బీజేపీ ఎంపీ అరవింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి సీఎం గా ఉన్న రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తన సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన షెల్ కంపెనీకి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టారని మండిపడ్డారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు తయారు చేస్తామనే పేరుతో టెసరాక్ అడ్వాన్స్ సిస్టమ్స్ కు భూమి కేటాయించడంపై ఎంపీ అరవింద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కంపెనీ గురించి వెతికితే రక్షణ, ఏరోస్పేస్ రంగాల ఉత్పత్తులు కాదు.. బట్టలకు రంగులు వేసే యంత్రాలు, స్పేస్‌ఎక్స్ వెబ్‌సైట్ ఫొటోలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అసలు రక్షణ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల జాబితాలో ఈ టెసరాక్ అడ్వాన్స్ సిస్టమ్స్ పేరు లేదని ఆరోపించారు.
మరోవైపు శంషాబాద్ సమీపంలోని రవిర్యాల్, మహేశ్వరం ప్రాంతంలో దాదాపు 5 ఎకరాల విలువైన భూమిని కేవలం రూ.7.5 కోట్లకే సీఎం.. కొండల్ రెడ్డి కంపెనీకి కేటాయించారని అరవింద్ ఆరోపించారు. మార్కెట్ విలువతో పోలిస్తే సుమారు రూ.119 కోట్ల మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి చలవే అన్నారు..
ఈ భూకేటాయింపులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం ఉందా? ఉంటే ఎలా ఇచ్చారు? అనే విషయాలను మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేసిన అరవింద్.. ఈ ఆరోపణలపై ప్రభుత్వం, సంబంధిత కంపెనీ వివరణ ఇవ్వాల్సి ఉందని అన్నారు.. ఇక రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి కారణం తన తండ్రి డి.శ్రీనివాస్ అని గుర్తుచేశారు
గతంలో యూపీఏ-1, యూపీఏ-2 కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే మా నాన్న శ్రమ వల్లనే అని పేర్కొన్నారు.. తన తండ్రి కాంగ్రెస్ వ్యక్తి అయినంత మాత్రాన తాను మాత్రం కాదని.. తన డీఎన్ఏలో కాంగ్రెస్ భావజాలం ఏమాత్రం లేదని వివరించారు.
ముఖ్యమంత్రి తన బంధువుల షెల్ కంపెనీలకు ఇంకా ఎన్ని కోట్ల విలువైన భూములు కేటాయించారో తప్పక బయట పెడతామని అరవింద్ హెచ్చరించారు.. అయితే సీఎం లాగా తన వద్ద ఎలాంటి అక్రమ సంపాదన లేదని స్పష్టం చేశారు.












