Fishermen Insurance: తెలంగాణలోని మత్స్యకారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ గ్రూప్ ప్రమాద బీమా పథకం తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ప్రమాద బీమా స్కీమ్ అమలు చేయనున్నట్లు వివరించారు.
చేపల వేటకు వెళ్లిన సమయంలో లేదా ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తి వైకల్యానికి గురైనా ఆ కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం లభిస్తుంది. ప్రమాదాల వల్ల పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.2.50 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.25వేల వరకు అందిస్తారు.
''18 నుంచి 70 ఏళ్ల వయసు వారికి ఇది వర్తిస్తుంది. 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కో లబ్ధిదారునికి రూ.79.96 బీమా ప్రీమియం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియం భరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21,34,79,673 చెల్లిస్తుంది. దాంతో మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు'' అని మంత్రి శ్రీహరి వెల్లడించారు.
గ్రూప్ ప్రమాద బీమా..
ప్రమాదవశాత్తు మరణానికి - 5లక్షలు
శాశ్వత పూర్తి వైకల్యానికి - 5లక్షలు
పాక్షిక వైకల్యానికి - 2.50 లక్షలు
ఆసుపత్రిలో చికిత్స కోసం 25వేలు వరకు వైద్య సాయం
మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ ప్రమాద బీమా పథకాన్ని 2026 జూన్ 1 నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీహరి వెల్లడించారు. ప్రమాద సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలవడం, వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారాయన.












