అభిప్రాయం

Hyderabad: గాలిలో విషవాయువులు.. ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వాలు.. ఇంకెంత కాలం ఈ నరకం?..

రచన: Venu•••14 నిమిషాల పఠనం

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని అధికారంలో ఉన్న పాలకులు చెబుతున్నారు. పెట్టుబడులు, అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలంటూ 70mm స్క్రీన్ పైన చూపిస్తూ గొప్పలు చెబుతున్నారు..

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని అధికారంలో ఉన్న పాలకులు చెబుతున్నారు. పెట్టుబడులు, అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలంటూ 70mm స్క్రీన్ పైన సినిమాలు చూపిస్తూ గొప్పలు చెబుతున్నారు.. కానీ అభివృద్ది చెందుతుంది రాజకీయ నాయకులే తప్ప సామాన్య ప్రజలు కాదు.. వారి బ్రతుకులు కాదని ఎన్నో ఘటనలు ఇప్పటికీ నిరూపిస్తున్నాయి..

ఈ అభివృద్ధి వెలుగుల వెనుక సామాన్యుల బతుకులు చెత్తకుప్పల్లోనే మగ్గుతున్నాయనడానికి నిదర్శనం జవహర్‌నగర్ డంప్‌యార్డ్.. 2002లో ప్రారంభమైన ఈ సమస్య దాదాపు 24 ఏళ్లుగా కొనసాగుతుండటం ఆందోళనకరం.. రోజు రోజుకు పెరిగిపోతున్న దుర్వాసన, కాలుష్యం, భూగర్భజలాల కలుషితం వంటి సమస్యలతో చుట్టుపక్కల ప్రజలు ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు నేతలను కదిలించక పోవడం దురదృష్టకరం..

ప్రభుత్వాలు మారాయి.. పాలకులు మారారు.. హామీలు మారాయి.. కానీ స్థానికుల కష్టాలకు మాత్రం ఇప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. మరోవైపు ప్రపంచ స్థాయి నగరమని ప్రచారం చేసుకునే హైదరాబాద్‌లో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేకపోతే, సురక్షితమైన నీరు తాగలేకపోతే ఆ అభివృద్ధికి అర్థమేంటనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.. ఇక జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సమస్య చిన్నది అయితే ఇంత పెద్ద చర్చ ఉండేది కాదు..

ఆర్థిక రాజధానులలో ఒకటిగా వెలుగొందుతున్న భాగ్యనగరంలో నెమ్మదిగా ప్రాణాలు తీస్తున్న ఈ అంశం ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకుంటే ఇక్కడి ప్రజలపై జాలితో పాటు పాలకులపై ఆగ్రహం కలుగాక మానదు.. అలాగే జాతీయ స్థాయిలో పెను ప్రమాదంగా మారుతోందన్న విషయం కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే జవహర్‌నగర్ డంప్‌యార్డ్ ప్రపంచంలోనే అత్యధికంగా మీథేన్ గ్యాస్ రిలీజ్ చేస్తున్న డంప్‌యార్డ్‌ల జాబితాలో నాలుగో స్థానంలో నిలవడమే ఇందుకు కారణంగా విశ్లేషణలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఈ జాబితాలో అర్జెంటీనా, జకార్తా, కౌలాలంపూర్ తర్వాతి స్థానం హైదరాబాద్‌దే కావడం గమనార్హం. అదీగాక జవహర్‌నగర్ డంప్‌యార్డ్ పక్కనే ఉన్న చెత్తకొండను స్పేస్ నుంచి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుందని, దానితో పాటు నిరంతరం తేలుతున్న మీథేన్ క్లౌడ్ కూడా కనిపిస్తుందని చెబుతున్నారు.. అది ఎంతలా అంటే.. ఇక్కడ కేవలం గంట వ్యవధిలోనే 5.9 టన్నుల మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతోందట..

భారతదేశం నుంచి ఇదే అత్యధికం అని.. ఇక్కడ నుండి సుమారుగా గంటకి 5 టన్నుల మీథేన్ విడుదలవుతోందంటే, అది ఏడాదికి ఏకంగా 10 లక్షల ఎస్‌యూవీ కార్లు పుట్టించే వేడితో సమానం అని అంటున్నారు.. ఈ విషయాన్ని యూసీఎల్‌ఏ రీసెర్చ్ శాటిలైట్ డేటా స్పష్టం చేస్తోందని పేర్కొంటున్నారు.. ఇక సుమారు 340 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న జవహర్‌నగర్ డంప్‌యార్డ్ కు దాదాపు 25 ఏళ్లుగా నగరంలోని చెత్తంతా వచ్చి చేరుతోంది.

ప్రస్తుతం నగరంలో రోజు ఉత్పత్తయ్యే 8,100 టన్నుల చెత్త ఇక్కడికి వస్తుందంటే దాదాపు ప్రతి 10 సెకన్లకు ఒక టన్ను చెత్త ఇక్కడ డంప్ అవుతున్నట్టని విశ్లేషణలు తెలియచేస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారాయి.. పాలకులు మారారు.. అయిన ఇక్కడి సమస్య తీరకపోగా.. ఆ కొండ మాత్రం అంతకంతకూ పెరిగిపోతూనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది.

మరోవైపు 2020లో రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నప్పుడు, డంపింగ్ యార్డ్‌ను జవహర్‌నగర్ నుంచి తరలించే బాధ్యత తనదేనని ప్రకటించారు. అదేవిధంగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైతం జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ అంశాన్ని ప్రస్తావించారు. జవహర్‌నగర్‌లో నవంబర్ 16న జరిగిన రోడ్‌షోలో, కేసీఆర్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్‌ను తరలిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు..

అంటే పదవుల కోసం స్వార్ధంతో రాజకీయనేతలు పేదల ఆశలతో పబ్బం గడుపుకుంటున్నారని ఇక్కడ తెలుస్తుంది.. మరోవైపు కొండ పడిపోయినప్పుడు నల్లటి నీళ్లు ప్రవహిస్తాయని స్థానికులు వాపోతున్నారు. అలాగే ఇక్కడ వెలువడే కాలుష్యం స్థానికుల ప్రాణాల మీదకు తెస్తోందని, ఇప్పటికే కార్మిక నగర్‌లో సుమారు 150 మందిపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో షాకింగ్ విషయాలు బయటపడినట్టు చెబుతున్నారు..

పరీక్షలు నిర్వహించిన వారిలో 51 మంది ఏదో ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్టు తేలిందట. వీరిలో 35 మందికి చర్మ వ్యాధులు సోకగా, నిరంతరం దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న 26 మందిని పరీక్షించగా 16 మందికి లంగ్స్ శాశ్వతంగా దెబ్బతిన్నట్లు నిర్ధారణ అయిందని ఆ నివేదికలు వెల్లడించినట్టు కథనాలు వస్తున్నాయి.. అదీగాక స్థానికంగా నివసిస్తున్న పిల్లలు మళ్లీ మళ్లీ అనారోగ్య బారిన పడుతున్నారని, కాబట్టి అందరి హెల్త్ టెస్ట్‌లు చేయించాలని ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే డంప్‌యార్డ్ పక్కన ఆడుకునే చిన్నపిల్లల భవిష్యత్తు మాత్రం ఎవరికీ కనబడటం లేదని వాపోతున్నారు.. ఇక బీజేపీ, ఎంపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ సహా అన్ని పార్టీల నేతలు రాజకీయ సమావేశాలు పెట్టి జవహర్ సమస్యపై స్పీచ్ లు ఇస్తున్నారే గాని శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. మరోవైపు ఇక్కడి భూగర్భ జలాలు పూర్తిగా విషపూరితమయ్యాయి.

డంప్‌యార్డ్‌కు దిగువన ఉన్న బోర్‌వెల్స్ నుంచి వస్తున్న నీటిని ల్యాబ్‌లో పరీక్షించగా అత్యంత భయానక నిజాలు వెలుగు చూశాయి. డంప్ కింది వైపు ఉన్న బోర్ వెల్స్ నీటిని టెస్ట్ చేయగా, ఆర్సెనిక్ లీటర్‌కు 0.28 మి.గ్రా వచ్చిందని నివేదికలు చెబుతుండటం ఇక్కడి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతుంది. ఇక ప్రభుత్వ బీఐఎస్ నిబంధనల ప్రకారం ఆర్సెనిక్ పరిమితి కేవలం లీటర్‌కు 0.01 మాత్రమే. అంటే ఉండవలసిన దానికంటే ఇది ఏకంగా 28 రెట్లు ఎక్కువగా ఉందని తెలుస్తుంది.

మరోవైపు ఆర్సెనిక్‌కు రంగు గానీ, వాసన గానీ ఉండవు కాబట్టి గ్లాసులో నీటిని చూసి అది కలుషితమైందని ఎవరూ గుర్తించలేరు. ఇక డంప్ నుంచి కారే నల్లటి నీటిని 'లీచేట్' అంటారు. ఈ మురుగు నీరు భూమిలోకి ఇంకిపోయి, బోర్ల ద్వారా ప్రజల కడుపులోకి చేరుతోంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే చెత్తను కాల్చి విద్యుత్ తయారు చేసే 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ ఉండగా, ఆ చెత్తను కాల్చగా వచ్చిన మిగిలిన బూడిద పై కూడా భయంకరమైన నివేదికలు బయటపడినట్టు చెబుతున్నారు..

ఆగస్టు 2025లో సీపీసీబీ-ఎన్‌జీటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఈ బూడిదలో కాడ్మియం కేజీకి 850 మి.గ్రా పైనే ఉందట. డబ్ల్యూహెచ్‌ఓ సేఫ్ లిమిట్ కేవలం 0.8 మాత్రమే. అంటే లెక్కకు మించి వేల రెట్లు ఎక్కువ మోతాదులో ఈ విషపూరిత పదార్థాలు ఉన్నాయని నివేదికలు తేల్చాయి.. దీనిపై స్పందించిన ఎన్‌జీటీ 2025 అక్టోబర్ 28వ తేదీన కీలక ఆదేశాలు జారీ చేస్తూ, ఇకపై అక్కడ కొత్త చెత్త వేయవద్దని స్పష్టం చేసింది.

అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు జీహెచ్‌ఎంసీ, రామ్‌కీ సంస్థలకు రూ. 1 లక్ష జరిమానా విధించింది. అయితే జరిమానతో ఇక్కడి పరిస్థితిలో మార్పు రాలేదు.. ఆ డబ్బులు కట్టి.. ఆ సంస్థ చేతులు దులుపుకుందనే ఆరోపణలున్నాయి.. ఇక ఇంత మంది ప్రాణాలు రిస్క్ లో పడుతున్నా ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందో ఎవరికి అర్థం కావడం లేదని అనుకుంటున్నారు.

ఎందరు ఈ సమస్య పై పోరాడిన.. ప్రభుత్వాలు మాత్రం చీమకుట్టినట్టు అయిన స్పందించకపోవడం శోచనీయం.. జవహర్ నగర్ డంప్ యార్డ్ వల్ల నలిగిపోతున్న జీవితాల కన్నీటి గాధలు అంటే పాలకులకు అంత చులకనైపోయాయా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేడు జవహర్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల గొంతుక నుంచి వస్తున్న ఆవేదన ఒక్కటే.. బూడిదను ల్యాబ్‌లో కొలిచారు, నీళ్లను బోర్లలో కొలిచారు, మీథేన్‌ను ఆకాశం నుంచి కొలిచారు.. కానీ ఈ పీల్చే గాలితో, తాగే నీటితో క్షణక్షణం అల్లాడిపోతున్న అభాగ్యుల ప్రాణాలను కొలిచేవారే కరువయ్యారు. అందుకే ఈ సందర్భంగా..

ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?

నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం!

నరజాతి చరిత్ర సమస్తం పరస్పర పోరాటాలూ,

నరజాతి చరిత్ర సమస్తం రణరక్తం, రణరంగం!

రాక్షసులవి, పిశాచాలవి, రాజ్యాల కాంక్షలన్నీ,

మనుషుల బతుకులు బలిపెడుతూ, సాగిన యుద్ధాలన్నీ!

రణరంగం కాని చోటు, భూదేవికి ఎక్కడ వెతికినా లేదు!

గతమంతా రక్తాసిక్తం, కాకపోతే కథల గతి ఇంకేమిటి?

ఏ రాజు కట్టిన ఏ కోటకూ, ఏ శిల్పి చెమట చుక్క పునాది?

ఏ సైన్యం నడిచిన ఏ బాటకూ, ఏ కూలీ రక్తం ధార?

శిబిరాల ప్రశస్తి మాత్రమే, శిల్పాల ఖ్యాతి మాత్రమే,

చరిత్ర పుటల్లో నిలిచింది, శ్రామికుడి శ్రమను మరచింది!

సామాన్యుడి శ్రమశక్తిని, దోచుకున్న ధనికుల కథలే,

రాజకీయ నాయకుల వ్యూహాలే, నేటికీ చరిత్రల రూపులే!

ఇకనైనా మారాలి చరిత్ర, శ్రామికుడి శ్రమకు దక్కాలి గౌరవం,

నవయుగపు బాటల్లో సాగాలి, నరజాతి విముక్తి ప్రస్థానం!

అని శ్రీశ్రీ గారు రాసిన.. సామాజిక అభ్యుదయ వచన కవిత గుర్తుకు వస్తుంది. ఇక ఈ ప్రపంచం ఉన్నంత వరకు పేదల శ్రమ దోపిడి ఆగదు.. రాజకీయ పదవుల దాహం తీరదు.. నేతల ఆశలు చావవు.. అందుకే..

జవహర్ నగర్ జనాల బ్రతుకులను చిదిమేస్తున్నాయి చెత్త కుప్పలు!..

నల్లబడిన ఊపిరితిత్తులు... నరకప్రాయపు విషవాయువులు!..

నగర మురికిని మోస్తూ...తగ్గిపోతున్నవి ఇక్కడ ఆయువులు!..

కలుషితమైన తాగునీరుకు.. జనం అవుతున్నారు బలిపశువులు!..

ఓట్ల వేటలో వచ్చే పాలకులకు... కనపడవా ఈ కన్నీటి ధారాలు!..

అంటూ మరో ఉద్యమం చేయవలసి వస్తుందని అంటున్నారు.. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు ఈ అంశం పై స్పందించిన.. ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదనేది బహిరంగ ఆరోపణలు.. ఇక ముందు కూడా ఈ యార్డ్ తరలిస్తారా? లేదా అనేది తెలియదు గానీ, రానున్న ఎన్నికల్లో ఈ అంశం కూడా ఎన్నికల ప్రచారంలో నేతలకు ఒక ఆయుధంగా మారే అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తుంది..

#Jawaharnagar Dump Yard#Hyderabad Pollution#Methane Emissions#Telangana Government#Waste Management Crisis#Environmental Pollution#Public Health Crisis#NGT Orders#Groundwater Contamination#Hyderabad News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి