ఆషాఢమాసం చివరివారం కావడంతో హైదరాబాద్ మహానగరంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న లాల్ దర్వాజా బోనాలు వైభవంగా జరగగా.. మంత్రులు, కీలక నేతలు,సినీ ప్రముఖులు సైతం అమ్మవార్లను దర్శించుకుని సందడి చేశారు.భక్తులు అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గల్లీగల్లీల్లో అమ్మవార్ల ఘటాల ఊరేగింపు ఘనంగా కొనసాగుతున్నాయి.ఇదిలాఉండగా, సోమవారం ఉప్పుగూడలో బోనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.
అయితే, ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. సమాజంలో పుణ్యం తగ్గి, పాపం ఎక్కువైపోతోందని అన్నారు. తప్పులు సరిదిద్దుకోకపోతే పాపాలు ఎక్కువై కుండపోత వర్షాలు వచ్చి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రజలు భక్తి మార్గం అనుకుని మూఢనమ్మకాల వెంట వెళ్తున్నారని, తన పేరిట కొందరు బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.పెద్దల మాట విని, సాంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. తప్పు చేసిన వారిని తానే శిక్షిస్తున్నానని, ఎంత తప్పు చేసినా తన పిల్లలేనని ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పారు. భక్తులు తనను ఎంత గొప్పగా కొలుచుకుంటే అంత ఆనందంగా ఉంటానని, కోరిన కోరికలన్నీ నెరవేర్చి ప్రజలను చల్లగా చూసుకుంటానని అభయమిచ్చారు.కాగా,మాతంగి అనురాధ భవిష్యవాణిపై భక్తులు కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.












