పార్లమెంటు భవనం వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు సాగించిన బలప్రయోగాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో నిరసించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ, పాలకులు దోషులైనా అయ్యుండాలి లేదా తీవ్ర అసమర్థులైనా అయ్యుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా 'ఎక్స్' (X) లో ఆయన ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.
తమ హక్కులు, సమాధానాల కోసం పార్లమెంట్ వైపు వెళ్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అత్యంత అనాగరికంగా వ్యవహరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. శాంతియుతంగా ప్రశ్నలు అడిగిన యువతపై పెల్లెట్ గన్నులు, ముళ్ళు ఉన్న బాటన్లు, టియర్ గ్యాస్‌లు ఉపయోగిస్తూ పోలీసులు విరుచుకుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో పలువురు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయని, కొందరికి ఎముకలు విరిగి ఆసుపత్రి పాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత 20 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఈ తీవ్రమైన ఘటనపై కేంద్ర హోం మంత్రి సభకు వచ్చి స్పందించకపోవడం దారుణమని రాహుల్ మండిపడ్డారు. విద్యార్థులపై జరిగిన బలప్రయోగంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన ప్రతీ తీర్మానాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తిరస్కరించిందని విమర్శించారు. సభలో ప్రభుత్వం వహిస్తున్న ఈ మౌనం కేవలం నిర్లక్ష్యం కాదని, అక్కడ జరిగిన హింసకు పరోక్షంగా ఇచ్చిన ఆమోదముద్ర అని దుయ్యబట్టారు.
ఈ మొత్తం ఉదంతంపై నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాలంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే సమగ్ర విచారణ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు, అలాగే బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాల పోరాటం ఆగదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.












