National

PM Modi: దేశాన్ని ముక్కలు చేసే వాళ్లంతా ఒక్కటయ్యారు.. ప్రధాని మోడీ ఆరోపణలు!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

PM Modi: భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీయాలని చూస్తున్న శక్తులన్నీ ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్స్ చేశారు. దేశాన్ని ముక్కలు చేయాలనే దురుద్దేశంతో భారత వ్యతిరేక శక్తులు ఏకమై కుట్రలు పన్నుతున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

PM Modi: భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీయాలని చూస్తున్న శక్తులన్నీ ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్స్ చేశారు. దేశాన్ని ముక్కలు చేయాలనే దురుద్దేశంతో భారత వ్యతిరేక శక్తులు ఏకమై కుట్రలు పన్నుతున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా నిర్వహించిన 'రాష్ట్రీయ ఏకతా దివస్' వేడుకల్లో పాల్గొన్న ప్రధాని, విపక్షాలు, విభజన శక్తులపై నిప్పులు చెరిగారు.

అబద్ధాలు, వదంతులతో అశాంతికి కుట్ర

దేశాన్ని అంతర్గతంగా బలహీనపరిచేందుకు 'దిమాగీ నక్సల్స్' (మేధో నక్సలైట్లు) సిద్ధమయ్యారని, ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. "భారత వ్యతిరేక శక్తులన్నీ ఏకమై దేశంలో చీలికలు తేవాలని చూస్తున్నాయి. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని పచ్చి అబద్ధాలు, విషపూరిత వదంతులు వ్యాప్తి చేస్తూ దేశంలో అశాంతిని, అస్థిరతను సృష్టించే కుట్రలో మునిగిపోయాయి. స్వార్థ రాజకీయాల కోసం మాతృభూమి బిడ్డల మధ్య గొడవలు పెడుతున్నారు" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య బాధ్యతలను విస్మరించిన విపక్షాలు

దేశంలోని ప్రతిపక్షాల వైఖరిపై మోడీ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం విపక్షాలు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పూర్తిగా విడిచిపెట్టాయని ఆరోపించారు. "వారు చేస్తున్నది ప్రజా సమస్యలపై నిరసనలు కావు.. దేశ ప్రగతికి అడుగడుగునా వేస్తున్న అడ్డంకులు. నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి దేశాభివృద్ధిని అడ్డుకోవడమే రాజకీయంగా మార్చుకున్నారు. రాజ్యాంగ మర్యాదలను సైతం భగ్నం చేస్తూ సమాజాన్ని విభజించే శక్తులతో చేతులు కలుపుతున్నారు" అని మండిపడ్డారు. గతంలో పేదరికాన్ని నిర్మూలిస్తామని నినాదాలతో ఓట్లు దండుకున్న వారే సంపన్నులయ్యారని, పేదల జీవితాలు మాత్రం మారలేదని ఎద్దేవా చేశారు.

ప్రపంచ సంక్షోభం ఎదురైనా తట్టుకున్నాం

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం ముదిరి అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేషన్లు పెట్టే పరిస్థితి వచ్చినా.. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఆ సంక్షోభం నుంచి తన పౌరులను కాపాడుకోగలిగిందని ప్రధాని గుర్తుచేశారు. భారత్ కుప్పకూలిపోతుందని అంతర్జాతీయంగా అంచనాలు వేసిన సమయంలో దేశ వ్యతిరేక శక్తులు విపరీతంగా చురుగ్గా మారాయని, అయితే ఆ కుట్రలన్నింటినీ దేశ సామర్థ్యంతో తిప్పికొట్టామని తెలిపారు. బాహ్యంగా ఎన్ని కుట్రలు పన్నినా, భారతీయుల ఐక్యతే దేశానికి అతిపెద్ద రక్షణ కవచమని స్పష్టం చేశారు. అంతకుముందు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ పటేల్‌కు నివాళ్లు అర్పించిన మోడీ, వేలాది మంది జవాన్లు నిర్వహించిన పరేడ్‌ను తిలకించారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే ఏ కుట్రనూ సాగనివ్వబోమని, సర్దార్ పటేల్ స్ఫూర్తితో దేశ ఐక్యతను కాపాడుకుంటామని ప్రధాని తేల్చిచెప్పారు.

#PM Modi#Narendra Modi#Prime Minister Narendra Modi#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి