తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ మరో కొన్ని గంటల్లో ముగియనున్న క్రమంలో ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించేందుకు ఎన్నికల సంఘం నేటి అర్ధరాత్రి 12 గంటల వరకు అవకాశం కల్పించింది.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలించారు. మొత్తం 3 కోట్ల 38 లక్షల 26 వేల 448 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు పేర్కొనగా.. ఇప్పటివరకు 2 కోట్ల 64 లక్షల 30 వేల 494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
మరోవైపు 73 లక్షలకుపైగా ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా తిరిగి రాలేదని, అలాగే ఎస్‌ఐఆర్ పరిశీలనలో దాదాపు 45 లక్షల షిఫ్టెడ్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. మరో 9 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు రిపోర్టులు అందాయని తెలిపిన అధికారులు.. దాదాపు 6 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 94.30 శాతం డిజిటలైజేషన్ పూర్తైంది. మెదక్‌లో 90.54 శాతం, సూర్యాపేటలో 90.43 శాతం నమోదైంది. కుమురం భీమ్ ఆసిఫాబాద్‌లో 89.45 శాతం, జగిత్యాలలో 89.60 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది.
కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. హైదరాబాద్‌లో 58.58 శాతం, మేడ్చల్-మల్కాజిగిరిలో 63.82 శాతం, రంగారెడ్డిలో 64.91 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తైనట్టు సమాచారం. మరోవైపు రెండు సార్లు గడువు పొడిగించినా.. ఈ జిల్లాల్లో డిజిటలైజేషన్ శాతం ఆశించిన స్థాయిలో పెరగలేదని తెలుస్తుంది.
ఇక ఈ డిజిటలైజేషన్ కు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17న విడుదల కానుంది. ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరిస్తారు. చివరగా అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారని తెలుస్తుంది.
మరోవైపు ఎస్‌ఐఆర్‌లో గుర్తించిన షిఫ్టెడ్, మరణించిన, డూప్లికేట్ ఓట్లపై ఎన్నికల సంఘం అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించనుంది? తొలగింపులకు ముందు అభ్యంతరాలకు ఎలాంటి అవకాశం ఉంటుంది? అనే అంశాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రేపు సాయంత్రం ఎన్నికల అధికారులు పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం..












