Harish Rao: అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే వస్తుందని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. అబద్ధానికి అంగీ లాగు తొడిగితే అచ్చం రేవంత్ రెడ్డి లెక్కే ఉంటుందన్నారు. వంటంతా మేము వండితే, చివర్లో గంట తిప్పి నేనే వండినా అంటున్నారు అని సీఎం రేవంత్ పై ధ్వజమెత్తారు. ఇది ఓట్ చోరీ కాదు, పక్కా క్రెడిట్ చోరీ అంటూ సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు. జడ్జిమెంట్ కాపీ చేతికి రాకముందే మియాపూర్ భూములు అమ్మమని కలెక్టర్‌ను సీఎం రేవంత్ పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారు? అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీశ్ రావు.
ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు తెచ్చారు
''మంచిరేవుల గ్రేహౌండ్స్ భూమి కేసు 2010లో కాంగ్రెస్ హయాంలో ఓడిపోయింది. నాడు ఏజీని కోర్టుకు పంపకుండా చిన్న జీపీని పంపి ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు తెచ్చారు. 2017 మే 19న కేసీఆర్ ఆదేశాలతో దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను నియమించాం. 2021 డిసెంబర్ 31న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 2023 ఆగస్టు 1న సుప్రీంకోర్టులో 142 ఎకరాలు ప్రభుత్వానివేనని తుది తీర్పు వచ్చింది. అప్పుడున్నది కేసీఆర్ ప్రభుత్వమే'' అని హరీశ్ రావు తెలిపారు.
కాంగ్రెస్ ఓడిపోయిన భూమిని బీఆర్ఎస్ గెలిచింది
కాంగ్రెస్ ఓడిపోయిన భూమిని గెలిపించింది మేమే అన్న హరీశ్ రావు.. నిందలు మాత్రం మాపైనే అని వాపోయారు. 30 ఏళ్ల గ్రేహౌండ్స్ ప్రహరీ గోడను రాత్రికి రాత్రే కూల్చేశారని ఆరోపించారు. రెండు రోజుల్లో లోపలికి కొత్త గోడ కట్టారు.. టెండర్ ఎవరిచ్చారు? అని నిలదీశారు. 10 ఎకరాల 10 గుంటల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు వదిలేశారని ఆరోపించారు.
1,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి కొల్లగొట్టారు
''గండిపేట ఎస్ఆర్ఓలో డాక్యుమెంట్ నం. 8886/2026 జీరో వాల్యూ రిజిస్ట్రేషన్. మార్కెట్ విలువ రూ.45.39 కోట్లు, కన్సిడరేషన్ వాల్యూ సున్నా. 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజులో ఒక్క రూపాయి కూడా కట్టలేదు. డ్రీమ్ వ్యాలీ సంతోష్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్, వెంటనే మరో 20 రిజిస్ట్రేషన్లు. ఎకరం రూ.100 కోట్లు పలికే చోట రూ.1,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి కొల్లగొట్టారు'' అని ఆరోపించారు.
మంచిరేవులలో 2వేల కోట్ల కుంభకోణం
''భూభారతిలో ఈరోజుకీ ఆ భూమి గ్రేహౌండ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ పేరు మీదే ఉంది. ముఖ్యమంత్రి కనుసన్నల్లో కాకపోతే గ్రేహౌండ్స్ గోడ కూల్చే దమ్ము ఎవరికుంటుంది? ఫైరింగ్ రేంజ్ కోసం సేకరించిన మరో 10 ఎకరాల నోటిఫికేషన్ రద్దు అప్పీల్‌కు వెళ్లలేదు. జడ్జి పేరా 134లో కొత్త నోటిఫికేషన్ ఇవ్వొచ్చని రాసినా మూడు నెలలుగా కదలిక లేదు. మంచిరేవులలో మొత్తంగా రూ.2,000 కోట్ల కుంభకోణం. గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడిని జైలుకి పంపింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రిజిస్ట్రేషన్ చేసిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అదేరోజు కేసీఆర్ సస్పెండ్ చేశారు. 2016 జూన్ 1న జీవో 45తో జాగీర్ అబాలిషన్ యాక్ట్‌కు చట్టబద్ధత కల్పించాం'' అని హరీశ్ రావు తెలిపారు.
మియాపూర్ తీర్పునకు పునాది 2023లో
''మియాపూర్ కేసు సుప్రీంకోర్టులో 192 సార్లు విచారణకు వచ్చింది. అందులో 86 సార్లు వాదించింది బీఆర్ఎస్ నియమించిన వైద్యనాథన్. కాంగ్రెస్ వచ్చాక జరిగింది కేవలం 11 విచారణలు మాత్రమే. మియాపూర్ తీర్పునకు పునాది 2023లో మేము గెలిచిన ట్రినిటీ తీర్పులోని పేరా 93. భూపాలపల్లి అటవీ భూముల కేసును టీడీపీ, కాంగ్రెస్ 20ఏళ్లు పట్టించుకోలేదు. 2021లో అక్రమార్కులను అరెస్ట్ చేసి జైలుకి పంపింది కేసీఆర్ ప్రభుత్వమే. భూమి కట్టబెట్టే ఉద్దేశమే ఉంటే వాళ్లను ఎందుకు అరెస్టు చేస్తాం?'' అని హరీశ్ రావు నిలదీశారు.
ఆ టీడీపీ ముఠాలో రేవంత్ రెడ్డి భాగస్వామి కాదా?
''SLP 6937/2021 దాఖలు చేసి మూడేళ్లు పోరాడింది బీఆర్ఎస్. 2024 ఏప్రిల్ 18న తీర్పు అధికారంలోకి వచ్చి మూడు నెలలకే రేవంత్ గెలిచాడా? ఐఎంజీ బిల్లీరావుకు ఎకరం రూ.50 వేలకు 850 ఎకరాలు కట్టబెట్టింది చంద్రబాబే. ఆనాడు ఆ టీడీపీ ముఠాలో రేవంత్ రెడ్డి భాగస్వామి కాదా? ఐఎంజీ కేసులో 9ఏళ్లు పోరాడింది బీఆర్ఎస్.. తీర్పు వచ్చింది 2024 మార్చి 7న/. అప్పటికి రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు. కంచ గచ్చిబౌలిలో చెట్లు నరికి జింకలను ఆగం చేసినందుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్‌లో కుదువపెట్టారు. రూ.10 వేల కోట్ల అప్పు కోసం ముంబై బ్రోకర్‌కు రూ.400 కోట్ల కమిషన్ ఇచ్చారు. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి'' అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీశ్ రావు.


