తెలంగాణ

అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్..మంచిరేవుల భూములను కాపాడినట్లు అబద్దాలాడారు- హరీశ్ రావు

రచన: NK•••5 నిమిషాల పఠనం

అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధానికి డ్రెస్ వేస్తే రేవంత్ లెక్క ఉంటుదన్నారు.

Harish Rao: అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధానికి డ్రెస్ వేస్తే రేవంత్ లెక్క ఉంటుదన్నారు. అసత్యాల్లో రేవంత్ రెడ్డికి ఆస్కార్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. మంచిరేవుల భూములపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ భూములను బీఆర్ఎస్ కాపాడితే.. రేవంత్ రెడ్డి మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆ భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే మంచిరేవుల భూములు ప్రభుత్వానికి దక్కాయని తెలిపారు. కానీ, మంచిరేవుల భూములను కాపాడినట్లు రేవంత్ అబద్దాలాడారని హరీశ్ రావు ఆరోపించారు.

ప్రభుత్వ భూముల కోసం కోర్టుల్లో న్యాయపోరాటం చేసింది బీఆర్ఎస్

న్యాయపోరాటం చేసి మేము భూమిని కాపాడితే దాన్ని రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయస్థానాల్లో పోరాటం చేసిందని వెల్లడించారు. కాంగ్రెస్ వల్ల కేసు ఓడిపోతే.. కేసీఆర్ చర్యల వల్ల సుప్రీంకోర్టులో కేసు గెలిచామని పేర్కొన్నారు. న్యాయపోరాటం కోసం దేశంలోనే ఉత్తమ న్యాయవాదులను నియమించామన్నారు. వేణుగోపాల్, వైద్యనాథన్, గిరి వంటి ఉత్తమ లాయర్లను నియమించి న్యాయపోరాటం చేశామని తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాడి కేసులు గెలిచి భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. 10ఎకరాల గ్రేహౌండ్స్ భూమిని ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

భూములను పోగొట్టింది కాంగ్రెస్, కాపాడింది బీఆర్ఎస్

''మంచిరేవుల భూముల్లో 2వేల కోట్ల రూపాయల స్కామ్ కి కుట్ర జరిగింది. మియాపూర్ భూముల విషయంలోనూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మియాపూర్ భూములను కూడా న్యాయపోరాటంతో బీఆర్ఎస్ కాపాడింది. భూములను అమ్ముకోవాలనే ఆత్రుత రేవంత్ మాటల్లో కనిపించింది. మంచిరేవుల భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది.ప్రభుత్వ భూముల పరిరక్షణలో బీఆర్ఎస్ కే చిత్తశుద్ధి ఉంది. భూములను పోగొట్టింది కాంగ్రెస్, కాపాడింది బీఆర్ఎస్.

దేశంలోనే ఉత్తమ న్యాయవాదులతో న్యాయపోరాటం

2021లో ఆ భూమి ప్రభుత్వానిది అని కోర్టు నుంచి ఉత్తర్వులు సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సుప్రీంకోర్టులో ముగ్గురిని పెట్టాం. ఆరోజు భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఉన్న అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్, వైద్యనాథన్, గిరిని లాయర్లుగా పెట్టాము. సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ ను పెట్టి బలమైన వాదనలు వినిపిస్తే 1-8-2023లో ఈ భూమి ప్రభుత్వానికి చెందింది అని సుప్రీంకోర్టులో కూడా ఆర్డర్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10వేల కోట్ల రూపాయల విలువైన ఆ 142 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్. కానీ, బీఆర్ఎస్ అమ్మే ప్రయత్నం చేసిందని.. కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేసిందని రేవంత్ పచ్చి అబద్దాలు చెప్పారు'' అని హరీశ్ రావు మండిపడ్డారు.

#Harish Rao#Manchirevula Lands#Miyapur Lands#Cm Revanth Reddy#Telangana#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి