అభిప్రాయం

మహిళల వస్త్రధారణపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వృత్తి, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని ఆమె తెలిపారు.

ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వృత్తి, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని ఆమె తెలిపారు. అమరులైన కుమారుల త్యాగాలను తలచుకుంటూ ఆ తల్లులు వ్యక్తపరిచిన ఆవేదన ఒక తల్లిగా తనను లోతుగా ప్రభావితం చేసిందని, అలాంటి సందర్భాల్లో కన్నీళ్లు ఆపుకోవడం ఎవరికైనా సాధ్యం కాదని అన్నారు.

సమాజంలో మహిళల వస్త్రధారణపై ఉండే అభిప్రాయాలపై స్మితా సబర్వాల్ స్పందిస్తూ.. ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా మహిళల వ్యక్తిగత సౌకర్యం, ఎంపికకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఐఎఫ్ఎస్ సాధించిన ఓ యువతిని ఉదాహరణగా చూపిస్తూ, ఆత్మవిశ్వాసంతో పని చేయగలిగినప్పుడు ఏ వస్త్రధారణలోనైనా తప్పులేదని అభిప్రాయపడ్డారు. సివిల్ సర్వీసెస్‌లో తాను తొలిరోజుల్లో చిన్న వయసులో కనిపించడం వల్ల అధికారికత కోసం చీర ధరించాల్సి వచ్చిందని, అయితే నేటితరం యువతులు పాశ్చాత్య దుస్తుల్లోనూ ఎంతో కాన్ఫిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించడం అభినందనీయమని అన్నారు.

ఒకరి వస్త్రధారణపై కాకుండా, వారి పనితీరుపైనే సమాజం దృష్టి సారించాలని సూచించారు. ఇదే క్రమంలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, భర్త అకున్ సబర్వాల్‌తో తనది పెద్దలు కుదిర్చిన వివాహమని వెల్లడించారు. ఇరు కుటుంబాలు మిలటరీ (ఫౌజీ) నేపథ్యం ఉన్నవి కావడంతో అకాడమీలో కలుసుకున్న తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లిపీటలెక్కామని చెప్పారు. వైవాహిక బంధం కాలక్రమంలో మరింత పరిణతి చెందిన కథగా మారుతుందని వ్యాఖ్యానించారు.

అలాగే తనకు డార్జిలింగ్ టీ పట్ల ఉన్న ప్రత్యేకాభిమానాన్ని, ఇంట్లో అతిథులకు పాలు, చక్కెర లేని డికాక్షన్ టీ ఇచ్చే సంప్రదాయాన్ని వివరించారు. సినిమాలు చూడటం ఇష్టమని, ఓటీటీలో ఇటీవల 'ఓపెన్‌హైమర్', 'గుంటూరు కారం' చిత్రాలు చూశానని చెప్పారు. హాలీవుడ్ చిత్రం 'మనీబాల్' లోని డేటా, వ్యూహాల అంశాలు జీవితానికి, పాలనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు.

 

#IASSmitaSabharwal#WomenEmpowerment#SmitaSabharwalInterview#TelanganaIAS#BureaucratsNews#TelanganaNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి