అధికారం తాలూకు జ్ఞాపకాలు మరవని బీఆర్ఎస్.. మళ్ళీ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పవర్ లోకి రావడం ఖాయమనే భ్రమలో ఉందని సందర్భం వచ్చినప్పుడల్లా నిరూపించుకుంటూనే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మొదలు పెట్టిన ఈ మాటలు ఇప్పటికీ వల్లే వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని జనం అనుకుంటున్నారు.
పదవుల పై ఉన్న వ్యామోహమో.. లేక అధికారం లేకుండా బ్రతకడం కష్టమనే భావనేమో కానీ కేటీఆర్-హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎప్పుడు సభ పెట్టిన, చిన్న మీటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ పై చులకనగా మాట్లాడటం.. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే దిక్కనే కోణంలో విమర్శలు చేయడం తరచుగా కనిపిస్తుంది. తాజాగా కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
వరంగల్‌లో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న కేటీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రజా ప్రయోజనాలే ఊపిరిగా జీవించిన ఒక నిజమైన ప్రజా నాయకుడిని కోల్పోవడం ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. నర్సంపేట ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సదుపాయాలు అందించాలనేది పెద్ది కోరిక అని కేటీఆర్ గుర్తుచేశారు.
మెడికల్ కాలేజీ సాధన కోసం పెద్ది అనుక్షణం పరితపించారని, రాబోయే రోజుల్లో ఆ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరే పెడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడే కాదని, సమాజ శ్రేయస్సు కోరే గొప్ప అభ్యుదయ వాదని కొనియాడారు. పెద్ది కుటుంబానికి, అలాగే కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసి కేటీఆర్.. రాబోయే రెండేళ్లలో మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేబట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతాయని అన్నారు. ఇక పెద్ది ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు..












