Fire Incident: పొట్ట కూటి కోసం, ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లారు. అక్కడ కష్టపడి పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. పని చేయగా వచ్చిన డబ్బును స్వదేశాల్లో ఉన్న తమ కుటుంబాలకు పంపి వారి ఆకలి తీరుస్తున్నారు. అలాంటి వారి జీవితాలను అగ్నిప్రమాదం బుగ్గిపాలు చేసింది. ఘోర అగ్ని ప్రమాదం వలస కార్మికులను పొట్టన పెట్టుకుంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఈ ఘోరం జరిగింది.
రియాద్ లోని ఓ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 16 మంది చనిపోయారు. మృతులంతా అక్కడ పని చేసే కార్మికులు. వారంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు. మంటల్లో సజీవ దహనం అయ్యారు. కాగా, సౌదీలో దాదాపు 35 లక్షల మంది బంగ్లాదేశీయులు పని చేస్తున్నారని సమాచారం.
రియాద్‌లోని మూసా సనాయా ప్రాంతంలో ఈ సోఫా తయారీ ఫ్యాక్టరీ ఉంది. అందులో అగ్నిప్రమాదం జరిగి 16 మంది బంగ్లాదేశ్ జాతీయులు మరణించారని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపింది.
సోఫా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి, మంటలు వేగంగా వ్యాపించినట్లు సమాచారం. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రియాద్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను గుర్తించడానికి, మృతదేహాలను స్వదేశానికి రప్పించడానికి అవసరమైన లాంఛనాలను పూర్తి చేయడానికి సౌదీ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడంతో పాటు, బాధితులకు సాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. "రియాద్‌లోని ముసా సనైయా ప్రాంతంలో సంభవించిన విషాదకరమైన అగ్నిప్రమాదంలో బంగ్లాదేశ్ ప్రవాసులు ప్రాణాలు కోల్పోవడం పట్ల మేము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, రియాద్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి చెందిన బృందం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించడం ప్రారంభించింది.
మృతుల గుర్తింపును నిర్ధారించడం, చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడం , బాధితులకు సమగ్ర సాయం వంటి అన్ని అవసరమైన చర్యలను ప్రభుత్వ అత్యున్నత స్థాయి ఆదేశాలకు అనుగుణంగా రాయబార కార్యాలయం చేపడుతోంది" అని రియాద్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
అగ్ని ప్రమాదంలో తమ వారు చనిపోయారని తెలిసి మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఉపాధి కోసం వెళ్లి విగతజీవులుగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












