తెలంగాణ

DGP CV Anand: మావోయిస్టు స్థావరం నుంచి పర్యాటక కేంద్రంగా కర్రెగుట్ట- డీజీపీ సీవీ ఆనంద్

రచన: NK••5 నిమిషాల పఠనం

ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్టలో 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు శాంతి నెలకొందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తామన్నారు. కర్రెగుట్టలో అభివృద్ధి, పర్యాటక మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. సోమవారం ములుగు జిల్లా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు.

DGP CV Anand: ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్టలో 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు శాంతి నెలకొందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తామన్నారు. కర్రెగుట్టలో అభివృద్ధి, పర్యాటక మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు.

సోమవారం ములుగు జిల్లా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, శాంతికి ప్రతీకగా పావురాలను ఎగురవేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్, స్పెషల్ పోలీస్ బలగాలు, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్ల వల్ల ఈ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ తెలిపారు. ఆపరేషన్ కగార్ సమయంలో దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. పలువురు కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో మృతి చెందగా మరికొందరు జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారని చెప్పారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొద్దిమంది కేంద్ర కమిటీ స్థాయి నేతలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని డీజీపీ వివరించారు. ఆర్థిక సాయం, భూమి కేటాయింపు, జీవనోపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారు సమాజంలో తిరిగి స్థిరపడేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వివరించారు.

పర్యాటక కేంద్రంగా కర్రెగుట్ట

కర్రెగుట్టకు అపారమైన పర్యాటక అవకాశాలు ఉన్నాయని సీవీ ఆనంద్ తెలిపారు. పర్యావరణ, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. పామూరు నుంచి చలమాదవ వరకు తారు రోడ్డు పనులు పూర్తయ్యాయని, త్వరలో బీటీ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారి కనెక్టివిటీ మెరుగుపరచడంతో పాటు విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్, ఇతర మౌలిక వసతులను కల్పించి పర్యాటక అభివృద్ధికి అనుకూల వాతావరణం సృష్టించనున్నట్లు చెప్పారు. అటు పామూరు క్యాంపు సమీపంలో నివసిస్తున్న గుత్తి కోయ కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు డీజీపీ ఆనంద్. ప్రభుత్వం నుంచి నిరంతర సహకారం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు.

సీఆర్పీఎఫ్ సేవలకు ప్రశంసలు

మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో దశాబ్దాలుగా రాష్ట్ర పోలీసులతో కలిసి పని చేస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది సేవలను డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా ప్రశంసించారు. కఠినమైన అటవీ ప్రాంతాల్లో 196వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ సిబ్బంది నెలల తరబడి కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్నారని, వారి అంకితభావం, వృత్తి నైపుణ్యం ఈ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించాయని కితాబిచ్చారు.

#DGP CV Anand#Tourism#Telangana#Mulugu#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి