తెలంగాణ

Ration Rice Mafia: రేషన్ ‘బినామీ’ దందా.. పేదల బియ్యం పెద్దల జేబుల్లోకి! జోగుళాంబ గద్వాల జిల్లాలో గాడి తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థ

రచన: NK••5 నిమిషాల పఠనం

Ration Rice Mafia: పేదవాడి ఆకలి తీర్చాల్సిన ఉచిత రేషన్ బియ్యం.. అక్రమార్కుల జేబులు నింపుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) పూర్తిగా పక్కదారి పట్టింది. పేరుకేమో ప్రభుత్వం కేటాయించిన అసలు డీలర్లు.. క్షేత్రస్థాయిలో మాత్రం అంతా బినామీల హవా! రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారుల కళ్ల ముందే ఈ దందా సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

Ration Rice Mafia: పేదవాడి ఆకలి తీర్చాల్సిన ఉచిత రేషన్ బియ్యం.. అక్రమార్కుల జేబులు నింపుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) పూర్తిగా పక్కదారి పట్టింది. పేరుకేమో ప్రభుత్వం కేటాయించిన అసలు డీలర్లు.. క్షేత్రస్థాయిలో మాత్రం అంతా బినామీల హవా! రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారుల కళ్ల ముందే ఈ దందా సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

షాపులు ఒకరివి.. పెత్తనం మరొకరిది!

జిల్లా వ్యాప్తంగా 333 చౌక ధరల దుకాణాలు ఉండగా, ఒక్క గద్వాల పట్టణంలోనే సుమారు 27 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలగించిన డీలర్ల స్థానంలో నియమించిన ఇన్‌చార్జీలు లేదా అసలు డీలర్లు మాత్రమే పంపిణీ చేయాలి. కానీ గద్వాల పట్టణంలోని 29, 32, 37, 38, 44, 47 సంఖ్యలు కలిగిన దుకాణాల్లో అసలు డీలర్లకు, నిర్వహించే వ్యక్తులకు అసలు సంబంధమే లేదు! నిబంధనలకు విరుద్ధంగా బినామీలే షాపులు నడిపిస్తు రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తున్నారు.

తహసీల్దార్ ఆఫీసులోనే 'ఈ పాస్' దందా!

అత్యంత గోప్యంగా ఉండాల్సిన e-POS మిషన్ల కీలు, డీలర్ల వివరాలు బినామీల చేతికి ఎలా వచ్చాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. బినామీల వేలి ముద్రలను ఏకంగా తహసీల్దార్ కార్యాలయాల్లోనే e-POS యంత్రాల్లో నమోదు చేస్తుండటం గమనార్హం. పౌరసరఫరాల శాఖ రికార్డుల్లోనూ బినామీల బ్యాంక్ ఖాతాలే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే కమీషన్ నేరుగా వీళ్ల ఖాతాల్లోకే జమ అవుతోంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు బినామీలకు 'చుట్టాలు'గా మారిపోవడంతో ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేవారే లేకపోయారు.

'తూతూమంత్రం’ తనిఖీలు.. మామూళ్ల పండగ!

పౌరసరఫరాల శాఖ అధికారుల తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. అధికారులొచ్చిన రోజు డీలర్ల వద్ద ఉన్న రేషన్ కార్డుల నంబర్లు రాసుకోవడం, కార్డుదారితో మాట్లాడినట్లు ఒక నివేదిక రాసి, ఓ వేలిముద్ర తీసుకుని వెళ్లిపోవడం అలవాటుగా మారింది. ఈ 'మమ' అనిపించే తనిఖీల వెనుక ఒక్కో డీలర్ నుంచి స్థాయిని బట్టి రూ. 3,000 నుండి రూ. 5,000 వరకు మామూళ్లు ముడుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

జవాబుదారీ ఎవరు?

పెద్ద ఎత్తున పేదల బియ్యం పక్కదారి పడుతున్నా జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు నోరు మెదపకపోవడం వెనుక అసలు రహస్యమేమిటి? ప్రజాధనం దారి మళ్లుతుంటే బాధ్యత వహించేది ఎవరు? తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, గద్వాల జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలపై సమగ్ర విచారణ కమిటీ వేయాలని, బినామీల e-POS నమోదును రద్దు చేసి, అక్రమాలకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

#Ration Rice Mafia#Illegal Smuggling#Benami Dealers#Ration Shops#Pds#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి