
''సెవెన్ హిల్స్ వారు ఎంతో ఆదర్శంగా నిలిచారు. ఇవాళ రేపు ఇంట్లో నలుగురు అన్నదమ్ములు కలిసి ఉండటమే కష్టమైన రోజుల్లో.. ఏ బిల్డర్ లేకుండా 1,553 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక తాటిపైకి వచ్చి, ఒకే కుటుంబంలా కలిసి నిర్మించుకుని 13-17 ఏళ్లుగా ఆనందంగా జీవిస్తున్నారు. అలాంటి సెవెన్ హిల్స్ అపార్ట్‌మెంట్‌కు ఒకవైపు 10 మీటర్లు, ఇంకోవైపు 7 మీటర్లు లోపలికి రెడ్ మార్కులు వేశారు. దీనివల్ల సెల్లార్లోకి వెళ్లే అండర్‌పాస్ పోతుంది, గుడి పోతుంది, వాకింగ్ ట్రాక్ పోతుంది, సెల్లార్ పార్కింగ్ పోతుంది. పిల్లర్లు దెబ్బతిని అసలు బిల్డింగ్ స్ట్రెంత్, అపార్ట్మెంట్ లైఫే పోయే ప్రమాదం ఏర్పడింది. సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మిడోస్, ఇండ్లు, పాఠశాలలు.. ఇలా దాదాపు 10 అపార్ట్మెంట్లు ఈ అక్రమ అలైన్మెంట్ వల్ల దెబ్బతింటున్నాయి'' అని హరీశ్ రావు అన్నారు.
''పక్కనే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండే పేద అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు కూడా వచ్చి తమ బాధ చెప్పుకున్నారు. గతంలో వాళ్లు కేవలం 100 మీటర్లలో మెయిన్ రోడ్డు మీదకు వచ్చేలా దారి ఉండేది. కానీ ఈ బిల్డర్ రాత్రికి రాత్రే రేకులు పెట్టి వాళ్ల దారిని మూసేశాడు, డ్రైనేజీ మార్చేశాడు, ఉన్న రోడ్డును తవ్వేశాడు. పాపం ఆ పేదవాళ్లు ఇప్పుడు కిలోమీటర్ చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. ఇదేంటని అడిగితే పోలీసులను పెట్టి భయపెడుతున్నారు. నాడు కేసీఆర్ పేదల దగ్గర ఆరు పైసలు కూడా తీసుకోకుండా ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు చేయించారు.
కానీ నేడు రేవంత్ రెడ్డి పేదలకు ఇల్లు ఇవ్వాలంటే రూ.5 లక్షలు, 6 లక్షలు కట్టాలంటున్నాడు. ఆటోలు, రిక్షాలు నడుపుకునే వాళ్లు, ఇండ్లలో పని చేసుకునే పేదవాళ్లు రూ. 6 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు? పైగా కేసీఆర్ ఇచ్చిన ఇండ్లలోకి వెళ్లే దారిని కూడా మూసేస్తారా? డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు ఎవరూ అధైర్యపడొద్దు. సబిత, మేమంతా మళ్లీ మీ కాలనీకి వస్తాం. మీ దారిని తెరిపిస్తాం. కాలనీ వాసులందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నాను. మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు'' అని హరీశ్ రావు అభయం ఇచ్చారు.
బీఆర్ఎస్ అండగా నిలబడుతుంది
''గత దీపావళి అప్పుడు పక్కనే ఉన్న హైదర్షాకోట్లో మూసీ సుందరీకరణ పేరుతో 40-50 ఏళ్ల నుంచి ఉంటున్న పేదల ఇండ్లకు ఇలాగే రెడ్ మార్కులు వేసి దీపావళి గిఫ్ట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. వాళ్లంతా తెలంగాణ భవన్‌కు వస్తే, మేమందరం హైదర్షాకోట్కు వెళ్లి బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని హెచ్చరించాం. బీఆర్ఎస్ పోరాటంతో దిగొచ్చిన రేవంత్ రెడ్డి.. అక్కడ ఇండ్లు, అపార్ట్మెంట్లు కూల్చబోమని ప్లాన్ మార్చుకున్నారు. హైదర్షాకోట్లో రెడ్ మార్కులు ఎలాగైతే పోయాయో.. నార్సింగిలో కూడా ఈ రెడ్ మార్కులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దాకా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మీ వెన్నంటి ఉంటుంది'' అని స్థానికులకు హామీ ఇచ్చారు హరీశ్ రావు.


