రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం లేఖ రాశారు.రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్‌చేయాలని అందులో పేర్కొన్నారు.రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటలు సాగు కాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లో ఉన్న అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి, సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని కోరారు. దాని కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
ఒకవైపు ఎల్‌నినో వల్ల తక్కువ వర్షపాతం, మరోవైపు ప్రాజెక్టుల్లో నీళ్లు లేక రైతులు ఆందోళనలో ఉన్నారని.. వానాకాలం పంట సాగుకు సాగునీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారని వివరించారు. అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్ (LMD) పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 6.9 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని లేఖలో ప్రస్తావించారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని నింపి SRSP STAGE-2లోని ఆయకట్టుకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
https://x.com/TeluguScribe/status/2086714019503857892?s=20
గత యాసంగి పంటలో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో 4 లక్షల ఎకరాలు సాగైన విషయం గుర్తించి, ఈ వానాకాలం పంటకు, అదేవిధంగా వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందేలా కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు రాసిన లేఖ వైరల్ అవుతోంది.












